గ్రామాలకు మోదీ విధానాల చావుదెబ్బ (శనివారం నవీనమ్)

0
93

గ్రామాలకు మోదీ విధానాల చావుదెబ్బ
(శనివారం నవీనమ్)

ప్రతి ఒక్కరికీ మంచినీరు, పోషకాహారం, ఇల్లు, కరెంటు, రోడ్ (రోటీ, కపడా మకాన్‌, బిజిలీ, సడక్‌, పానీ) నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం 42 నెలల పాలనలో ఆయా వర్గాలకు ప్రత్యేకంగా చేసింది ఏదీ లేదు… అంతకుమించి వారి స్ధితిగతులు మరింత కష్టంలో కూరుకుపోతున్నాయి. అదే సమయంలో పేదలకు సంపన్నులకు మధ్య ఆర్ధిక అగాధం మరింతగా పెరిగిపోతున్నది. ఒక ఏడాదిలో దేశవ్యాప్తంగా పెరిగిన సంపదలో 73 శాతం కేవలం ఒక శాతమే వున్న సంపన్నుల వద్ద పోగుపడి పోతున్నది. అదానీల సంపద కొద్దికాలంలోనే 4 వేలరెట్లు పెరిగిపోవడమే ఇందుకు ఒక ఉదాహరణ. మోదీ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ఇందుకు కారణం…ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ప్రమేయాలు లేవు, వుండవు. ఇందులో మంచీ చెడులకు పూర్తి బాధ్యత దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానిది మాత్రమే!

వ్యవసాయదారులు, యువత, స్త్రీలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులు, ఇతర వెనుకబడ్డ కులాల వారిలో అత్యధికులు పేదలు. వీరు ఉపాధికి గానీ ఆదాయానికి గానీ భద్రతలేనివారు, వీరిలో 77 శాతం అసంఘటితరంగంలో పనిచేసేవారు. వీరి సంఖ్య 48 కోట్లు. నరేంద్రమోదీ ప్రభుత్వం గడచిన 42 నెలల పాలనలో ఈ వర్గాల ఉన్నతికి చేసిందేమీ లేదు. పైగా నోట్లలరద్దు, జిఎస్టి, బ్యాంకులలో డబ్బు కొరత ల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వర్గాల జీవితాలు కుంగిపోయాయు.. ఇదిగాక అసంఘటిత రంగాలలో పని చేస్తున్న మధ్యతరగతి విద్యావంతుల జీవనాలు తారుమారైపోయాయి.

అపారంగా సహజవనరులు, మానవ వనరులు వున్నా కూడా అవినీతి విస్తరించిపోవడం వల్ల వెనుక బడిన దేశంగానే వుండిపోయాము. మన జనాభా 132 కోట్లు దాటింది. గ్రామీణ జనాభా 68 శాతం, పట్టణ జనాభా 32 శాతం. గ్రామీణ ఆర్థిక రంగం దేశఆర్థిక వ్యవస్థకు ఉత్పాదక కేంద్రం. గ్రామాల్లోనే పేదరికం, పోషక ఆహార లోపాల బాధితులు అధికం. నిరక్షరాస్యులు నిఖరమైన ఉపాధిలేనివారు గ్రామాల్లో అధికం.

గ్రామీణ ఆర్థిక వ్యవస్ధ వర్షాల మీదే ఆధారపడి ఉంది. భూమిగానీ, ఇతర విధాలుగా ఆస్తులు లేనివారు గ్రామీణుల్లో 54 శాతం వున్నారు. వ్యవసాయం ప్రధానమైన వ్యాపకం. ఒకటి లేక రెండు హెక్టార్లు భూమి కలవారు 82 శాతం వ్యవసాయదారులు. మిగిలిన అందరూ ఇతర వృత్తులవారు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ దారులకు తోడ్పాటు అందిస్తూ గ్రామాల్లో జీవిస్తున్నారు.

