నాలుగేళ్ళ ఆవిరి

0
43

మనస్సాక్షి – 1082

తెల్లవారింది. వెంకటేశం చిన్నగా జాగింగ్‌ చేసుకుంటూ గిరీశం గారింటికి వచ్చేశాడు. మామూలుగా అయితే ఆపాటికి గిరీశం రడీ అయిపోయి అరుగుమీద కూర్చుని ఉంటాడు. అక్కడ్నుంచి యిద్దరూ వాకింగ్‌కి వెళ్ళి పోతారు. యిది రోజూ జరిగే తంతే. అయితే ఆరోజు సీన్‌ కొంచెం మారింది. వెంకటేశం వచ్చేసరికి గిరీశం అరుగుమీద కూర్చుని ఉన్నాడు. అయితే అదేదో కాలుమీద కాలేసుకుని మరీ కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే యింకో కుర్చీలో తమ ఊరికే చెందిన గోపాలకృష్ణయ్య కూర్చుని ఉన్నాడు. గిరీశం ఎదురుగా ఓ జంట నిలబడు న్నారు. వాళ్ళిద్దరూ బొత్తిగా దేభ్యం మొహాలు వేసుకుని ఉండడంతో భార్యాభర్తలు అయ్యుండొచ్చని వెంకటేశానికి అర్థ మయింది. మొత్తానికి యిదేదో తీర్పు చెప్పేలాంటి వ్యవహారమని కూడా అనిపించింది. ‘నాకు పనికొచ్చే దారి చెప్పడం తెలీదు గానీ పెద్ద మర్యాదరామన్నలా ఈ తీర్పులు చెప్పడమొకటి’ అని గొణుక్కుంటూ వెళ్ళి అరుగుమీద ఓ మూల కూర్చున్నాడు. యింతలోనే గిరీశం ”యిదిగో గోపాలకృష్ణయ్యా.. నిజం చెప్పాలంటే నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషననుకో” అన్నాడు. గోపాలకృష్ణయ్య వినయంగా తలూపి ”అందుకే కదా గిరీశంగారూ.. మా పిల్లల్ని మీ దగ్గరికి తెచ్చింది” అన్నాడు. గిరీశం తలూపి ”యింతకీ వీళ్ళెవరు? సమస్యేంటి?” అన్నాడు చుట్ట అంటించుకుంటూ. దానికి గోపాలకృష్ణయ్య ”యిదిగో.. వీడ గోపాల్‌. నా కూతురి కొడుకు. యిది లక్ష్మి. నా కొడుకు కూతురు. నాలుగేళ్ళనాడు నేనే పట్టుబట్టి వీళ్ళిద్దరికీ పెళ్ళి చేశాను. పెళ్ళయి నప్పట్నుంచీ చాలా బాగుండేవారు. అది చూసి అందరూ ముచ్చటి పడిపోయేవాళ్ళం. అలాంటిది ఏవయిందో తెలీదు. రెండునెలల నుంచీ ఒకటే గొడవలు పడిపోతున్నారు. యిదిగో. యిదయితే పోలీస ్‌స్టేషనుకి పోతానంటుంది. వీడయితే కోర్టుకి పోయి విడాకులు తీసేసుకుంటానంటున్నాడు. యిప్పుడిలా పోలీస్‌స్టేషన్లూ, కోర్టులూ అంటే కుటుంబం పరువేం కాను. అందుకే మీతో మాట్లాడిస్తే బాగుం టుందని తీసుకొచ్చా” అన్నాడు. ఆపాటికి విషయం ఏంటన్నది వెంకటేశానికి అర్థమయిపోయింది. ఈలోగా గిరీశం చుట్ట గుప్పుగుప్పుమనిపించి, అప్పుడు దేభ్యం మొహం వేసుకున్న గోపాల్‌ వంక తిరిగి ”ఏం బాబూ.. పెళ్ళయిన యిన్నేళ్ళూ బానే ఉన్నారు కదా. పైగా ఆ అమ్మాయి నీ మేనమామ కూతురే కదా. యిప్పుడేవయిందని యిలా?” అన్నాడు. దాంతో అప్పటిదాకా ముద్దపప్పులా ఉన్న గోపాల్‌ అనే ఆ కుర్రాడు కాస్తా నోరిప్పాడు. కొంచెం గట్టిగానే తన వెర్షనేదో వినిపించాడు. ”ఛ..