ఇచ్చింది గోరంత.. చెబుతున్నది కొండంత

0
45

జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుపై మండలిలో ఆదిరెడ్డి ఆగ్రహం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 4 : రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో పదకొండు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని, ఇచ్చింది గోరంతయితే ప్రకటించుకుంటున్నది కొండంత అని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఈరోజు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుపై ఆదిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పదకొండు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.9,654.95 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా నాలుగేళ్ళలో కేవలం రూ.730.05 కోట్లు మాత్రమే మంజూరు చేశారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పదకొండు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం పలు ప్రాంతాల్లో 2,900 ఎకరాల భూమిని కేటాయించడంతోపాటు ప్రహరీగోడల నిర్మాణానికి రూ.130 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. 2,900 ఎకరాల భూమి ఖరీదుతోపాటు ప్రహరీ నిర్మాణం నిమిత్తం మొత్తం రూ.11,182.38 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగా కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు. గత నాలుగేళ్ళుగా ఆంధ్రా ప్రజలను ఊహల్లో ఉంచుతూ నిలువునా మోసం చేశారన్నారు. ఎవరైనా కొంతకాలమే దగా చేయగలుగుతారని, కలకాలం వారి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్య ద్వారానే ఉజ్జ్వల భవిష్యత్తు కలుగుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని, అయితే ఆయన కృషికి కేంద్రం సహకరించకపోవడం దారుణమన్నారు. ఆంధ్రులను దగా చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి కూడా పడుతుందని, చేసిన అన్యాయాన్ని ఐదు కోట్ల ఆంధ్రులు గమనిస్తూనే ఉన్నారని సభలో ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here