జాతీయ రహదారిని దిగ్బంధించిన దళిత సంఘాలు

0
49

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటీషన్‌ వేయాలని డిమాండ్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు లాలాచెరువు జాతీయ రహదారిని దిగ్భందించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా లాలాచెరువు సెంటర్‌లో పార్టీలకు అతీతంగా దళిత నాయకులు పెద్దఎత్తున చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళన కారణంగా పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ సందర్భంగా దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు, బీఎస్సీ జిల్లా అధ్యక్షులు బర్రే కొండబాబు, నగర పాలక మండలి కోఆప్సన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, కాంగ్రెస్‌ నాయకులు ముళ్ళ మాధవ్‌, జైభీం రాష్ట్ర అధ్యక్షులు కురివెళ్ళ భానుచందర్‌ తదితరులు మాట్లాడారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం దళితులకు రక్షణ కవచంగా ఉందని, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తికి, తన ఆలోచనా విధానాలకు భంగం కలిగించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు. దీనిని దళితులే కాకుండా అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఇటువంటి చట్టం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని, ఈ చట్టం నిర్వీర్యం చేస్తే దళితులకు ఇక రక్షణే ఉండదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎంతవరకైనా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళితులు చేపట్టిన ఆందోళనకు సిపిఐ, సిపిఎం పార్టీలు సంఘీభావం ప్రకటించడంతో పాటు దిగ్భందన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం నాయకులు టిఎస్‌ ప్రకాష్‌, టి అరుణ్‌, తులసి, సావిత్రి, పోలిన వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు నల్లా రామారావు, తోకల ప్రసాద్‌ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. దళితుల ఆందోళన నేపధ్యంలో పోలీసులు భారీ ఎత్తన అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటుచేసారు. ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయినందున డిఎస్పీలు వైవి రమణకుమార్‌, కులశేఖర్‌, నాగరాజుల విజ్ఞప్తి మేరకు దళిత సంఘాల నాయకులు ఆందోళనను విరమించి, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించేందుకు స్కూటర్‌ ర్యాలీగా బయలుదేరారు. అంతకు ముందు లాలాచెరువు సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు ఈతకోట బాపన సుధారాణి, మర్రి దుర్గాశ్రీనివాస్‌, దళిత నాయకులు దాసి వెంకట్రావు, జార్జి ఆంధోని, వేడంగి చిట్టిబాబు, మర్రి బాబ్జి, ఇసుకపట్ల రాంబాబు, బొచ్చ రమణ, తురకల నిర్మల, గెడ్డం నెల్సన్‌బాబు, తొర్లపాటి శీతల్‌, తాళ్ళూరి రవిరాయల్‌, పట్నాల విజయకుమార్‌, కాటం రజనీకాంత్‌, భేరి మోహిత్‌, నక్కా వెంకటరత్నం, కవులూరి వెంకట్రావు, తిరగాటి దుర్గారావు, శిరింగి రత్నకుమార్‌, పెయ్యల శ్రీను, ఎల్‌వి ప్రసాద్‌, చాపల చిన్నిరాజు, విజ్జిన మధు, రేగుళ్ళ బాలశ్రీధర్‌, మార్తి నాగేశ్వరరావు, ఈతలపాటి కృష్ణ, శ్యామ్‌, గన్నవరపు సంజయ్‌, తాడేపల్లి గణేశ్వరరావు, పెంకే సురేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here