టికెట్‌ అడిగే హక్కు.. అర్హత నాకున్నాయి…

0
87
చట్టసభలో ప్రవేశం నా జీవిత లక్ష్యం
ఇచ్చినా ఇవ్వకున్నా  తెదేపా విజయమే లక్ష్యం
చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వడం ఈ రాష్ట్రానికి  అవసరం
మీట్‌ ది ప్రెస్‌ లో గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ
రాజమహేంద్రవరం, మే 9 : ” జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జెసిఐ) నుంచి క్రమశిక్షణ, విలువలకు కట్టుబడటం, నిబద్ధతగా మెలగడం… అంకితభావాన్ని అలవర్చుకున్నా… వ్యక్తిగత జీవితంలోనైనా, రాజకీయ రంగంలోనైనా నమ్మిన సిద్ధాంతానికి  కట్టుబడి పనిచేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నా… రాజకీయాల్లో పదవులు ఆశించి ఏనాడూ పనిచేయలేదు…పదవుల కోసం ఏనాడూ దిగజారి వ్యవహరించలేదు… పార్టీ నా పై విశ్వాసం ఉంచి  ఏ బాధ్యత అప్పగించినా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ వస్తున్నా… రాజకీయాలతో పాటు సామాజిక సేవ అంటే నాకు చాలా ఇష్టం…ఆ ఇష్టంతోనే ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చా…  ఇకపై కూడా ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా…. ఎందుకంటే అందులోనే ఎంతో ఆత్మ తృప్తి ఉంది… అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ. ”తెలుగుదేశం పార్టీలో సీనియార్టీ పరంగా గానీ ,పార్టీ పట్ల కమిట్‌మెంట్‌ వున్న కార్యకర్తగా గానీ  పార్టీ టికెట్‌ అడిగే హక్కు నాకే వుంది. చట్టసభకు వెళ్లాలన్నది నా కోరిక. టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకోసం పనిచేస్తా. మళ్ళీ చంద్రబాబు సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతో వుంది. లేకుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది. టికెట్‌ ఎవరికిచ్చినా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ విజయాలే నాకు ముఖ్యం”  గణేష్‌ చౌక్‌లోని ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ లో ఉదయం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు కుడుపూడి పార్థసారధి అధ్యక్షత వహించారు. కార్యదర్శి జెవివి గణపతి స్వాగతం పలికారు. ఎపియు డబ్ల్యుజె నాయకులు శ్రీ మండేలా శ్రీరామమూర్తి వేదికపై వున్నారు. గన్ని క ష్ణను సీనియర్‌ పాత్రికేయులు,సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు వి ఎస్‌ ఎస్‌ క ష్ణకుమార్‌ పరిచయం చేసారు.  మీట్‌ ది ప్రెస్‌ లో గన్ని క ష్ణ తన  అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని, అందులో ఎదురైన ఒడిదుడుకులను, భవిష్యత్తు ఆలోచనలను ఆవిష్కరించారు. ఈసందర్బంగా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ నిజానికి టికెట్‌ అడిగే హక్కు నాకే వుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ గెలుపుకోసం, శ్రేయస్సు కోసం ఏ పని అప్పగిస్తే ఆపని చేస్తూ వస్తున్నానని, 1985లో టికెట్‌ వచ్చినట్టే వచ్చి పోయిందని, 2004లో బలమైన వెన్నుపోటు వలన టికెట్‌ దక్కలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికే టికెట్‌ వస్తుందని అనుకుంటున్నారని అప్పుడు ఎలా స్పందిస్తారని అడగ్గా  ‘నేను చట్ట సభకు వెళ్లాలన్నది మా నాన్న స్వర్గీయ గన్ని సత్యనారాయణ మూర్తి గారి కోరిక. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకండీ టికెట్‌ ఇవ్వకపోయినా ఇంకా అలాగే నమ్ముకుని పనిచేస్తారేమిటని అడుగుతున్నారు. కానీ పార్టీ పట్ల కమిట్‌మెంట్‌ అలాగే కొనసాగుతోంది. ఎందుకంటే పదవులకోసం రాజకీయాల్లోకి రాలేదు. సమాజ సేవలా కసిగా పనిచేస్తున్నాను. టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాను. టికెట్‌ కావాలని అడగలేదు, రాలేదని ఏనాడూ ఎవరిని  నిందించలేదు. అలాగని  పార్టీ మారలేదు. ఈసారి  టికెట్‌ వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ రాకపోయినా, అభ్యర్గి ఎవరైనా సరే పార్టీ ఆదేశం మేరకు  గెలుపు కోసమే శ్రమిస్తా. మళ్ళీ చంద్రబాబు సీఎం అవ్వాలన్నదే నా ధ్యేయం. టిక్కెట్‌ నాకు రావాలని కోరుకుంటున్నా…అయితే సమీకరణల దృష్ట్యా టిిక్కెట్‌ తనకు ఇవ్వకుండా పార్టీ వేరే వారికి ఇచ్చినా వారి విజయం కోసం పనిచేస్తా… అయితే ఆ తర్వాత తనను ఎలా సర్ధుబాటు చేస్తారో చంద్రబాబు ఇష్టం… మొత్తం మీద చట్టసభలోకి ప్రవేశించాలన్న తన ఆకాంక్షను చంద్రబాబు నెరవేరుస్తారని ఆశిస్తున్నా… అలా జరగకపోతే ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తా”అని గన్ని స్పష్టం చేసారు. పార్టీకోసం, పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు ఎవరినైనా సరే ప్రశ్నించిన సందర్భాలున్నాయని ఆయన పేర్కొంటూ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి తానెప్పుడూ వెనుకాడలేదన్నారు. చంద్రబాబుకి తన నైజం పూర్తిగా తెలుసునన్నారు. తెదేపాలో అంతర్గత సంక్షోభం తలెత్తినప్పుడు 1996లో పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు తాను ఆసక్తి చూపలేదని, ఈ పర్యాయమైనా టిక్కెట్‌ వస్తుందని ఆశిస్తున్నానని, ఈ విషయంలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని గన్ని కృష్ణ అన్నారు.
1984 నాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి రావాలి
1984లో ఎన్‌టి రామారావును అప్రజాస్వామికంగా పదవీ వీచ్యుతుడిని చేసినప్పుడు పార్టీల కతీతంగా కాంగ్రెసేతర పార్టీలన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరిట ఉధృతంగా ఉద్యమం నిర్వహించి సరిగ్గా నెల రోజుల వ్యవధిలో తిరిగి ఎన్‌టిఆర్‌ను సీఎం చేశారు…అప్పట్లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు పార్టీలు,ప్రజలంతా ఏకమై ఉద్యమించి విజయం సాధించినప్పుడు ఇపుడు ఆంధ్రప్రదేశ్‌  ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదా… విభజన హామీల సాధన విషయంలో పార్టీలన్ని ఏకతాటిపై ఎందుకు పనిచేయడం లేదని నేను అనుక్షణం మధనపడుతున్నా…1984 లో మాదిరిగా రాష్ట్రం కోసం అంతా ఏకతాటిపై పనిచేసి కేంద్రం దిగివచ్చేలా పనిచేయాలన్నది నా ఆకాంక్ష” అన్నారు గన్ని.  అయితే తనకు టిక్కెట్‌ రావడం కంటే ముందు ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నది తన ధ్యేయమని, బాబు తిరిగి రాకుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని, అందుకని సమీకరణల్లో తనకు టిక్కెట్‌ రాకున్నా పార్టీ విజయం కోసం త్రికరణ శుద్ధిగా పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తానని, ఆ తర్వాతైనా పార్టీ తనకు చట్టసభలో ప్రవేశించే అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
ఆనాడు టిడిపి శిక్షణలో …
1985లో రామక ష్ణ సినీ స్టూడియోస్‌ లో ఏపీలో ఎంపిక చేసిన టిడిపి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారని, ఈ జిల్లా నుంచి తనతో పాటు నిమ్మకాయల చినరాజప్ప,రెడ్డి సుబ్రహ్మణ్యం, స్వర్గీయ కుదుప సురేంద్ర ఆ శిక్షణలో పాల్గొన్నామని గన్ని క ష్ణ చెప్పారు. డాక్టర్‌ సి నారాయణ రెడ్డి వంటి ఉద్దండులు పాఠాలు చెప్పేవారని, దానికి చంద్రబాబు ప్రిన్సిపాల్‌ గా ఉండేవారని,అన్న ఎన్టీఆర్‌ తెల్లవారుఝామునే అక్కడకు వచ్చి అందరినీ లేపేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటినుంచి  ఎన్టీఆర్‌ అభిమాని గా వుండే తనకు ఇలాఎన్టీఆర్‌ సమక్షంలో శిక్షణ పొందడం  ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
నా తండ్రి కష్టార్జితం మరువలేనిది…
తానేమీ ఆగర్భ శ్రీమంతుణ్ణి కాదని గన్ని క ష్ణ పేర్కొంటూ ఇదంతా తన తండ్రి స్వర్గీయ గన్ని సత్యనారాయణ మూర్తి పడిన కష్టానికి ఫలితమని గన్ని క ష్ణ చెప్పారు. ‘మాది మొదట్లో కమ్యూనిష్టు కుటుంబం. నా తండ్రి సాధారణ రైతు కుటుంబంలోంచి వచ్చారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఎన్నోచోట్ల పనిచేసి చివరకు ఏజన్సీలో పనిచేస్తూ,కలప వ్యాపారం ప్రారంభించి అందులో అష్టకష్టాలు పడ్డారు. ఆఖరికి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో సంతకం చేయించుకోడానికి అప్పట్లో లారీలో ఏజన్సీ వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా నాన్న పడుతున్న కష్టం చూసేవాళ్ళం. అది తలచుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి’అని ఆయన పేర్కొన్నారు.
జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ పక్షాన వైద్య సేవలు ..
మొదట్లో పదిమందిలో మాట్లాడ్డానికి బిడియపడే తనను ఓ వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిద్దిన సంస్థ ఇండియన్‌ జూనియర్‌ చాంబర్‌ అని గన్ని క ష్ణ చెబుతూ జూనియర్‌ చాంబర్‌ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగానని గుర్తుచేశారు.  ఆతర్వాత స్పందన స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అయితే స్పందన సంస్థ రిజిస్ట్రేషన్‌ అప్‌ డేట్‌ కాకపోవడం వంటి విషయాలను ద ష్టిలో ఉంచుకుని,జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌గా మార్పుచేశామని, ఈ ట్రస్ట్‌ ద్వారా రాజమండ్రి సిటీ, రూరల్‌, రాజానగరం నియోజక వర్గాల్లో విస్త త స్థాయిలో వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాజకీయ కోణం ద ష్టిలో కాకుండా సేవాభిలాషతోనే వైద్యసేవలు చేపట్టనున్నల్టు ఆయన చెప్పారు. జిఎస్‌ఎల్‌,కాంపస్‌ సంస్థలతో కల్సి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి,వారికీ అవసరమైన వైద్య సేవలు జె ఎస్‌ ఎల్‌ ఆసుపత్రిలో చేయిస్తామని,అర్హులైన పేదలకు ఉచితంగా,మిగిలిన వారికి నామమాత్రపు చార్జీలతో వైద్యం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం రెండుకోట్ల రూపాయలతో అన్ని రకాల పరీక్షలు చేసేవిధంగా ఓ సంచార వైద్యశాల  సిద్ధం అవుతోందని చెప్పారు.
అందరితో మిత్రత్వం  నా నైజం
 ‘నాకు అందరితో మిత్రత్వం వుంది.  స్వర్గీయ జక్కంపూడి రామమోహనరావుతో రాజకీయాల రీత్యా వీధి పోరాటాలు చేసినా, ఆయనతో కూడా మిత్రత్వం చివరివరకూ కొనసాగింది. స్వపక్షం, విపక్షం అని లేకుండా అందరితో మిత్రత్వం వుంది. రాజమండ్రి,గోదావరి నీళ్ల ప్రభావం ఏమో గాని అలాంటి మంచి వాతావరణం ఇక్కడ వుంది”అని గన్ని క ష్ణ పేర్కొన్నారు. ఇక పొతే శత్రువుతో పోరాడడం సులువని, అయితే కూడా కూడా  ఉంటూ దెబ్బతీసేవారిపై పోరాడడం కష్టమని ఆయన తన జీవితంలో ఎదురైనా సంఘటనలను ప్రస్తావించారు.
నేను బాధపడిన ఆ రెండు సంఘటనలు..
ఎన్‌.టి.రామారావు తనకెంతో ఆరాధ్యుడని, రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన 1995లో పదవీవీచ్యుతుడయ్యాక నగరానికి వచ్చినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం  చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న తాము నల్ల జెండాలతో మహనీయుడు ఎన్టీఆర్‌కు నిరసన తెలియజేయడం తననెంతో బాధించిందని, అలాగే తన రాజకీయ గురువు దివంగత లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి మరణం కూడా తనను తీవ్రంగా కలచివేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా గన్ని కృష్ణ చెప్పారు.
నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిస్తే తట్టుకోలేం
2009లో రాజమహేంద్రవరం రూరల్‌లో పార్టీ ఆదేశాల మేరకు చందన రమేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎంతో కృషిచేశానని, అలాగే 2014లో తాను టిక్కెట్‌ ఆశించినప్పటికీ పార్టీ ఆదేశం మేరకు రాజమహేంద్రవరం సిటీలో నాటి తెదేపా – భాజపా మిత్రపక్షాల అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ విజయానికి కృషిచేశానని, ఆ తరువాత సిటీ నియోజకవర్గానికి తనను పార్టీ ఇన్‌ఛార్జిగా నియమిస్తామని చెప్పినా అందుకు సంబంధించి పార్టీ నుంచి అధికారిక ఉత్తర్వు వెలువడలేదని, అయితే ఆ తరువాత తనను, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును పార్టీ సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించిందని ఆయన తెలిపారు. ”శత్రువు ఎదురుగా నిలబడి పోరాటం చేస్తే ఎదుర్కోవచ్చు గానీ.. నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిస్తే తట్టుకోలేం రాజకీయంగా నన్ను నమ్మించి కొందరు ద్రోహం చేశారు” అని ఆవేదన భరితమైన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా ఇవన్నీ తనకు ముఖ్యం కాదని, చంద్రబాబు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే తన ధ్యేయమన్నారు.
హోదాపై బిజెపి నేతలు కప్పదాట్లు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని 2014 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా హామీనిచ్చారని, అయితే బిజెపి నేతలు అలా హామీనివ్వలేదని బుకాయించడం బాధాకరమని గన్ని కృష్ణ అన్నారు. అయితే హోదాను కొత్తగా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని, హోదా అమలవుతున్న రాష్ట్రాల్లో కూడా వాటిని దశలవారీగా కూడా ఎత్తివేస్తామని కేంద్రం చెప్పడంతో చంద్రబాబు హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, అయితే ఆ ప్యాకేజీని కూడా అమలు చేయకపోవడంతో నాలుగేళ్ళు నిరీక్షించి చంద్రబాబు ఆఖరి కేంద్ర బడ్జెట్‌ చూసి తన గళం విప్పారని ఆయన అన్నారు. రక్షణ బడ్జెట్‌లో కోత పెట్టి ఆంధ్రాకు నిధులు ఇమ్మంటారా అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రజలందరినీ ఎంతో బాధించిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ఎన్నికల సంవత్సరం కాబట్టి చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని హోదా కావాలని అడగడంలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా గన్ని కృష్ణ అన్నారు. హోదా అరెస్ట్‌లే అని చంద్రబాబు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే విశాఖలో ఇటీవల బిజినెస్‌ సమ్మిట్‌ జరిగినప్పుడు పెట్టుబడుల అవకాశాలను దెబ్బతీసేటట్లుగా ప్రతిపక్ష నేత విశాఖ వచ్చి ఆందోళన చేయబోగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం జగన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆ పార్టీ వారు ప్రత్యేక హోదా అంటే అరెస్ట్‌లే అంటూ దుష్ప్రచారం ప్రారంభించారని గన్ని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు ద్వారా ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్ళి ప్రత్యర్ధులపై పసలేని విమర్శలు చేయడం, తాను వెనుకబడిన తరగతులకు చెందినవాడనని, ఛాయ్‌ అమ్ముకునేవాడిని మళ్ళీ ప్రధాని మంత్రిని చేయకూడదని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయంటూ సెంటిమెంట్‌ను విసిరి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని గన్ని కృష్ణ ధ్వజమెత్తారు.
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు
గుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతోందని, తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతను నెరవేర్చడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, గత ఏడాదిగా చేపట్టిన కార్యక్రమాలను గన్ని వివరించారు. కాగా అనధికార లేఔట్లతో  సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నందున  వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళానని, త్వరలో దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గుడా తరఫున కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు పిఠాపురం, పెద్దాపురం పట్టణాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, నెలకు రెండు పర్యాయాలు కాకినాడలో గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహిస్తున్నామన్నారు. గుడా తరఫున ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అలాగే  గుడా తరఫున లేఔట్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. తనను అసమర్ధుడన్నా ఒప్పుకుంటా గాని  దుర్మార్గుడు, అవినీతి పరుడంటే తాను ఎంతమాత్రం అంగీకరించనని, రాజకీయ రంగంలోనైనా, సేవా రంగంలోనైనా మానవ తా దృక్పథంతో పనిచేయడం తన నైజమని గన్ని ఈ సందర్భంగా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here