సోము పైరవీల చిట్టా మా దగ్గరుంది..సీబిఐకి పంపుతాం

0
173

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శకునిలా తయారయ్యారు

స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది : ఎమ్మెల్యే గోరంట్ల ధ్వజం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27 : వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని ఆయన జాతీయ నేత అని అనుకుంటున్నారని, టిడిపి వలన ఆయనకు ఎమ్మెల్సీ వచ్చిందని అయితే సీఎం చంద్రబాబుకి చుక్కలు చూపిస్తామంటూ ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. ప్రతి దానికి ఫిిర్యాదులు చేస్తూ, రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య సోము వీర్రాజు శకునిలా తయారయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్రాజు పైరవీల చిట్టా తమ దగ్గర ఉందని బుచ్చయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఈ వివరాలు కూడా ఆయన పార్టీ వాళ్ళే ఇచ్చారన్నారు. దీన్ని సీబీఐకి పంపిస్తామన్నారు. విచారణ చేస్తే విషయాలు తెలుస్తాయన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, బెజవాడ రాజకుమార్‌, కోసూరి చండీప్రియ, గగ్గర సూర్యనారాయణ, బూర దుర్గాంజనేయరావు, పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, కురగంటి సతీష్‌, పితాని కుటుంబరావు తదితరులతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోము జాతకం తమ దగ్గర రెడీగానే ఉందన్నారు. ఎక్కడెక్కడ పైరవీలు చేసారో, సోము ఖాతాలో ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఎక్కడ నుంచి ఎంత సొమ్ము చేరిందో అన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయని గోరంట్ల చెబుతూ సీబీఐకి పంపిస్తామన్నారు. ‘నీ చరిత్ర ఏమిటో తెల్సు,నీ శక్తి ఎంత,నీవెంత? రాష్ట్ర ప్రభుత్వాన్ని నీవు, నీ కేంద్రం ఏం చేస్తారు”అని సోమును ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పోలవరం మీద, పట్టిసీమ మీద, నీరు చెట్టు మీదా ఇలా అన్నింటిపై పిటీషన్లు పెట్టి అభివ ద్ధిని అడ్డుకుంటున్నారని గోరంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లే దాంట్లో కేంద్రం ఇచ్చేదేంత అని ఆయన నిలదీశారు. మా సొమ్ము మాకివ్వడానికి బిచ్చం వేస్తున్నట్లు మాట్లాడితే ఎలా అని ఆయన పేర్కొంటూ, మేము బిచ్చగాళ్లం కాదన్నారు. ఇతర రాష్ట్రాలకు వేలు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తూ, మనకేమో బిచ్చం వేసినట్లు, రాజధానికి 1500కోట్లు, 11కేంద్ర సంస్థలకు మొక్కుబడిగా నిధులు ఇవ్వడం శోచనీయమన్నారు.

యుద్ధ విమానాల కుంభకోణం మాటేమిటి?: గోరంట్ల

రాఫెల్‌ యుద్ధ విమానాల ఎవ్వారంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారాయని గోరంట్ల పేర్కొంటూ అవినీతి లేని గొప్ప పరిపాలన అందిస్తున్నామని చెబుతున్న ప్రధాని మోడీ సర్కార్‌ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు. గతంలో కేవలం 250కోట్ల రూపాయలు చేతులు మారాయన్న బోఫోర్స్‌ కుంభకోణం దేశాన్ని కుదిపేసి, చివరకు కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకునేలా చేసిందని గుర్తుచేశారు. అయితే రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇప్పడు వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. గతంలో యుపిఎ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయించి,126 విమానాలకు 54వేల కోట్ల రూపాయల చెల్లింపు చేయాలనీ, సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు బదలాయింపు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని అయితే ఒక్కో విమానానికి 526 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ ఒప్పందాన్ని రద్దుచేసి ఎన్డీయే ప్రభుత్వం ఆ తర్వాత 36 విమానాలకు 58 వేలకోట్ల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటని గోరంట్ల ప్రశ్నించారు. ఒక్కో విమానానికి 1670 కోట్లు వెచ్చించడానికి ఒప్పుకున్నారంటే, 25వేలకోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగివుందని ఆయన ఆరోపించారు. దీనిపై దేశప్రజలకు సమాధానం చెప్పాలంన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెబుతూ ఈ కుంభకోణం బయటకు రాకుండా చేస్తున్నారని, ఈ సొమ్ముని గుజరాత్‌,యుపి, కర్ణాటక ఎన్నికలకు తరలించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొంటూ అందుకే ప్రధాని దీనికి సమాధానం చెప్పాలని జాతి ప్రశ్నిస్తోందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here