ఆ మాటల్లో కుట్ర కోణం ఉంది

0
79

సోము వీర్రాజు వ్యాఖ్యలపై పోలీసులకు గుడా చైర్మన్‌ గన్ని ఫిర్యాదు

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 22 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన కుట్ర పూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈరోజు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఫిర్యాదు చేశారు. సీఎంపై ప్రెస్‌క్లబ్‌లో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వీర్రాజు ఏ విధమైన నేరం చేయడానికి కుట్ర పన్నారో ఆ విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ‘2004లో అలిపిరి కనబడింది…2019లో కూడా అలాంటిదే కనబడుతుంది.. 2004లో ఏమైందో ముఖ్యమంత్రికి 2019లో కూడా అదే జరగబోతోంది. అందులో ఏ విధమైన సందేహం లేదు”అని వ్యాఖ్యలు చేయడం నేరం చేసే ఉద్ధేశ్యమని అన్నారు. 2019లో ఆయన చేయబోయే నేర పూరిత కుట్రకు ముందు హెచ్చరికగా, బెదిరింపుగా ఈ వ్యాఖ్యలు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ చట్టం క్రిందకు ఈ వ్యాఖ్యలు వస్తాయని పేర్కొన్నారు.ఆయనపై ఏపీపీఎస్‌ యాక్ట్‌, 120 (బి), 503, 506 ఐపీసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ త్రీ టౌన్‌ సి.ఐ. మారుతీరావుకు ఫిర్యాదు లేఖను, వీడియో ఫుటేజీలను, పేపర్‌ క్లిపింగ్‌లను గన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అమర్యాదకరంగా, జుగుస్సాకరంగా ఉన్నాయని, సీఎం చంద్రబాబుపై జగన్‌, పవన్‌లతో పాటు బిజెపి నేతలు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ వీర్రాజు వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నాయకులు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పాటు ఇంటిపై రాళ్ళు కూడా రువ్వారని, అటువంటి సంస్కృతి, సంప్రదాయం తమ అధినేత చంద్రబాబు నేర్పించలేదన్నారు. చంద్రబాబు ప్రాణాలు తీసేంతగా కుట్రలు జరుగుతున్నాయని, ఆయనకు లక్షలాది కార్యకర్తలు, ఏపీ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా అధినేత ప్రాణాలను రక్షించుకునేందుకు తమ ప్రాణాలను పణంగా పెడతామన్నారు.విజయసాయిరెడ్డి, జగన్‌, సోము వీర్రాజు వంటి నేతల కుట్రలను చట్ట బద్ధంగానే తాము ఎదుర్కొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, యిన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ, బెజవాడ రాజ్‌కుమార్‌, తంగెళ్ళ బాబి,కురగంటి ఈశ్వరి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కురగంటి సతీష్‌, కంటిపూడి శ్రీనివాస్‌, పెనుగొండ రామకృష్ణ, కరగాని వేణు, రెడ్డి సతీష్‌, ఉప్పులూరి జానకిరామయ్య, సురేంద్ర, కంచిపాటి గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here