అర్హులకు పింఛన్లు ఏవి?

0
104

నగరపాలక మండలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుల నిరసన

అందరికీ అందేలా చూస్తాం : ప్రచారం స్టంటు వద్దు

బడ్జెట్‌ సమావేశం కొనసాగనివ్వకపోతే బయటకు పంపుతామని మేయర్‌ హెచ్చరిక

రాజమహేంద్రవరం, మార్చి 31 : అర్హులైన వారందరికీ ఫించన్లు ఇవ్వాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్ల నిరసనతో ఈరోజు నగరపాలక మండలి సమావేశంలో కొద్దిసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. మేయర్‌ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి అర్హులకు పింఛన్లు ఇవ్వాలంటూ ప్లకార్డులు చేతబట్టి మేయర్‌ పోడియం వద్ద నిలబడ్డారు. బడ్జెట్‌ ఆమోదం కోసం సమావేశం ఏర్పాటు చేసినందున దానిని కొనసాగించేందుకు సహకరించాలని మేయర్‌ పదే పదే వారికి విజ్ఞప్తి చేసినా వారు తమ నిరసన కొనసాగించారు. జన్మభూమిలో పింఛన్లు ఇస్తామన్నారని అవి ఏవీ అంటూ వారు ప్రశ్నించగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులందరికీ అందేలా చూస్తామని, ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లలో కూడా అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని, వారి డివిజన్‌లోనే అధికంగా పింఛన్లు మంజూరయ్యాయని, అందులో పక్షపాతం ఏమీ లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా దీనిని రాజకీయం చేయొద్దని, ప్రచారం కోసం వినియోగించుకోవద్దని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్న సీఎం చంద్రబాబునాయుడు అభీష్టం మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మంజూరు చేస్తున్నామని, పేదలపై మీకొక్కరికే కాదు, మాకు ప్రేమ ఉందని, దీనిని రాజకీయం చేయొద్దని ఆదిరెడ్డి అన్నారు. అనర్హులు ఎవరికైనా పింఛన్లు ఇచ్చినట్లు చూపాలని ఆయన సవాల్‌ చేశారు. మేయర్‌ రజనీ శేషసాయి మాట్లాడుతూ ఇది బడ్జెట్‌ సమావేశమని, పింఛన్లు విషయం కోసం కౌన్సిల్‌ వెలుపల సమావేశం నిర్వహించుకోవచ్చునని ఆమె సూచించినా వారు నిరసన కొనసాగిస్తుండటంతో బయటకు పంపాల్సి వస్తుందని మేయర్‌ హెచ్చరించారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకున్నందున మీకు కావలసిన ప్రచారం వచ్చిందని, ఇక నిరసన విరమించమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల తీరుపై తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ఇది బడ్జెట్‌ సమావేశమని, దానిపైనే చర్చించాలని తెదేపా కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు అన్నారు. అప్పటికే సమయం పదకొండున్నర గంటలు కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ పిల్లి నిర్మల కూడా తమ సహచరులతో ఆందోళనలో జత కలిపారు. ఆ తరువాత ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి వారి వద్దకు వెళ్ళి ఏదో చెప్పగా వారు నిరసన విరమించి తమ స్థానాల్లో ఆశీనులయ్యారు. ఆ తరువాత మేయర్‌ రజనీ శేషసాయి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. చర్చల్లో గొర్రెల సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మాజీ కౌన్సిలర్‌ కృష్ణకుమారి మృతికి సంతాపం

మాజీ కౌన్సిలర్‌ జి.ఎస్‌.కృష్ణకుమారి మృతికి నగరపాలక మండలి సమావేశం సంతాపం వ్యక్తం చేసింది. సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించారు. బాలాజీపేట, పుష్కరాలపేట ప్రాంత అభివృద్ధికి ఆమె చేసిన సేవలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here