రాష్ట్రాల ఆర్ధిక సౌష్టవంపై కేంద్రం దాడి (శనివారం నవీనమ్)

0
91

రాష్ట్రాల ఆర్ధిక సౌష్టవంపై కేంద్రం దాడి
(శనివారం నవీనమ్)

రాష్ట్రాల ఆదాయవనరుల్ని లెక్కించడంతో పాటు, వాటి అవసరాలను అంచనా వేయడానికి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమపథకాలను, వాటికి నిధులు సమీకరణ చేస్తున్న తీరును అధ్యయనం చేయాలని, భవిష్యత్‌ కేటాయింపులకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని 15 వ ఆర్థికసంఘానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కొన్ని సంవత్సరాలుగా మోడీ సర్కారు నడత తీరు చూస్తున్న వారికెవరికైనా ఈ దిశానిర్దేశం వెనుక ఉన్న మర్మమేమిటో అర్ధమవుతుంది.

కేంద్రీకృత పాలనా విధానంలో వ్యవస్థలను ప్రభావితం చేయడం మరింత సులభమవుతుందన్న కార్పొరేట్ల స్వార్ధం ఇందుకు ముఖ్యమైన కారణం. బలమైన కేంద్రం ఉండాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కూడా మోదీ ప్రభుత్వం ఈ విధానాలను ఉధృతంగా ముందుకు తీసుకురావడానికి మరో బలమైన కారణం.

ఈ నేపథ్యంలోనే చాలా సంవత్సరాల తరువాత రాష్ట్రాల హక్కుల అంశం తెరమీదకు వచ్చింది. వాటి పరిరక్షణ కోసం సమైక్యంగా పోరాటం చేయాలన్న దక్షిణ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు కేరళలో సమావేశమై నిర్ణయించారు. మూడు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం వున్న ఈ నిర్ణయంలో హక్కుల అతిక్రమణను నివారించడమే తప్ప రాజకీయాలు లేవని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బిఎం) పేరుతో రుణపరిమితిపై ఆంక్షలు విధించి, రాష్ట్రాల చేతుల్ని కట్టివేయడం, ప్లానింగ్‌ కమిషన్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం, నోట్ల రద్దు నిర్ణయాన్ని అనూహ్యంగా రుద్దడం, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చర్చల ప్రక్రియను ఏకపక్షం చేసి, ఆదాయ వనరులన్నింటినీ కేంద్రం గుప్పెట్లో ఉండేలా చట్టం తేవడం, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను కోత పెట్టడం వంటివన్నీ రాష్ట్రాల హక్కుల్ని రద్దుచేసే చర్యలే!

ఇప్పుడు రాష్ట్రాల హక్కుల కోసం గళమెత్తిన రాష్ట్రాలలో ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఉదారవాద ఆర్థిక విధానాలను బలపరిచేవే! కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రూపొందించిన విధానాలలో మార్పురాకుండా హక్కుల పరిరక్షణ పూర్తిస్థాయిలో సాధ్యం కాదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. దక్షిణాది రాష్ట్ర మంత్రుల సమావేశ నేపథ్యంలో ఉపయోగంలేని వివాదమంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించడం రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం వైఖరిని బయటపెడుతుంది.

వామపక్షాల పాలనలో ఉన్నచోటతప్ప ప్రతిపక్షాలు, ఎన్డీయేలో లేని ప్రాంతీయపార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు సైతం ఈ ఆర్థిక కేంద్రీకరణపై పెద్దగా ప్రతిఘటించలేదు. నోట్లరద్దుతో బ్రహ్మాండం ఊడిపడబోతోందంటూ నరేంద్రమోడీ సర్కారు చేసిన ప్రచారంలో అంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ భాగస్వామ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైతే పెద్దనోట్లను తానే రద్దు చేయమని సూచించానని చెప్పారు. జిఎస్‌టి విషయంలోనూ రాష్ట్ర సర్కారుది ఇదే వైఖరి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే ధోరణిలో వ్యవహరించడానికి రాజకీయ ప్రయోజనాలే కారణం. ఆ కారణాలతోనే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు దక్షిణాది సదస్సుకు గైర్హాజరైనాయి. 

కేంద్ర ప్రభుత్వ చర్యలవల్ల దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే నష్టం కలుగుతుందని చెప్పడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యల వల్ల కలిగే నష్టాలను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సమైక్య స్ఫూర్తికి వాటిల్లనున్న ప్రమాదాన్ని తక్కువచేసి చూడటమే అవుతుంది. ఈ తరహా చర్యల వల్ల అన్ని రాష్ట్రాల హక్కులూ ప్రభావితమవుతాయి. దీర్ఘకాలంలో కేంద్రం మోచేతినీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు విస్తృత స్థాయిలో మరింత పకడ్బందీగా అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేసేలా పోరాటం చేయాల్సిఉంది.

విశాఖలో జరుగనున్న మలిదఫా సమావేశంలో ఆ దిశగా కార్యాచరణ రూపొందుతుందని ఆశిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here