శివాజీతో మొదలు – పవన్‌తో కదులు – మనస్సాక్షి – 1004

0
144

బారెడు పొద్దెక్కింది. వెంకటేశం జాడ మాత్రం లేదు. దాంతో గిరీశం యింటరుగు మీద అసహనంగా అటూ యిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. నోట్లో ఎప్పటిలాగే చుట్ట గుప్పుగుప్పుమంటోంది. దాదాపు అరడజను చుట్టలు ఆవిరయిపోయాక అప్పుడు వెంకటేశం ఆదరాబాదరా వచ్చాడు. దాంతో వెంకటేశం ”ఏవివాయ్‌ వెంకటేశం… నీదంతా మీ తాత వెంకటేశం గారి తంతేననుకో. ఆయనదీ ఆరంభశూరత్వం అంటారు. మన పరీక్షలు మొదలెట్టాక ఈ మూడువారాలూ ఎంత ఠంచనుగా వచ్చేవని… ఈవేళ ఏవయిం దంట?” అన్నాడు. దాంతో వెంకటేశం కూడా అంతే పదునుగా ”ఆ…నేను టైంకే బయలు దేరా. మధ్యలో మీ గురించే ఈ లేటంతా” అన్నాడు. దాంతో గిరీశం ”యిదిగో… ఆ చెప్పేదేదో సూటిగా చెప్పు. రాంగోపాల్‌వర్మలా గందరగోళంగా మాట్లాడకు” అన్నాడు. దాంతో వెంకటేశం ”అదే గురూగారూ… వినాయక చవితి ఉత్సవాలకి మన పేట కుర్రాళ్ళు అదేదో రికార్డింగ్‌ డేన్సేదో ఏర్పాటు చేస్తానన్నారు కదా. నేను మొదట వద్దని చెబితే నామీదే గయ్యిమన్నారు. అదేదో వొద్దని మీరెళ్ళి చెప్పేశారా… అప్పుడేమో మీ మాట తియ్యలేక వాళ్ళు సరేనన్నారా… తీరా యిప్పుడు ఆ ప్రోగ్రాం పెట్టే పనుల్లో పడ్డారు. అందుకే నేవెళ్ళి ‘అదేం కుదరదు… మా గురువుగారు ఒద్దన్నారు కదా’ అని చెప్పా. అయినా వాళ్ళేం వినలేదు. ‘ఎవరు చెప్పినా వినేదేంలేదు. రికార్డింగ్‌ డేన్సేదో ఏర్పాటు చేసి తీరతాం’ అని తెగేసి చెప్పేశారు. నాకు బొత్తిగా వెయిట్‌ ఇవ్వలేదు… మీకు ఇచ్చి తీసేశారు. దాంతో వాళ్ళతో గొడవ పడ్డా. అందుకే లేటు” అన్నాడు. ఆశ్చర్యం… అది వినగానే గిరీశానికి కోపం రాలేదు. పైగా నవ్వాడు కూడా. దాంతో వెంకటేశం అర్థం కానట్టు” దీనర్థం ఏంటంటారు గురూగారూ” అన్నాడు. ఈలోగా గిరీశం ఓ కుర్చీలో సెటిలై ”మరేం లేదోయ్‌… ఈరోజు నిన్ను అడగబోయే ప్రశ్నకి దారి దొరికినట్టనిపించింది. సరే… ఆ ప్రశ్నేదో లాగిస్తా” అంటూ అడగడం మొదలెట్టాడు. ”మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎందరో పోరాటం సాగిస్తున్నారు. శివాజీ, చలసాని శ్రీనివాస్‌ లాంటి వాళ్ళయితే సంవత్సరంన్నర క్రితమే తమ గళం విప్పారు. యిన్నాళ్ళకి యిప్పుడు పవన్‌కళ్యాణ్‌ యిదే అంశం గురించి తన పోరాటం మొదలెట్టాడు. అయితే సినీనటులు ఇద్దరి పోరాటం విషయంలో ప్రభుత్వం ప్రతిస్పందనే విభిన్నంగా ఉంది. ఎందుకలా? కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించడం మొదలెట్టాడు. ‘యిందాక తను చెప్పిన రికార్డింగ్‌ డేన్స్‌ వ్యవహారమేదో దీనికి సంబంధించి సమాధానానికి ససాయం చేయొచ్చు’ అనిపించింది. దాంతో ఆ కోణంలో ఆలో చించడం మొదలెట్టాడు. సరిగ్గా అప్పుడు వెంకటేశానికి తట్టిందది. దాంతో వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”ప్రత్యేక హోదా గురించి శివాజీ ఎప్పుడో పోరాటం మొదలెట్టడం జరిగింది. అయితే