రాజ్యాంగ విలువలకు ఎన్‌డీఏ పాలకులు తిలోదకాలు

0
68

అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల ధ్వజం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : మహనీయుడు డా. బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముందుగా గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎం.పి. మాగంటి మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి,గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడులతో పాటు తెదేపా నాయకులు ఆదిరెడ్డి వాసు, ఎంపి మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహానికి, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్త్యాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఆనాడు విప్లవాత్మక మార్పులకు గౌతమ బుద్ధుడు నాంది పలుకగా దానిని ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. విద్యా హక్కు, వాక్‌ స్వాతంత్య్రం, సమానత్వం హక్కులను ఆయన ప్రసాదించారని అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఎన్‌టిఆర్‌ పార్టీని ఏర్పాటు చేసి కూడు,గూడు, గుడ్డ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారని గుర్తు చేశారు. ఎన్‌టిఆర్‌ కృషితోనే అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించారని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంటే రాష్ట్రంలో బిజెపి నేతలకు చలనం లేదని, ఇప్పటికైనా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపాలన్నారు. గుజరాత్‌లో రాజధాని ఉండగా మరో మూడు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణానికి మోడీ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.అంబేద్కర్‌ ఆశయాలను స్మరించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ విలువల్ని కేంద్ర పాలకులు అభాసుపాలు చేస్తున్నారని, పార్లమెంట్‌ సాక్షిగా చట్టాలను ధిక్కరించి ఏపీపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకపోవడంపై సిగ్గు పడుతున్నానని ప్రధాని మోడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జమ్మూలో ఎనిమిదేళ్ళ బాలికపై అతి కిరాతకంగా అఘయిత్యానికి పాల్పడిన నిందితులను బిజెపి మంత్రులు వెనకేసుకుని రావడంపై సిగ్గు పడటం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతిపై బిజెపి ఎమ్మెల్యే అత్యాచారం చేసి ఆమె తండ్రి మరణానికి కారకుడైన ఘటనకు ఏం సమాధానం చెబుతారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడంపై సిగ్గుపడరా అని ప్రశ్నించారు. తెదేపా నాయకుల, కార్యకర్తల కష్టంతో గెలిచిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం సీఎం చంద్రబాబుపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా మనస్సాక్షిని ప్రశ్నించుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని, లేకుంటే జాతి ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అసమానతలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉండాలని భావించి సీఎం చంద్రబాబు దళితతేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారని, అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఏపీపై వివక్ష చూపుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. మేయర్‌ రజనీ శేషసాయి మాట్లాడుతూ దేశంలో సమూల మార్పులు కోసం, అందరికీ సమాన అవకాశాల కోసం అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఎంతో విలువైందని కొనియాడారు, యర్రా వేణు మాట్లాడుతూ అంబేద్కర్‌ గొప్పతనం అందరికీ తెలుసని, అయితే ఆయన రాసిన రాజ్యాంగాన్ని పాలకులు ఎంతవరకు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారో పరిశీలించుకోవాలన్నారు. అధికారుల్లో, పాలకుల్లో నీతి, సచ్ఛీలత లేకపోతే రాజ్యాంగం అమలు సాధ్యం కాదని అంబేద్కర్‌ ఆనాడే చెప్పారని కొనియాడారు. కాశి నవీన్‌ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు వివిధ పథకాలను ప్రవేశపెట్టారని, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు యువత స్వయం ఉపాధికి వారికి రుణాలతో వాహనాలు సమకూర్చుతున్నారన్నారు.మాగంటి రూప మాట్లాడుతూ జయంతి, వర్ధంతులకు మాత్రమే అంబేద్కర్‌ను స్మరించడం సరికాదని, ఆయన నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణితో పాటు కార్పొరేటర్లు పాలిక శ్రీను, ద్వారా పార్వతి సుందరి, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, కోసూరి చండీప్రియ, పితాని లక్ష్మీకుమారి, యిన్నమూరి రాంబాబు, మర్రి దుర్గా శ్రీనివాస్‌, తలారి ఉమాదేవి, కొమ్మ శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, కడలి రామకృష్ణ, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు మరుకుర్తి రవియాదవ్‌, మళ్ళ వెంకట్రాజు, కవులూరి వెంకట్రావ్‌, టేకుమూడి నాగేశ్వరరావు, ఈతలపాటి కృష్ణ, ధమరసింగ్‌ బ్రహ్మాజీ, జాలా మదన్‌, విశ్వనాథరాజు, కొలువుమాటి కుమార్‌, కాకర్ల సుజన, కర్రి కాశీ విశ్వనాథమ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here