అఖిలపక్షం చంద్రబాబు కొత్త డ్రామా

0
38

హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించండి

విజయసాయిరెడ్డిని విమర్శించే ముందు సుజనాచౌదరి సంగతి తేల్చండి : వైసీపీ అధికార ప్రతినిధి దుర్గేష్‌

రాజమహేంద్రవరం, మార్చి 27 : సుమారు నాలుగేళ్ళపాటు ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అఖిలపక్షం పేరుతో సరికొత్త డ్రామకు తెరలేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ విమర్శించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు ఏకపక్షంగా నేడు అఖిలపక్షంగా వ్యవహరిస్తున్న తెదేపా రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షంగా నిలవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నాటకంతో ప్రజలను వంచించి హోదా అంశాన్ని నీరుగార్చిన చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్షం అంటూ మరోసారి ప్రజలను దగా చేయడానికి సిద్ధపడ్డారన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే దశలో ఐదుకోట్ల ఆంధ్రులు ఆశతో ఎదురుచూస్తున్న సందర్భంలో అఖిలపక్ష నినాదం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వైఖరిని ప్రజలు ఛీదరించుకుంటారన్నారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే జగన్‌ చాలాసార్లు అఖిలపక్షం వేయాలని కోరినప్పటికీ ఎందుకు పెడచెవిన పెట్టారని ప్రశ్నించారు. గతంలో హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తులను అణగద్రొక్కే ప్రయత్నం చేశారని, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో చంద్రబాబు అఖిలపక్షం డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. హోదాకు మించిన ప్యాకేజీలు సాధించామని గొప్పలు చెప్పుకుని సన్మానాలు చేయించుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించినట్లు ఏపీలో కూడా ఉద్యమించాలని పలువురు పిలుపునివ్వగా కేంద్రమంత్రి సుజనాచౌదరి అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి జై కొట్టిన నాయకులు, ఇప్పుడు హోదా కోసం ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చ జరిగి హోదా అంశానికి ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని సవాల్‌ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతాలు ఇచ్చి హోదా సాధించుకునే దిశగా పయనించాలన్నారు. మాట్లాడితే విజయసాయిరెడ్డి పిఎంఓ ఆఫీసులో తిరుగుతున్నారని, ఆయన జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ-2 అని విమర్శిస్తున్న తెదేపా నాయకులు సుజనాచౌదరి ఆర్థిక నేరాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తులని రాజ్యసభ సభ్యునిగా చేయడంతోపాటు కేంద్రమంత్రిగా పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకున్నారన్నారు. విజయసాయిరెడ్డిపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అవి నిరూపణయై దోషిగా ఖరారు చేయలేదన్నారు. తెలుగుదేశం నాయకుల విమర్శలు చూస్తుంటే గురివింజ గింజ సామెత గుర్తొస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ చంద్రబాబు తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని కేవలం స్వప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నారని, అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నానికి తెరలేపారని విమర్శించారు. చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ జరగకుండా ఆయన కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. తెదేపాతో కలిసి పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు చంద్రబాబు అవినీతి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారని, ఇప్పటికైనా విచారణకు అంగీకరించి సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల రాజకీయాలను చంద్రబాబు ప్రారంభించేశారని, ఆయన మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి మాట్లాడుతూ వైకాపా ద్వారా ఎన్నికల్లో గెలిచి మరొక పార్టీలోకి వలసపోయిన ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పేలా మే నెలాఖరున హైకోర్టు తీర్పు ఇవ్వబోతోందన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకే సురేష్‌, చిక్కాల బాబులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here