నయనాందకరం…జగదాభిరాముడి కల్యాణం

0
45

నగరంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

రాజమహేంద్రవరం, మార్చి 26 : నగరంలో శ్రీరామ నవమి వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా, ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల సీతారామ కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని ఏరోజు జరుపుకోవాలనే మీమాంస ఏర్పడగా కొందరు నిన్ననే నిర్వహించగా భద్రాచలంలో ఈరోజే జరుపుతుండటంతో అత్యధికులు భద్రాచల కల్యాణాన్నే ప్రామాణికంగా తీసుకుని ఈరోజు జరిపారు. నగరంలో పలు చోట్ల సీతారామ కల్యాణాన్ని జరిపారు. సీతంపేట శ్రీ రామమందిరంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఈరోజు వైభవంగా నిర్వహించారు. శ్రీ దేవీ ప్రసన్న టింబర్స్‌ అధినేత పిట్టా వీర కోటిరెడ్డి, సూర్య భాగ్యవతి దంపతులు పీటలపై కూర్చుని, సీతారాముల కళ్యాణం జరిపించారు. పుల్లెల సత్యనారాయణ వ్యాఖ్యానం చేసారు. శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యాన శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తజనం హాజరయ్యారు. అలాగే స్ధానిక టి.నగర్‌లోని శ్రీరామ భక్త గానసభ ఆధ్వర్యంలో 52 వ వార్షిక శ్రీరామ నవమి సంగీతోత్సవాలు ఈరోజు టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 3 వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచల సంప్రదాయంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గానసభ వ్యవస్థాపక కార్యదర్శి నిమ్మలపూడి వీర్రాజు సారధ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సంగీత, నృత్య, హరికథా కాలక్షేప కార్యక్రమాలు జరగనున్నాయి. స్ధానిక జాంపేటలోని పోలీస్‌ రిజర్వ్‌ లైన్‌లోని రామాలయంలో అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ రజనీకాంత్‌రెడ్డి,రమ దంపతుల సారధ్యంలో ఈరోజు ఉదయం సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, స్ధానికుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్ధానిక 13వ డివిజన్‌ అంబెడ్కర్‌ నగర్‌లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, నాగమణి దంపతులు పీటలపై కూర్చుని, సీతారాముల కళ్యాణం జరిపించారు. పెండ్యాల సూరిబాబు, ధవళ భీమశంకర శాస్త్రి శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తజనం హాజరయ్యారు. వి జగపతి, సూరపురెడ్డి తాతారావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here