సాంస్కృతిక సమైక్యతకు మోదీ ముప్పు (శనివారం నవీనమ్)

0
74

సాంస్కృతిక సమైక్యతకు మోదీ ముప్పు

(శనివారం నవీనమ్)

మోడీ రాజ్యం బీటలు బారుతోంది. చాయ్ వాలా దశనుంచి నుంచి ప్రధాని స్ధాయికి ఎదిగిన నరేంద్రమోదీ వల్ల పేద ప్రజలకు ఏదైన మేలు జరుగుతుందని పేదవర్గాలవారు భావించారు. కానీ మతపరమైన భావాజాలంతో భారత దేశంలో వుండే సమతుల్య సంస్కృతిని మోడీ దెబ్బతీస్తున్నాడని అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. 

దళితులు, ముస్లింలు, బహుజనులు ఏకమై బై ఎలక్షన్లలో గట్టిగా బుద్ధి చెప్పారు. 11 రాష్ట్రాల్లో 14 స్ధానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తే టోటల్‌ పరాజయం పాలయ్యారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోరపరాజయం మోడీ అమిషాపతనానికి ఆద్దం పడుతోంది. లోక్‌సభ ఉప ఎన్నికల్లో 2014 నుంచి 8 స్ధానాలు ఓటమి చెంది 288 నుంచి 272కు బాజపా బలం పడిపోయింది. దీనికి కారణం మోడీ పరిపాలనలో పేద ప్రజలు తీవ్రమైన ఆశాభంగం చెందడమే. 

2014 సాధారణ ఎన్నికల తర్వాత 13 బీజేపీ సిట్టింగ్‌ స్ధానాలు సహా 27 లోక్‌ సభ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో తిరిగి 5 సొంత స్ధానాలను మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. మిగిలిన 8 సీట్లను కోల్పోయింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు వారి ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పిం చారు. దీంతో లోక్‌సభలో బీజేపీ బలం 272కు పరిమితమైంది. 

లోక్‌సభలో నానాటికి బలం తగ్గుతున్నా మోడీలో గాని అమిత్‌షాలో గాని ఎటువంటి మార్పు రాకపోవడం ఆశ్చర్యకరం. బీజేపీ పతనంలో ఉత్తప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆధిత్యనాద్‌ ప్రభావం ఎంతో వుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ నిర్లక్ష్యం చేసిన ముస్లిం అభ్యర్ధి తబుస్సుం 44,618 ఓట్లతో విజయం సాధించింది. హిందూ భావజాలంతో నడిచే బీజేపీ ఒక్క ముస్లిం కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన దానికి ప్రతిఫలం. 

భారతదేశ సంస్కృతీ నిర్మాణం అనే కాక దేశ స్వాతంత్రంలో కూడా తమదైన పాత్రను నిర్వహించిన, ముస్లింలను, దళితుల్ని నిర్లక్ష్యం చేయ డం వల్ల బీజేపీకి ఈ గతి పట్టిందని స్పష్టమౌతుంది. అసలు మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది. దళితులు, ముస్లింలపై అత్యాచారాలు పెరగడం వల్ల ఈ పరిస్ధితి వచ్చింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాలలో దళితులపై దాడులు పెరగడమే కాకుండా, కోర్టులలో శిక్షలు పడడం కూడా పూర్తిగా తగ్గిపోయింది. 

దేశానికి ఆదర్శ వంతమైన పాలన గుజరాత్‌లో అందించానని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ, ఆ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా, అత్యధికంగా జనాభా నిష్పత్తి మీద దాదాపు నూటికి డెబ్పై మూడు శాతం అధికంగా దాడులు జరుగుతున్నాయి. కానీ అదే సమయంలో శిక్షలు పడే రేటు జాతీయ సగటు కన్నా ఆరు రెట్లు తక్కువగా ఉన్నది. ఉదాహరణకు 2014లో జాతీయ స్ధాయిలో 28 శాతం కేసుల్లో శిక్షలు పడగా, గుజరాత్‌లో 3.4 శాతం మాత్రమే శిక్షలు పడ్డాయి. వాస్తవానికి ఈ కేసు జరుగు తున్నప్పుడు కూడా అటు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వం రెండూ కూడా బాధితుల పక్షం నిలబడకపోగా నిందితునికి సహకరించే విధంగా సుప్రీంకోర్టులో వ్యవహరించింది. 

దేశవ్యాప్తంగా పెరిగిన దళిత ఉద్యమ శక్తులకు తలొగ్గి రివ్యూ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వేసింది. భారత రాజ్యాంగంలోని 17వ ఆర్టికల్‌ ప్రకారం అంటరానితనాన్ని నిషేధించింది. దళితులు ఎటువంటి వేధింపులకు గురికాకుండా చూడాలని సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులను కాపాడా లని చెప్పింది. కనుకనే 1955లో అంటరానితనం నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కాని ఈ చట్టంలో అనేక లొసుగులు ఉండడం వల్ల దోషులు సులభంగా తప్పించు కుంటున్నారని, దళితులకు సరైన న్యాయం జరగడం లేదని 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉండడంతో ఎస్‌.సి, ఎస్‌.టి. అత్యాచారాల నిరోధక చట్టంను 1989లో రూపొందించి దాని విధి విధానాలను 1995లో రూపొందించారు. అయినా ఎస్‌.సి. ఎస్‌.టి.లపై దాడులకు పాల్పడుతున్న అగ్రకుల పెత్తందార్లు చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని, రాజకీయ పలుకుబడితో సులభంగా శిక్షల నుంచి తప్పించు కుంటున్నారు. 

