చరిత్ర పుటల్లోకి జగన్‌ పాదయాత్ర

0
25

ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంపై రౌతు కృతజ్ఞతలు

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా లక్షలాదిమంది కార్యకర్తలు రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి వద్ద అధినేతను ఆప్యాయతగా స్వాగతించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని ఆ పార్టీ సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానులు భారీగా తరలి రావడంతో గోదావరి జన గోదారిగా మారిందని, మునుపెన్నడూ లేని విధంగా పెక్కు స్థాయిలో అభిమానులు తమ అనురాగాన్ని, ఆనందాన్ని జగన్‌తో పంచుకున్నారని తెలిపారు. లక్షలాదిమందితో వై.ఎస్‌.జగన్‌ రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిపై నడిచి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం కలిగిందని, అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి నిన్న జరిగిన పాదయాత్ర నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇరు జిల్లాల నాయకులు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, యువ నాయకులు, మహిళలు ఐక్యంగా కృషిచేయడంతో చరిత్రలో నిలిచిపోయేలా యాత్ర జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ, రైల్వేశాఖ, ఆర్టీసీ, నగరపాలక సంస్థ అధికారులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ఎంతగానో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్సార్‌, జగన్‌ అభిమానులకు రౌతు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here