ఛ.. యిది వండిపెట్టే తిండిని కుక్కలు కూడా తినలేవు. అంత దారుణంగా వండుతుంది. అయినా నోర్మూసుకుని అలా తింటున్నానంతే. ఎప్పుడయినా బయట ఏదయినా తినొస్తే పెద్ద గొడవ పెట్టేసేది. దాంతో అదీ మానేశాను. అయినా కూడా ఎప్పుడ యినా యింట్లో సరిగ్గా తినకపోతే ‘అదిగో.. బయట తినేసొస్తున్నావ్‌..’ అంటూ పెద్ద గొడవ పెట్టేస్తుంది. యిలా యింట్లో రోజూ ఏదో గొడవే. యింక దీనితో కలిసుండడం నా వల్ల కాదు’ అంటూ తేల్చి చెప్పే శాడు. అదంతా వింటున్న వెంకటేశానికయితే తల తిరిగిపోయింది. దాంతో తన పెళ్ళి విషయంలో పునరాలోచనలో పడ్డాడు. యింతలో గిరీశం ”అవునూ.. ఈ నాలుగేళ్ళ నుంచీ బాగానే ఉన్నావు కదా. మరిప్పుడు యిలా అంటున్నావేంటీ?” అన్నాడు. దాంతో గోపాల్‌ ”ఏం బావుండడం.. నా మొహం.. యింతకాలం ఏదో అలా బాధ దిగ మింగుకుంటూ లాగించేశానంతే. యింక నా వల్ల కాదు” అన్నాడు. ఈసారి గిరీశం ఆ పక్కనున్న లక్ష్మి వైపు తిరిగి ”నువ్వు చెప్పమ్మా.. విషయమేంటీ?” అన్నాడు. దానికి లక్ష్మి ”ఛీ..ఛీ.. అసలు మనుషుల్లో యిలాంటి వాళ్ళుంటారా అని.. లేకపోతే నేను ఏ రోజయినా మంచి చీర కట్టుకుంటే ‘ఏం.. యివాళ నీ పాత కాలేజ్‌ ఫ్రెండ్‌ ఎవడయినా వస్తున్నాడా’ అనడుతాడు. పోనీ మామూలు చీరేదో కట్టుకుంటే ‘ఏంటా ముష్టి వాలకం..! అంటే నేను నిన్ను బాగా చూసు కోవడంలేదని అంతా అనుకోవాలనా..’ అంటాడు. యింక నా వంటల గురించి అన్నేసి మాట లంటున్నాడా.. అసలు నా వంటలంటేనే బ్రహ్మాం డంగా ఉంటాయని అంతా మెచ్చుకుంటారు. అంతెందుకూ… మా ఊళ్ళో ఏ ఫంక్షనయినా నాతో ఒక ట్రెండు వంటకాలు చేయించు కుంటారు. అయినా ఈ మనిషికి ఏమాత్రం గుర్తింపులేదు. యిలాంటి వాడితో నేనింకో క్షణం కూడా కాపురం చేయలేను. నా నాలు గేళ్ళూ ఊపిరి బిగబట్టుకుంపడ్డ నరకం చాలు” అంటూ తెగేసి చెప్పేసింది. ఆపాటికి వెంకటేశం బుర్ర యింకా తిరిగిపోయింది. యిక జీవితంలో పెళ్ళి చేసుకో కూడదన్న గట్టి నిర్ణ యానికి వచ్చేశాడు. ఆ యిద్దరి వాదనలూ వినెయ్యడంతో అప్పుడు గిరీశం మాట్లాడడం మొదలెట్టాడు. ”మీరు చెప్పినవన్నీ మీమీ దృష్టిలో రైటే కావచ్చు. అయితే యిప్పుడు నేనేవీ చెప్పలేను. ఒక సంవ త్సరంపాటు మీ యిద్దరూ మాట్లాడుకోకుండా ఆ యింట్లోనే ఎవరి మటుకు వాళ్ళుండండి. ఈలోగా ఓ పరిష్కారం వస్తుంది” అన్నాడు. అంతటి గిరీశం అలా చెప్సేసరికి వాళ్ళిద్దరూ కాదనలేకపోయారు. గోపాలకృష్ణయ్యకి కూడా గిరీశం చెప్పిందేదో బానే ఉందనిపించింది. దాంతో