భారత రాజ్యాంగానికి ఎన్ని తూట్లు పొడవాలో అన్ని తూట్లు మోడీ ప్రభుత్వం పొడిచింది. మరోప్రక్క దేశంలో ప్రాథమిక విద్య కుదేలైపోతోంది. దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో 44,514 పాఠశాలల్లో వున్న 15 లక్షల మంది ప్రాథమిక పాఠశాల విద్యార్ధులను పరిశీలిస్తే ఒక వాక్యం రాయలేని చెప్పలేని స్థితిలో వాళ్ళు వున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లేక పిల్లలు రక్తలేమి, పౌష్టికాహార లోపంతో అటు చదువుకి, ఇటు భౌతిక శక్తికి పనికిరాకుండా పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల్లో 20% మంది ఒప్పంద సిబ్బంది కాగా 40% మంది శిక్షణలేని వారు, నైపుణ్యత లేనివారు అవ్వడం గమనించాల్సిన విషయం. మరొక పక్క ప్రభుత్వ పాఠశాలలకు ఆడపిల్లల్ని మాత్రమే పంపి మగ పిల్లలను కార్పోరేట్‌లో చదివించడం హిందూ అగ్రవర్ణాల్లో పెరిగింది. ఆడపిల్లలకు చదువెందుకు అన్నది మోడీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరింత పెరిగింది. 

ప్రజలను జి.యస్‌.టి. ద్వారా అంతర్గత దోపిడీకి భారత ప్రభుత్వం ఒడిగట్టింది. కేంద్రానికి పరోక్ష పన్ను ద్వారా ఆదాయంలో 40% పెట్రోలియం రంగం నుండి లభిస్తుంది. పెట్రోలియం రంగం నుండి లభించిన పన్ను 3,91,486. కోట్లు అందులో నుంచి ప్రజలకు ఇచ్చిన సబ్సీడీ 26.008. అదే సమయంలో పెట్రోలియం శాఖ క్రింద వున్న కంపెనీలు పన్నుల తరువాత 1,26,294 కోట్లు లాభాలు గడించాయి. ప్రజల్ని అంతర్గతంగా దోచుకోవడానికి ప్రభుత్వం అనేకమైన కుట్రలు పన్నుతావుంది. 

భారత స్ధూల దేశీయోత్పత్తి (జీడిపీ) 2017లో సుమారు రెండు లక్షల 65 వేల డాలర్లుగా ఉంది. భారత్‌ మొత్తం జీడీపీ ప్రపంచంలో పది తొలి అతి పెద్ద కంపెనీలైన యాపిల్‌, అల్పాబైట్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, బెర్క్‌పైర్‌, ఫేస్‌బుక్‌, లస్సాన్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, జేపీ మోర్గాన్‌, టెన్‌సెంట్‌ వంటి సంస్ధల మార్కెట్‌ విలువకు సమానం. కంపెనీల విషయం పరిశీలిస్తే ఈ ఏడాది మార్చి 22 నాటికి బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో నమోదైన మొదటి వంద కంపెనీల మార్కెట్‌ విలువ రూ.140.88 లక్షల కోట్లు అంటే వాటి విలువ ఇంచుమించు స్ధూల దేశీయోత్పత్తికి సమానం. రిలయన్స్‌ (రూ.5.74 లక్షల కోట్లు), టీసీఎస్‌ (రూ.5.42 లక్షల కోట్లు) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ4.48 లక్షల కోట్లు) ఐటీసీ (రూ.3.15 లక్షల కోట్లు) హెడీడిఎఫ్‌సి లిమిటెడ్‌ (రూ.3.03 లక్షల కోట్లు), హిందుస్ధాన్‌ లివర్‌ (రూ.2.84 లక్షల కోట్లు), మారుతి సుజికి (రూ.2.63 లక్షల కోట్లు) ఇన్సోసిస్‌ (రూ.2.53 లక్షల కోట్లు) ఓఎన్‌జీసీ (రూ.2.29 లక్షల కోట్లు) వంటి సంస్ధల మార్కెట్‌ విలువ విడివిడిగా చూస్తే ఒక్కొక్కటి జీడిపీలో 5-10 శాతం వరకు ఉంటాయని ఆర్ధిక పరిశోధకులు అందించిన ఈ రిపోర్టును బట్టి కార్పోరేట్‌ వ్యవస్ధను భారతదేశ ఆర్ధిక వ్యవస్ద కంటే మోడీ బలోపేతం చేస్తున్నారు.

నరేంద్రమోడీ కార్పోరేట్లు రూపొందించిన ఒక విధ్వంసక అమానవీయ అప్రజాస్వామ్య, వ్యవస్ధకలిగిన ఒక శక్తిగా ముందుకు వెళ్తున్నాడు 

ప్రపంచంలో నియంతలు ఎందరో వారి అప్రజాస్వామిక విధానాల వల్ల అనతికాలంలో ఓటమికి గుర య్యారు. మోడీ ఇప్పటికే ప్రజాస్వామిక, లౌకిక, దళిత. మైనార్టీల స్త్రీల హృదయాల నుండి వైదొలిగాడు. ఇక జరగవలసింది రాజకీయ కార్యాచరణే!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here