సొంతింటి కల సాకారమే లక్ష్యం

0
119

సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

బొమ్మూరులో గృహ నిర్మాణ పనులు పరిశీలన – నగరపాలక సంస్థ భవన నిర్మాణంపై ప్రశంసలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని, అందులో భాగంగా రాష్ట్రంలో ఆరు లక్షల 81వేల ఇళ్ళను పూర్తి నాణ్యతతో నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ పి.నారాయణ తెలిపారు. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బొమ్మూరు వద్ద నిర్మిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం పరిధిలో తొలి విడతగా 4,200 ఇళ్ళు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, 2వ దశలో 3,676 గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు పేద ప్రజలు గృహాలు నిర్మించుకునేందుకు పదివేల గృహాలకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.133 కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ గృహాలు మంజూరైన లబ్ధిదారులు వాటిని విక్రయించినా, అద్దెలకు ఇచ్చినా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం పరిధిలో 80 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తామని ఆ స్థలాల్లో గృహ నిర్మాణాల కోసం అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం.పి. మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసే గృహాలను అర్హులైన పేదలకు అందిస్తామని, భూమి కలిగి ఉన్నవారు గృహాలు నిర్మించకునేందుకు కూడా రుణాలు విడుదల చేస్తామన్నారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన గృహాలకు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. నగరంలో ఇంకా ఇండ్ల కోసం 18వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ ఇటీవల పలు రాష్ట్రాలలోని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను సందర్శించామని, అక్కడ జరిగే గృహ నిర్మాణం తీరును పరిశీలిస్తే మన రాష్ట్రంలో జరిగే పనితీరు మెరుగ్గా ఉందని, నాణ్యత విషయంలో సీఎం చంద్రబాబు రాజీపడబోరన్నారు. ఈ సందర్భంగా అమృత్‌ పథకం ద్వారా మంజూరైన రూ.82.16 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. కంబాలచెరువు, రైల్వేస్టేషన్‌ వద్ద డ్రైనేజీ నిర్మాణానికి, ధవళేశ్వరం వద్ద రూ.17.88 కోట్లతో 5 ఎంఎల్‌డి ఎస్‌టిపి ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన 39వ డివిజన్‌లోని ఎన్‌ఆర్‌సిపి ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా భవనాన్ని నిర్మించడంపై ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, గుడా వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు పెనుగొండ విజయభారతి, రెడ్డి పార్వతి, కోసూరి చండీప్రియ, యిన్నమూరి రాంబాబు, సింహ నాగమణి, కడలి రామకృష్ణ, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, టిడిపి నాయకులు మజ్జి రాంబాబు, రొంపిచర్ల ఆంథోని, పెనుగొండ రామకృష్ణ, తలారి భగవాన్‌, రాయి అప్పన్న, బిజెపి నాయకులు నాళం పద్మశ్రీ, నీరుకొండ వీరన్న చౌదరి, నగరపాలక సంస్థ, ప్రజారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here