చోరీల నివారణకు ప్రత్యేక ప్రణాళిక

0
49
క్రైం సమీక్ష సమావేశంలో అర్బన్‌ ఎస్పీ రాజకుమారి
 రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : నగరంలో ఇటీవల పెచ్చుమీరిన చోరీలను అరికట్టేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. తన కార్యాలయంలో ఈరోజు జరిగిన క్రైం సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై నేరాలు నిరోధించేందుకు, వారి భద్రత కోసం రూపొందించిన ప్రణాళికలు అమలు తీరు, కేసులను సమీక్షించి వాటి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇళ్ళలో చోరీలు, దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌, మోటర్‌ వాహనాల చోరీ తదితర నేరాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నేరాలను నిరోధించడానికి సిబ్బందిని బలోపేతం చేయనున్నట్లు ఆమె తెలిపారు.  కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. అదే విధంగా గేంబ్లింగ్‌, కోడి  పందెములు, సింగిల్‌ నెంబర్‌ లాటరీ, హైటెక్‌ వ్యభిచారం వంటి నేరాలపై నిఘా పెట్టి వాటిని నిరోధించాలని ఆదేశించారు. కాగా గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం ఆర్టీసి బస్‌ కాంప్లెక్స్‌లో 30 కాసుల బంగారం కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి చేధించి నిందితులను అరెస్టు చేసిన ప్రకాశం నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సిఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ళు ఎం.ప్రసాద్‌, కె.సురేష్‌బాబు, సిహెచ్‌.అశోక్‌లకు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో పలువురు డిఎస్పీలు,సిఐలు, ఎస్‌.ఐ.లు, ఎస్‌బి సిబ్బంది, డిసిఆర్‌బి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.