శివాజీకి బయట పబ్లిక్‌లో పవన్‌కళ్యాణ్‌ అంత క్రేజ్‌ లేదు. అలాగే తనున్న బీజేపీలోనూ అంత పట్టులేదు. దాంతో శివాజీ గొంతేదో ఆదిలోనే సొంత పార్టీ వాళ్ళతో వాళ్ళచే నొక్కెయ్యబడింది. అయితే ఆలస్యంగా నైనా యిటీవలే పవన్‌కళ్యాణ్‌ స్పందించడం, పబ్లిక్‌లోకొచ్చి గళం విప్పడం జరిగింది. ముందుగా తిరుపతి సభలో కేంద్రంలోని కమల నాధుల మీద విరుచుకుపడ్డాడు. అయితే పవన్‌కళ్యాణ్‌ పబ్లిక్‌లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా, యింకా పార్టీ భవిష్యత్తుకి పవన్‌తో పనున్న దృష్ట్యా పార్టీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే అదే పవన్‌ మళ్ళీ కాకినాడ సభలో యింకా పెద్ద ఎత్తులో తన గళం విప్పి నిప్పులు చెరిగేసరికి అప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా ధీటుగా స్పందించి, విమర్శల్ని తిప్పికొట్టడం జరిగింది. మరి యిదే పని పవన్‌కళ్యాణ్‌ మొదటిగా గళం విప్పినప్పుడే ఎందుకు చేయలేదు? లేకపోతే యింకో మీటింగ్‌ దాకా ఎందుకాగలేదూ అనే దానికి సమాధానం ఉంది. బీజెపీ లాస్ట్‌ స్ట్రా అనబడే ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిం చెయ్యడమే. అది… పవన్‌కళ్యాణ్‌ కాకినాడలో మీటింగ్‌ పెట్టడానికి ముందే రాష్ట్రానికి రెండు లక్షల పాతికవేల లెక్కలతో ప్యాకేజీ ప్రకటించెయ్యడం. యిక అంతకంటే ఎక్కువగా చేసే ఆసక్తీ, పరిస్థితీ అక్కడలేదు. అందుకే పవన్‌ ఉధృతిని తగ్గించడానికే కాకినాడ మీటింగ్‌కి ముందు ఈ ప్యాకేజీని ప్రక టించడం జరిగింది. అయితే అదేం పవన్‌ ఉధృతిని ఆపలేకపోయింది. యింకా పెద్ద స్థాయిలో నిప్పులు చెరి గాడు. దాంతో కేంద్రానికి యింకో దారి లేకపోయింది… పవన్‌ మీద ఎదురు దాడికి దిగడం తప్ప. యిప్పుడు గానీ పవన్‌ స్టేట్స్‌మెంట్స్‌ని ఖండించి ఎదురు దాడికి దిగకపోతే అదేదో తప్పకుండా పబ్లిక్‌లోకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. అందుకే పవన్‌కళ్యాణ్‌ మీద ప్రత్యక్ష విమర్శలకి దిగింది. ఏతా వాతా చెప్పేదేంటంటే… శంఖంలో పోసిన నీరు తీర్థమయి నట్టుగా ఏవన్నా స్టేట్‌మెంట్లన్నా, చేతలన్నా అవి చేసే వ్యక్తుల ఆధారంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అందుకే లక్ష్యం ఒక్కటే అయినా శివాజీకి లేని ప్రాధాన్యత విపరీతమైన క్రేజ్‌ ఉన్న పవన్‌కళ్యాణ్‌కి వచ్చింది. అందుకే కమలనాధులు అంతిదిగా ఆచితూచి అడుగులేసింది” అంటూ వివరించాడు. అంతవరకూ విన్న గిరీశం ”ఆ…బాగా చెప్పావోయ్‌… ఫుల్‌ మార్కు లేసేస్తున్నా” అన్నాడు. ఈలోగా వెంకటేశం పైకి లేస్తూ ‘ఆ…వెయ్యక చస్తారేంటీ… అయినా ఈ కష్టమేదో సివిల్స్‌ రాయడంలో పడుంటే ఈపాటికి కలెక్టరయిపోదును’ అని గొణుక్కుంటూ బయటికి నడిచాడు. ఆ గొణుగుడేదో అటూయిటూగా బయటికి కూడా వినిపించింది. దాంతో గిరీశం గుంభనంగా నవ్వుకున్నాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి