రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి రండి
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 18 : రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తన పుట్టినరోజున ధర్మ పోరాట దీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడికి సంఘీభావంగా రాష్ట్ర ప్రజలు, వివిధ వర్గాలవారు తరలి రావాలని గుడా చైర్మన్ గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు యుద్దం చేస్తున్నారని, అందులో భాగంగానే ఒకరోజు దీక్ష తలపెట్టారని పేర్కొన్నారు. ఈ దీక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా చేయడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల మంది ఆంధ్రుల పక్షాన చేస్తున్న ఈ దీక్షలో రాజకీయాలను పక్కనే పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి రావాలని గన్ని కోరారు. అమరావతిలో చంద్రబాబు దీక్ష చేస్తున్నారని, మిగిలిన 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నగరంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 7 గంటల నుంచి నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని, ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. తాము చేసే దీక్షా శిబిరం వద్దకు రావడానికి అభ్యంతరాలు ఉంటే నచ్చిన ప్రదేశంలో తమ నిరసన తెలియజేయాలని కోరారు. శిబిరం వద్దకు వచ్చేవారు పూలదండలను తీసుకు రావద్దని, దీక్షలో పాల్గొనేవారు పసుపు చొక్కాలు ధరించి రావాలని కోరారు.