సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న చంద్రబాబు

0
48

ప్రత్యేక హోదా ఉద్యమ నాయకత్వంపై ఉండవల్లి కామెంట్‌

కోటగుమ్మం సెంటర్‌లో వైసిపి నేతల రిలే దీక్షలు – సంఘీభావం తెలిపిన అరుణ్‌కుమార్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7 : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపే సువర్ణ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులారా వదులుకున్నారని మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. కోటగుమ్మం సెంటర్‌లో ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు మద్దతుగా ఆ పార్టీ సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలో రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్‌, రౌతు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో తొలి నుంచి పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు మరో ముందడుగు వేసిందన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు వై.ఎస్‌.జగన్‌ ఆదేశాల మేరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తున్నారని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని కోరారు. సీఎం చంద్రబాబు ఇంకా నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ ఎంపీలను రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. రిలే దీక్షల శిబిరాన్ని మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వైకాపా ఎంపీల రాజీనామాలతో ప్రత్యేక హోదా వేడి ఎన్నికల వరకు కొనసాగుతుందని, కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఒత్తిడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అల్లు బాబి, వర్తక నాయకులు అశోక్‌కుమార్‌ జైన్‌, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, పార్టీ నాయకుడు పోలు కిరణ్‌రెడ్డి, గుర్రం గౌతమ్‌, తామాడ సుశీల, నీలపాల తమ్మారావు, కొమ్ము జిగ్లేర్‌, కాటం రజనీకాంత్‌, ఉప్పాడ కోటరెడ్డి, మజ్జి అప్పారావు, కోడికోట సత్తిబాబు, మహ్మద్‌ ఆరిఫ్‌, మార్తి లక్ష్మి, గుడాల ఆదిలక్ష్మి, హసీనా, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here