విచారణకు మీరు సిద్ధమేనా?

0
45

రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్లకు బొమ్ములదత్తు సవాల్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 29 : తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ బాగా పడిపోయిందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కేది తృతీయ స్ధానమేనని, 20 సీట్లకు మంచి రావని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు పేర్కొన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దత్తు మాట్లాడుతూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుపై ఎమెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డిలు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. సోము వీర్రాజు 2014 ఎన్నికల సమయంలో బిజెపి ఎన్నికల కమిటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను టిడిపి తరపున కూడా ప్రచారం చేయడానికి ఒప్పించడం వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఓడిపోయే సీటుకోసం పోటీ పడుతూ పోటాపోటీగా సోము వీర్రాజుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. గోరంట్ల అవినీతి గురించి అందరికీ తెలిసిందేనన్నారు. ఇసుక, మట్టిని దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును డాలర్‌లుగా మార్చి అమెరికాలో దాచుకుంటున్నారని ఆరోపించారు. ఆరు నెలలు ఇక్కడ, ఆరు నెలలో అమెరికాలో ఉండే పెద్ద వలసవాది గోరంట్ల అని విమర్శించారు. సోముపై అవినీతి ఆరోపణలు హాస్యాస్పందగా ఉన్నాయన్నారు. సోముపై సిబిఐ విచారణను తాము స్వాగతిస్తామని, అలాగే గోరంట్ల అవినీతిపై కూడా సిబిఐతోనో, లేదా ఈడితోనో విచారణ కోరాలని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి ఎంత చిత్తశుద్ధితో పనిచేసారన్నది, ఇక్కడ ఎంపికి, ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలలో వ్యత్యాసమే వెల్లడి చేస్తుందన్నారు. 12చోట్ల బిజేపి అభ్యర్ధుల కోసం టిడిపి పనిచేస్తే, 163 చోట్ల టిడిపి గెలుపుకోసం బిజెపి కార్యకర్తలు పనిచేసారన్నది గుర్తించుకోవాలన్నారు. సోమును రాజీనామా కోరితే టిడిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. టిడిపిలోనుంచి వైసిపిలోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ కొనుక్కొని, ఆ పదవితోనే టిడిపిలోకి వచ్చిన వారు విలువలు, పార్టీ సిద్ధాంతాలకోసం పనిచేసే సోమును విమర్శించడానికి తగరన్నారు. రాజమహేంద్రవరంలో ఈ నాయకులకు టికెట్‌ ఇచ్చే కంటే పార్టీకోసం పనిచేసే గన్నికి టికెట్‌ ఇస్తే టిడిపికి కొంత గౌరవం దక్కుతుందన్నారు. నగర టిడిపిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బుచ్చయ్య ఎదగనివ్వలేదన్నారు. బిజెపి అభ్యర్ధిని బ్రతిమలాడుకుంటానంటేనే ఆయనకు గత ఎన్నికల్లో రెండు బి.ఫారంలు వచ్చాయన్నారు. టికెట్‌ కూడా చంద్రబాబును బ్లాక్‌మెయిల్‌ చేసి తెచ్చుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన బ్రిక్స్‌ ఫాక్టరీ ద్వారానే మిగిలిన ఫ్యాక్టరీల ఇటుకలను కూడా ప్రభుత్వానికి సరఫరా చేసి కమిషన్‌లు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. మద్యం సిండికేట్‌ల నుంచి మీ వసూళ్ళు గురించి తెలిసిందేనని ఆరోపించారు. సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి అయితే సోము అధికార పార్టీలోకే వెళ్ళి తన తెలివితేటలతో మీకన్నా ఎక్కువ సంపాదించేవారన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు సోము వీర్రాజు అన్నారు. పార్టీకోసం పనిచేస్తే అధ్యక్ష పదవి వస్తుంది తప్ప, టిడిపిని తిడితే పార్టీ అధ్యక్షపదవి ఎలా వస్తుందో అర్ధం కాని వాదనని ఎద్దేవా చేసారు. విలేకరుల సమావేశంలో బిజెపి నగర ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు, నాయకులు సత్తి మూలారెడ్డి, యెనుముల రంగబాబు, కెవిఎం కృష్ణ, నల్లమిల్లి వీర బ్రహ్మానందం, నిల్లా ప్రసాద్‌, కాలెపు సత్యసాయిరామ్‌, బొంత నిరంజన్‌, చంద్రశేఖర్‌, దుశ్యంత్‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here