పార్లమెంటరీ విలువలు కూడా మోదీ పాలనలో ధ్వంసం (శనివారం నవీనమ్)

0
102

పార్లమెంటరీ విలువలు కూడా
మోదీ పాలనలో ధ్వంసం
(శనివారం నవీనమ్)

భారతీయ జనతా పార్టీ నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రజాస్వామ్య విలువలు, మర్యాదల పట్ల ఏమాత్రం గౌరవం లేదని భారతదేశంలో అత్యున్నత చట్టసభలైన లోక్ సభ, రాజ్యసభల్లో రుజువైపోయింది. సభలను సజావుగా నిర్వహించే చర్యలు తీసుకోవాలని సభాముఖంగానే పార్లమెంటరీ వ్యవహారాలమంత్రిని ఆదేశించగల అధికారాలు వున్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అటువంటి ఆదేశాలు ఇవ్వలేదంటే ప్రజాస్వామిక సాంప్రదాయాల పట్ల వారి వైఖరి కూడా మోదీ ధోరణికి దాసోహమనే స్పష్టమైపోయింది.
జనవరి 9వ తేదీ నుండి రెండు విడతలుగా జరిగిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రెండో విడత మొత్తం అధికార బిజెపి, దాని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ కుయుక్తులతో కొట్టుకుపోయింది.

దేశ ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అధికార పార్టీ చర్చకు సిద్ధంగా లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు వేసే వాడి వేడి ప్రశ్నలకు సమాధానాలు దాని దగ్గర లేవు. అందుకే అన్నా డిఎంకె వంటి పార్టీలను శిఖండుల్లా అడ్డుపెట్టుకుని ప్రజా సమస్యలపై చర్చ నుండి పలాయనం చిత్తగించింది. రెండో విడత పార్లమెంటు దాదాపు నెల రోజుల పాటు జరిగితే అందులో లోక్‌సభ సమయంలో 96 శాతం, రాజ్యసభ సమయంలో 92 శాతం ఎటువంటి చర్చ జరగకుండానే ముగిసిందంటే సభా నిర్వహణలో పాలక పార్టీ ఎంతగా విఫలమైందో తెలుస్తోంది. లోక్‌ సభలో వరుసగా13 రోజుల పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిస్వాసం నోటీసులు ఇచ్చాయి. దీన్ని చర్చకు రాకుండా చేయడం కోసం అధికార పక్షం కావాలని సభను వాయిదా వేస్తూ వచ్చింది.

ఇంతా చేసి ఇప్పుడు ప్రతిపక్షాలే సభా సమయాన్ని వృధా చేశాయని, సభ జరక్కుండా అడ్డుకున్నాయని బిజెపి రచ్చకెక్కడం దొంగే దొంగదొంగ అన్నట్లుంది.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడు దేశం ఎదుర్కొంటున్న అనేక తీవ్ర సమస్యలు చర్చకు వస్తాయని, వాటికి ఒక పరిష్కారం లభిస్తుందని దేశ ప్రజలు ఆశపడ్డారు. ముఖ్యంగా ప్రజాధనాన్ని లూటీ చేసే బ్యాంకింగ్‌ కుంభకోణాలు, రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న వ్యవసాయ సమస్యలు, ఎస్సీఎస్టీలపై దాడులు, ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న నిరుద్యోగం, రగులుతున్న కాశ్మీరం, విఫలమైన విదేశాంగ విధానం మొదలైన అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధపడ్డాయి. ఈ ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం బిజెపి పాలకులకు లేదు. ఎందుకంటే ఈ సమస్యలకు కారణం దాని విధానాలే. అందుకే అది పార్లమెంటు నుండి పలాయనం చిత్తగించింది.

రెండో విడత సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అసలు పార్లమెంటుకే రాకుండా ముఖం చాటేశారంటే ఆయనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఎంతటి ‘నమ్మకమో’ అర్ధమవుతుంది. 

ఆంధ్ర ప్రదేశ్‌ విభజన సమయంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలులో బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసింది. రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీతో కలిసి నాలుగు సంవత్సరాలు ప్రజలను మభ్యపుచ్చుతూ వచ్చింది. కానీ గత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా మొండి చేయి చూపడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భగ్గుమన్నారు. నిధులు, ప్యాకేజీలు అనే శషభిషలు లేకుండా హోదా ఒక్కటే రాష్ట్రాన్ని అన్యాయం నుండి కాపాడుతుందని నిశ్చయానికి వచ్చారు. హోదా కోసం రాష్ట్ర ప్రజల పోరాటం ఊపందుకోవడంతో పార్లమెంటులోనూ ప్రకంపనలు వినిపించాయి.

రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలన్న డిమాండు ముందుకొచ్చింది. రెండో విడత పార్లమెంటు సమావేశాలు జరగాల్సిన 23 రోజుల్లో 13 రోజులు వరుసగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. రాష్ట్రానికి చెందిన బిజెపీయేతర పార్లమెంటు సభ్యులతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్‌ తదితర పార్టీలన్నీ దానికి మద్దతిచ్చాయి. బిజెపికి లోక్‌సభలో బండ మెజారిటీ ఉంది కాబట్టి అవిశ్వాసం నెగ్గే అవకాశం లేదు. అయినా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ ద్వారా బిజెపి మోసాన్నీ, దగానూ, నమ్మక ద్రోహాన్ని బయటపెట్టాలనే ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.

తన చెప్పుచేతల్లో నడిచే అన్నా డిఎంకె సభ్యులచేత, కొన్ని రోజుల పాటు టిఆర్‌ఎస్‌ సభ్యులచేత
సభలో గలాటా సృష్టించి పాలక పార్టీ సభను వాయిదా వేయించింది. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ పూర్తిగా పాలక పార్టీకి లొంగిపోయి వ్యవహరించారు. అవిశ్వానికి మద్దతుగా సుమారు 80 మంది సభ్యులు సభలో ప్లకార్డులు పట్టుకుని నిలుచున్నా ఆమెకు కనిపించలేదు. కానీ కొద్ది మంది అన్నా డిఎంకె సభ్యులు అడ్డు వచ్చారని చెప్పి రోజూ సభను వాయిదా వేస్తూ వచ్చారు. ఇదంతా సభలో సమస్యలపైనా, అవిశ్వాస తీర్మానంపైనా చర్చ జరక్కుండా పాలక పార్టీ ఆడిన నాటకమని దేశ ప్రజలంతా గమనించారు.

అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తున్న బిజెపి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా ఎలా నాశనం చేస్తోందో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు వారికి బోధపరిచాయి. ఈ ప్రజాస్వామ్య హంతకులకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here