వాళ్ళంతా శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక వెంకటేశం ”గురూగారూ.. మీరు చెప్పిన పరిష్కారం గురించి నాకయితే అర్థం కావడంలేదు” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”ఎవరి గొడవలో అయినా దూరొచ్చు గానీ మొగుడూ పెళ్ళాల గొడవలో దూరితే బుర్ర వాచిపోతుంది. యిప్పుడిలా గొడవపడతారా.. రేపు ఒకటయిపోయి మనల్ని వెధవాయిల్ని చేస్తారు. అందుకే అలా చెప్పా” అన్నాడు. వెంకటేశం తలూపి ‘అద్సరే గానీ… సంవత్సర కాలంలో వాళ్ళ సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది?” అన్నాడు దాంతో గిరీశం నవ్వేసి ”అదేదో ఢిల్లీ నుంచొస్తుంది” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ”అదేంటీ.. ఎక్కడో మనూరోళ్ళ గొడవకి ఢిల్లీ నుంచి పరిష్కారం రావడమేంటీ?” అన్నాడు. దాంతో గిరీశం ”ఈ భార్యాభర్తల గొడవ ఎలాంటిదనుకున్నావ్‌.. అచ్చంగా మన టిడిపి, బిజెపిల వ్యవహారంలాంటిదే అనుకో. నాలుగేళ్ళపాటు రెండు పార్టీల మధ్య మితృత్వం కొనసాగింది. ఒకరి పాలన గురించి యింకొకళ్ళు బోల్డన్ని కితాబులిచ్చేసుకున్నారు. మొత్తానికి నాలుగేళ్ళపాటు అన్యోన్య దాంపత్యం లాంటి బంధం కొనసాగింది. అయితే మొన్న బడ్జెట్లో ఏపీకి రైల్వేపరంగా, ప్రత్యేక హోదాపరంగా, నిధులపరంగా ఎలాంటి సానుకూల ప్రకటనలూ రాకపోవడంతో టీడీపీ కాస్తా బ్లాస్ట్‌ కావడం జరిగింది. దరిమిలా బీజేపీతో కటీఫ్‌ చెప్పడమే కాకుండా ఎన్డీయే నుంచి కూడా బయటకొచ్చేసింది. పరిస్థితి యిందాకా వచ్చేసరికి బీజేపీ కూడా తెగ్గొట్టేసింది. యిప్పుడు ఎలక్షన్లు దగ్గరకొచ్చేసరికి ఈ రెండు పార్టీలూ తమని తాము నిరూపించుకునే పనిలో పడ్డాయి. అందుకే ఈ తెగింపు. ఓ రకంగా ఈ నాలుగేళ్ళు అసంతృప్తీ బద్దలు కావడానికి మొన్న బడ్జెట్‌ ఆఖరి స్ట్రా అయినట్టయింది. అందుకే ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలూ రోడ్డెక్కేశాయి” అంటూ ఆపాడు. యింతలో వెంక టేశం అనుమానంగా ”యింతకీ ఆ భార్యాభర్తల గొడవకీ, ఈ పార్టీల గొడవకీ పరిష్కారం ఉన్నట్టా?” అన్నాడు. దాంతో గిరీశం ‘రెండింటికీ ఒకటే పరిష్కారం. యింతిలా గొడవపడ్డా మళ్ళీ యిద్దరూ కలిసే అవ కాశమయితే ఉంది. యిద్దరికీ కామన్‌ శత్రులెవరయినా తలెత్తి నప్పుడు అప్పుడీ బంధమేదో పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ ఎడా పెడా ప్రేమించేసుకుంటారు… ఆ భార్యాభర్తలయినా ఈ పార్టీల యినా” అంటూ యింకో చుట్ట అంటించాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here