తెదేపా ప్రభుత్వ అక్రమాలను బయటపెడతాం

0
97

రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే నిందలేల? : క్షత్రియ

రాజమహేంద్రవరం, మార్చి 27 : తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతిని కూకటివేళ్ళతో పెకిలించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బిజెపి అర్బన్‌ జిల్లా మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ తెలిపారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అకుల సత్యనారాయణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడను అందరూ గమనిస్తున్నారని, ఎన్‌డిఏ ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను నెరవేరుస్తూ రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేసిందన్నారు. ఎన్‌డిఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక విచిత్ర ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తొమ్మిదిపేజీల లేఖ రాశారని, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాకు సారధ్యం వహిస్తున్న నాయకుని లేఖపై టిడిపి నేత నారా లోకేష్‌ వ్యాఖ్యలు చిన్న పిల్లాడి చేష్టలుగా ఉన్నాయన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని మొదటి నుంచి భాజపా చెబుతూనే వచ్చిందని, అందులో భాగంగానే ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి మంజూరు చేసిందన్నారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 29 పేజీల లేఖ రాయగా దానిపై ఏ ఒక్కరూ చర్చకు రాలేదని విమర్శించారు. నిజంగా చర్చకు వస్తే వాస్తవాలు బయటపడేవని, అందువల్లే రాలేదని ఎద్దేవా చేశారు. వచ్చేనెల 2వ వారంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజమహేంద్రవరంలో జరుగుతుందని, ఆ సమావేశానికి కేంద్ర నాయకులు రామ్‌మాధవ్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి బిజెపి చేసిన అభివృద్ధిని వివరించడం జరుగుతుందన్నారు. మిత్ర ధర్మం వల్ల నాలుగు సంవత్సరాలపాటు మౌనం వహించాల్సి వచ్చిందని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో అవినీతి మచ్చ లేని పరిపాలనను మోడీ అందిస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపి, పార్టీ నాయకులు చింతల లాల్‌ బహుదూర్‌శాస్త్రి, నాళం పద్మశ్రీ, నీరుకొండ వీరన్నచౌదరి, మట్టాడి చిన్ని, హీరాచంద్‌ జైన్‌, రౌతు వాసు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here