పట్టణాల ప్రజలు పూర్తిగా తమ నిత్య జీవిత అవసరాలకు పల్లెలపైన ఆధారపడి ఉన్నారు. పల్లె ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడటంవల్ల మార్జినల్‌ వ్యవసాయదారులు, ఇతర వృత్తులవారు, వ్యవసాయ కూలీలు ఏదో విధమైన కూలీ ద్వారా ఆదాయం సంపాదించడానికి నగరాలకు వలసబాట పట్టారు. నగరాల్లో మురికివాడలు పెరిగాయి. వీరికి సౌకర్యాలు అందజేయడానికి పాలక సంస్థల ఇబ్బందులు పెరిగాయి.

స్వాతంత్య్రానంతరం నాలుగు దాశాబ్దాలపాటు మిశ్రమ ఆర్థిక విధానం అమలు జరిగింది. ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేటు రంగం దేశాభివృద్ధికి తోడ్పడింది. సాగునీరు, విద్యుదుత్పత్తి, పారిశ్రామిక వ్యవస్థలు, విద్యకు, ఆరోగ్య రక్షణకు సంస్థల ఏర్పాటు, మానవ వనరుల అభివృద్ధికి కృషి జరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆహార అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించబడింది.

1990-91లో అకస్మాత్తుగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. ఎగుమతి, దిగుమతుల చెల్లింపుల లోటును అధిగమించటం, ఐ.యంయఫ్‌ దగ్గర వారు విధించిన షరతులకు లోబడి అప్పు తీసుకోవటం జరిగింది. అక్టోబరు 90 నుండి జూన్‌ 91 మధ్య విదేశీ మాదక ద్రవ్య నిల్వలు నుండి 1330 మిలియన్‌ డాలర్లు వెనక్కి తీసుకున్నారు. అందువల్ల దిగుమతులకు చెల్లించడానికి 1.8 బిలియన్‌ డాలర్లు అప్పు తీసుకున్నారు. అట్లాంటి అవసరాలకు నేటివరకూ తీసుకున్న అప్పు జూన్‌ 2017 నాటికి 485.80 బిలియన్‌ డాలర్లు అయ్యింది. వడ్డీ చెల్లింపుల భారం పెరిగింది.

ఇదీగాక దేశీయంగా చేసిన అప్పు అనేక లక్షలకోట్లు. విదేశీ ప్రభుత్వాలు గానీ, ఆర్థిక సంస్థలు అందించే తోడ్పాటు తగ్గి, వ్యాపార రీత్యా అప్పు తీసుకోవడం వల్ల విదేశీ అప్పు పెరిగింది. వడ్డీ చెల్లింపుల భారమేగాక, దిగుమతులు- ఇంధనం, బంగారం, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, మెషినరీ పెరగటం వల్ల వ్యాపార అంతరం పెరిగింది.

1991 తర్వాత పెట్టుబడిదారీ అభివృద్ధి విధానమైన లిబరలైజేషన్ చేపట్టారు. వ్యాపారం, పెట్టుబడులు, పోటీ చేయటానికి విదేశీ సంస్థలను అనుమతించటం జరిగింది. విదేశీ సంస్థాగత మదుపరులు. స్టాక్‌మార్కెట్‌లోకి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేక రంగాల్లో ప్రవేశించాయి.

మోదీ పాలన ప్రారంభమయ్యాక విదేశీ ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులను బ్యాంకుల్లోకి ఇన్సూరెన్స్‌లోకి, రైల్వేల్లోకీ, రక్షణ రంగంలోకి, రిటైలు వ్యాపారంలోకి అనుమతించారు. భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సాధించటానికి తీసుకున్న ప్రధానమైన చర్య గ్లోబల్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌కు భారత ఆర్థిక వ్యవస్థను అప్పగించటం, ఫలితంగా భారతదేశ మారుమూల ప్రాంతాల్లోకి విదేశీ బహుళజాతి సంస్థల ఉత్పత్తులు అమ్మకం జరుగుతున్నది.

