ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతం

0
66

ఎక్కడి బస్సులు అక్కడే – మూతపడిన దుకాణాలు, కార్యాలయాలు, బ్యాంక్‌లు, విద్యా సంస్థలు

రోడ్డెక్కిన విపక్షాలు – పురవీధుల్లో నిరసన ప్రదర్శనలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 16 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు, బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. నేడు జరగవలసిన పరీక్షలను అధికారులు రేపటికి వాయిదా వేశారు. చాలాచోట్ల వ్యాపారస్తులు స్వచ్చందంగానే తమ దుకాణాలను మూసివేశారు. ఈరోజు తెల్లవారుజామునే ఆర్టీసీ బస్‌ డిపోకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, కందుల దుర్గేష్‌, షర్మిలారెడ్డి, సిపిఎం నాయకులు అరుణ్‌, జనసేన నాయకులు వై.శ్రీనివాస్‌, గంటా స్వరూపాదేవి, ప్రియ సౌజన్య, అత్తిలి రాజు, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్‌, తదితరులు పాల్గొని బస్సులు కదలకుండా నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. బంద్‌ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోటగుమ్మం సెంటర్‌ నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. రౌతు, దుర్గేష్‌లతోపాటు పార్టీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, షర్మిలారెడ్డి, పోలు కిరణ్‌రెడ్డి, మజ్జి నూకరత్నం, గుర్రం గౌతమ్‌, నీలపాల తమ్మారావు, భీమవరపు వెంకటేశ్వరరావు, ఉప్పాడ కోటరెడ్డి, కాటం రజనీకాంత్‌, మహ్మద్‌ ఆరిఫ్‌, నయీం భాయ్‌, కానుబోయిన సాగర్‌, కోడికోట సత్తిబాబు, తామాడ సుశీల, కట్టా సూర్యప్రకాశరావు, కంది రాఘవ, సంకిస రవిశంకర్‌, షేక్‌ మస్తాన్‌, అందనాపల్లి సత్యనారాయణ, ముప్పన శ్రీనివాస్‌, సప్పా ఆదినారాయణ, భాషా, తదితరులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల్లో ఉన్న షాపులను మూయించి కోటిపల్లి బస్టాండ్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వై.శ్రీనివాస్‌, ప్రియ సౌజన్య, ఏడిద బాబి, గంటా స్వరూప, అల్లాటి రాజు, అత్తిలి రాజు, దాసరి గురునాధం పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం నాయకులు నగరంలో వివిధ చోట్ల నిరసన ప్రదర్శన చేపట్టి ప్రత్యేక హోదా నినాదాలు వినిపించారు. సిపిఎం నాయకులు టి.ఎస్‌.ప్రకాష్‌, టి.అరుణ్‌, టి.సావిత్రి, టి.తులసి, సిపిఐ నాయకులు నల్లా రామారావు, తోకల ప్రసాద్‌, ఏడుకొండలు, సేపేని రమణమ్మ, నల్లా భ్రమరాంబ, తోకల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనేక కూడళ్ళలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నిరసన గళాలు వినిపించాయి. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రకటించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చూపిస్తున్న వివక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను ప్రజలు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్ళ మీదుగా ర్యాలీ సాగించి తమ నిరసన గళాన్ని వినిపించి ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రులను మోసగించారని, దీనిని ప్రజలు క్షమించబోరన్నారు. కాంగ్రెస్‌ నేతలు దాసి వెంకట్రావు, బెజవాడ రంగా, చాపల చిన్నిరాజు, అబ్దుల్లా షరీఫ్‌, గోలి రవి, కొవ్వూరి శ్రీనివాస్‌, నలబాటి శ్యామ్‌, దుప్పాటి సుధాకర్‌, నరాల లక్ష్మీ పార్వతి, పిల్లా సుబ్బారెడ్డి, కాటం రవి పాల్గొన్నారు. ఈరోజు బంద్‌లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here