సర్కారీ స్కూళ్ళు రేపటి నుంచి

0
19

ఈ ఏడాది పెరిగిన పాఠశాలల పనిదినాలు

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు రేపటి నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్‌ విద్యా సంస్ధలు ఇప్పటికే ప్రారంభం కాగా సర్కారీ బడులు రేపటి నుంచి తిరిగి తెరుచుకుంటున్నాయి. సాధారణంగా రోహిణి కార్తె పూర్తయ్యాక పాఠశాలలు ప్రారంభం కావడం సహజం కాగా ప్రతి ఏడాది ఇప్పటికీ ఎండలు ఠారెత్తిస్తుండేవి. అయితే ఈ ఏడాది వాతావరణం కాస్త చల్లబడటంతో అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతవరకు ఆటపాటలతో, ఊళ్ళకు వెళ్ళి సరదాగా సెలవులు గడిపేసినవారు తిరిగి రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్చి వారిని ముస్తాబు చేసి క్యారేజీ ఇచ్చి పుస్తకాలు కొనుగోలు చేసి ఫీజులు కట్టి చదివించడం పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు కత్తి మీద సాము కాగా ఇంతవరకు సరదాగా గడిపేసిన పిల్లలు మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కాగా ఈ ఏడాదిలో అన్ని పాఠశాలలు విధిగా 226 పనిదినాలు పనిచేయాలని విద్యా శాఖ అధికారులు ముసాయిదా క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు పాఠశాలల పనిదినాలు 220 మాత్రమే ఉండగా ఆ సంఖ్యను 226కు పెంచారు. ఈ ఏడాది పాఠశాలలకు అక్టోబర్‌ 9 నుంచి 20 వరకు దసరాల సెలవులు, డిసెంబర్‌ 23 నుంచి 30 వరకు క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. అలాగే 2019 జనవరి 8 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు. తిరిగి 2019 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here