ముందు మీ కేసులపై శ్వేతపత్రం ప్రకటించండి

0
19

చంద్రబాబును విమర్శించే అర్హత మీకు లేదు

జగన్‌పై శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణు డిమాండ్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 12 : ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌ ముందుగా తనపై ఉన్న అవినీతి కేసుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు డిమాండ్‌ చేశారు. అధికారమే పరమావధిగా పాదయాత్ర చేస్తూ నిత్యం సీఎం చంద్రబాబుని, టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైఎస్‌ జగన్‌ ముందుగా ఆయనపై గల అవినీతి కేసులు, చార్జిషీట్లు, కోర్టులకు ఎప్పుడెప్పుడు ఎక్కడ హాజరవుతున్నది శ్వేతపత్రం ప్రకటిస్తే మంచిదని డిమాండ్‌ చేసారు. పాదయాత్ర తూర్పు గోదావరిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ముందుగానీ, జిల్లా నుంచి వెళ్లలోగా గానీ శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, అన్నవరం దేవస్థానం డైరెక్టర్‌ రొబ్బి విజయశేఖర్‌, కార్పొరేటర్లు మాటూరి రంగారావు, గాదిరెడ్డి పెదబాబు, కోరుమిల్లి విజయశేఖర్‌, బెజవాడ రాజ్‌ కుమార్‌, అలాగే శెట్టి జగదీశ్‌, తవ్వా రాజా, కుడుపూడి సత్తిబాబు, ఎం లక్ష్మణ్‌ తదితరులతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ కేసులు,వేలకోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌కి చంద్రబాబుని విమర్శించే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముందుగా ఆయన శ్వేతపత్రం ప్రకటించి,ఆ తర్వాత మాట్లాడితే మంచిదన్నారు. ఇక డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి అప్పట్లో పాదయాత్ర సందర్బంగా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినపుడు చేసిన హామీలు ఎన్ని, అందులో ఎన్ని నెరవేర్చారో జగన్‌ చెప్పాలన్నారు. ఎందుకంటే నిత్యం తన తండ్రి డాక్టర్‌ వైఎస్‌ ని తలుస్తూ ప్రకటనలు చేస్తున్నందున ఈ విషయం తేల్చాలన్నారు. అలాగే డాక్టర్‌ వైఎస్‌ మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన,బొత్స వంటి వాళ్ళు,అలాగే కాంగ్రెస్‌ లో చివరి వరకూ అధికారం అనుభవించి,రాష్ట్ర విభజనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని తిరుగుతున్న జగన్‌కి ప్రత్యేక హోదా పై చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోందని యర్రా వేణు పేర్కొన్నారు. ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని, లేదా జగన్‌ తన అనుచరుల్లో ఎవరినైనా తనతో చర్చకు పంపాలని ఆయన డిమాండ్‌ చేసారు.

రాష్ట్ర క్రీడా దినోత్సవం కోసం ఏర్పాట్లు

జాతీయ క్రీడా దినోత్సవం మాదిరిగా రాష్ట్ర క్రీడా దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు యర్రా వేణు చెప్పారు. అలాగే సీఎం కప్‌ పేరిట జిల్లా స్థాయిల్లో, రాష్ట్రస్థాయిలో పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ స్టేడియంను రెండు కోట్ల రూపాయలతో ఆధునీకీరించనున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఏకేసి కాలేజీ దగ్గర స్విమ్మింగ్‌ పూల్‌, ఆర్ట్స్‌ కాలేజీలో 400 మీటర్ల ట్రాక్‌ పూర్తిచేయడానికి రంగం సిద్ధం అయిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here