జల వారధి…జన సారథి

0
20

తూర్పున ప్రారంభమైన జగన్‌ ప్రజా సంకల్పయాత్ర

కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ప్రతిపక్షనేతకు అశేష అభిమానశ్రేణి ఘన స్వాగతం

నగరమంతా సందడే సందడి…రూరల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం

రాజమహేంద్రవరం, జూన్‌ 12 : చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ తాను అధికారంలోకి వస్తే వివిధ వర్గాల వారికి అమలు చేసే ‘నవరత్నాల’ను వివరిస్తూ గత 186 రోజులుగా ప్రజా సంకల్పయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ఈ సాయంత్రం నగర ప్రవేశం చేయడం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. 2003లో చంద్రబాబు అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా పథం నిర్వహించిన మాదిరిగా ఆయన బాటలోనే నేడు తనయుడు జగన్‌ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంతవరకు నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,306.6 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన జగన్‌ ఈరోజు రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. జగన్‌ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు జయ జయ ధ్వనాలు, హర్షధ్వనాల మధ్య రోడ్డు కం బ్రిడ్జిపై ఎదురేగి జగన్‌కు ఘన స్వాగతం పలికారు. బ్రిడ్జి బలహీనంగా ఉన్నందున ఒకేసారి భారీ జనసమూహం వంతెనపై ఉండటం శ్రేయస్కరం కాదనే కారణంతో పోలీసులు పాదయాత్ర వెంట తరలివచ్చే అభిమానశ్రేణుల సంఖ్యపై ఆంక్షలు విధించినా వారు అవేమీ లెక్క చేయకుండా జగన్‌ వెంట అడుగులు వేశారు. 2003 మేలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన దృశ్యం చరిత్ర పుటల్లో చారిత్రక ఘట్టంగా నిలచిపోయినట్లుగా నేడు జగన్‌ పాదయాత్రను కూడా నిక్షిప్తం చేయాలన్న పార్టీ శ్రేణుల సంకల్పాన్ని పోలీసుల ఆంక్షలు నిలువరించలేకపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా నిలిచిఉన్న అశేష జనవాహిణి, శ్రేణులకు అభివాదం చేస్తూ గోదావరి నదీమ తల్లికి ప్రణామాలు సమర్పిస్తూ ముందుకు సాగారు. జగన్‌కు స్వాగతం పలుకుతూ బ్రిడ్జిపై కటౌట్లు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. గత సాయంత్రం భారీ ఈదురుగాలులు వీయడంతో బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన కటౌట్లు, ప్లెక్సీలు దెబ్బతినడంతో వాటి స్థానే పార్టీ నేతలు తెల్లారేసరికి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. కాగా డప్పు వాయిద్యాలతో, బాణాసంచ కాల్పులతో పార్టీ శ్రేణులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. కాగా జగన్‌కు స్వాగతం పలుకుతూ బ్రిడ్జి ముఖ ద్వారం కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టడంతో పాటు అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా కనిపించింది. జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలకు గాను జగన్‌ పాదయాత్ర 16 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. జగన్‌ కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో ప్రసంగించాక తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుడుతారు. జగన్‌ యాత్ర తొలుత రూరల్‌ నియోజకవర్గంలో కొనసాగనుంది. కాగా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు ఇప్పటికే నగరానికి చేరుకోగా జిల్లా నేతలతో పాటు సిటీ, రూరల్‌ నియోజకవర్గం నేతలు జక్కంపూడి విజయలక్ష్మీ, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్‌, జక్కంపూడి రాజా, మేడపాటి షర్మిళారెడ్డి, జక్కంపూడి గణేష్‌, గిరిజాల బాబు తదితరులు జగన్‌ పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా జగన్‌ రాక సందర్భంగా నగరమంతా పార్టీ నేతలు ఫ్లెక్సీలు, పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అంతే గాక ఉదయం నుంచే ఆటోల్లో మైకులు ఏర్పాటు చేసి జగన్‌ రాక గురించి విస్తృత ప్రచారం చేశారు. అంతే గాక యువకులు బైక్‌లపై నగరమంతా కలియదిరిగి జై జగన్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. కాగా జగన్‌ రాక సందర్భంగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ నుంచి బయలుదేరే బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అంతే గాక రైల్వే స్టేషన్‌కు వెళ్ళే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడగా చాలా మంది గోదావరి గట్టు మీదుగా ప్రత్యామ్నయ మార్గంలో స్టేషన్‌కు చేరుకున్నారు. ఇలా ఉండగా జగన్‌ పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించారు. నగరంలో నిన్న ఈ సమయానికి ఉరుములు, మెరుపులు, గాలివానతో వాతావరణం ప్రతికూలంగా ఉండగా ఈరోజు ఆకాశం నిర్మలంగా ఉండి ప్రశాంతంగా, చల్లగా ఉండటంతో వైకాపా నేతలు ఆనందడోలికల్లో మునిగారు. ఇది తమకు శుభ సూచకమని ఓ నేత వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here