పానీయాలు, బిస్కెట్లు, కాఫీ, టీ పొడులు, నూడిల్స్‌, ఇతర దేశాల పండ్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, గృహ పరికరాలు, కార్లు, టూ, త్రీ వాలర్లు, ట్రాక్టర్లు వగైరాలు. మాన్‌శాంటో కార్గిల్‌ సంస్థల విత్తనాలు, అత్యాధునిక టెలివిజన్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు వగైరాలు విదేశీ ద్రవ్య పెట్టుబడిదారుల ఉత్పత్తులు. వాటిని కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఫైనాన్స్‌ అందిస్తాయి. కానీ వ్యవసాయ దారులకు ఇవ్వవు. అలాగే దేశీయ వ్యాపార సంస్థలకు ఉదారంగా అప్పులు ఇస్తారు. వారు తిరిగి చెల్లించని నాడు అప్పు ను రద్దుచేస్తారు.

గ్లోబల్‌ ద్రవ్యపెట్టుబడి భారతదేశంలోకి రావడం వల్ల భారత ఉత్పాదక రంగం- వ్యవసాయ రంగం, మాన్యు ఫ్యాక్చర్‌ రంగం, ఎం.ఎస్‌.ఎం.ఈ రంగం తీవ్రంగా నష్టపోయిం ది. నేటికీ ఆయా రంగాల్లో
రివైవల్‌ (పునరుద్ధరణ) జరగలేదు.

గ్లోబల్‌ ద్రవ్యపెట్టుబడి ఏయే రంగాల్లోకి వచ్చింది. ఎవరు లాభించారు. ఎఫ్‌ఐఐలవి గానీ, ఎఫ్‌డీఐలవి గానీ చట్టవ్యాపారంలోకి వచ్చాయి. అపారంగా లాభాలార్జించి తరలించుకొన్నాయి. ఉత్పాదక రంగాల్లోకి గానీ, పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధి చేయటానికి రాలేదు. ఉపాధులు కల్పిస్తాయని మన పాలకులు ప్రచారం చేశారు. కానీ ఉపాధులు కల్పించలేదు. అసమానతలు పెరుగటాన్ని పట్టించుకోలేదు.

2008లో అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యం పెట్టుబడిదారీ ప్రపంచమంతా విస్తరించింది. ఆయా దేశాలు మాంద్యం నుండి బయటపడటానికి లక్షలకోట్లు విడుదల చేశాయి. అనుకొన్నమేర నేటికీ బయటపడలేదు కానీ తక్కువ వడ్డీ రేట్లవల్ల సంపన్న వర్గాలు ఆ సొమ్మును సొంతం చేసుకొన్నాయి. అలా గ్లోబల్‌ ద్రవ్యపెట్టుబడిదారులు ఏర్పడ్డారు.

ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో భాగమవటం వల్ల భారత్‌ను బలంగా మాంద్యం తాకింది. స్టాక్‌మార్కెట్‌ కుదేలైంది. మదుపరులు లక్షల కోట్లు నష్టపోయారు. స్టాక్‌, కరెన్సీ, మనీమార్కెట్లు కుప్పకూలాయి. కఠిన నియంత్రణలో బ్యాంకులు ఉండటం వల్ల దేశం స్వల్పకాలంలోనే మాంద్యం నుండి బయటపడింది. 2004-05 నుండి 2009-10 వరకు జీడీపీలో 8.7 శాతం వృద్ధి సాధించటం జరిగింది. కానీ 20 మిలియన్ మంది ఉపాధులు కోల్పోయారు.

వృద్ధి సాధించటమే లక్ష్యమైనపుడు పెట్టుబడులు కావాలి. కానీ ప్రభుత్వంగానీ, ప్రైవేటు రంగం గానీ పెట్టుబడులు పెట్టే స్థితిలేదు. అటువంటి స్థితిలో గ్లోబల్‌ ద్రవ్య పెట్టుబడిని ఆహ్వానించటం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ కీలక రంగాలు అన్నింటిల్లోకి ద్రవ్యపట్టుబడి ప్రవేశించింది. ఆర్థికంగా వృద్ధి సాధించటం జరిగింది. కానీ అట్లా పెరిగిన సంపద ద్రవ్యపెట్టుబడిదారులకు, వారితో సహకరించిన కొద్దిమంది సంపన్నుల వద్దకు చేరింది.

భూమిని, సహజవనరులను నమ్ముకొని జీవనం సాగించే అత్యధిక శాతం ప్రజలకు ఎటువంటి ఓదార్పు కలిగించలేదు. అందువల్ల తేలింది ఏమిటంటే ఏ ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్‌ ద్రవ్యపెట్టుబడి ఆధిక్యత సాధిస్తుందో దానివల్ల లాభం పెట్టుబడిదారులకే లభ్యమవుతుంది. దేశాలకు ప్రయోజనం ఉండదు. ద్రవ్యపెట్టుబడిదారులు లాభాలు తరలించుకొంటారు. ఈ విధానాల వల్ల దేశంలో పెరిగిన సంపదలో 73 శాతాన్ని ఒక శాతం మందే అందుకుంటున్నారు. ఇపుడు దేశంలో 119 మంది డాలరు బిలియనీర్లు ఉన్నారు.

ఎన్నికల్లో గెలవటానికి ఎవరికి మంచి రోజులు తీసుకురాగలనని నరేంద్రమోదీ వాగ్దానాలు చేశారో వారెవరికి ఆయన 42 నెలల పాలనలో మంచిరోజులు రాలేదు . అంతకు మించి ఆయా వర్గాలన్నీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. వ్యవసాయదారుల రుణగ్రస్థత పెరిగింది. గిట్టుబాటు ధరలు లేక, ఆత్మహత్యలు ఆగలేదు. యువత ఉపాధులు లేక ఆనాడు 6 కోట్లు నిరుద్యోగులు ఉంటే గడచిన సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మరో కోటి 20 లక్షల మంది చేరారు. ఉపాధి కల్పన ఊసేలేదు. స్త్రీలపై
అత్యాచారాలు పెరుగుతున్నాయి. స్విస్‌ బ్యాంకులో దాచుకొన్న లక్షల కోట్లు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానన్నది అబద్దంగా నిలిచింది. ఎఫ్‌డీఐ పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వాగ్దానం గడచిన సంవత్సరాల్లో అనుకొన్నమేర ఎఫ్‌డీలు రాలేదు. గ్రామాలు- నగరాల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి అత్యధికంగా ఉపాధులు కల్పించే రంగాలు స్తబ్దతను తొలగించే చర్యలు తీసుకోవటంలేదు.

పేదల ఉద్ధరణే తన లక్ష్యం అని మోదీ పదేపదే చెబుతూంటారు. కానీ, సంపన్నుల విలాస జీవనానికి, వారి వినియోగానికి పూర్తిగా తోడ్పాటు అందిస్తున్నాడు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా లేబర్‌ ఇంటెన్సివ్‌ రంగాలను ప్రోత్సహించలేదు. 2014-15, 2015-16లో 23806 ఫ్యాక్టరీలు మూతబడి 12.57 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.అంతేకాదు 7 లక్షల మంది విద్యావంతులు ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకున్నారు. గడచిన 5 సంవత్సరాల్లో లఘు పరిశ్రమల రంగంలో 11,873 ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. 2014-15లో, 2015-16లో 11,923 మూతపడ్డాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు సాధారణ ప్రజల జీవనాన్ని మరింతగా దుర్భరం చేసింది. జీడీపీ పతనమైంది. ఉపాధులు కోల్పోయారు. లక్షలాది సంస్థలు మూతబడ్డాయి.

ప్రధానమంత్రి మోదీ ఇంకొక అంశాన్ని ఘనంగా చెపుతారు. అది- ‘నేను తినను, ఇతరులను తిననివ్వను’ ఇదెంత అసత్యమో పరిశీలించండి. 2017లో దేశ సంపదలో 58 శాతం అత్యంత సంపన్నులైన ఒక్క శాతం వద్ద పోగుపడింది. 2018లో సంపదలో 73 శాతం సంపన్నుల వద్దకు చేరింది. సామాన్యులకు మిగిలింది రోటీ, కపడా మకాన్‌, బిజిలీ, సడక్‌, పానీ నినాదాలు మాత్రమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here