దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా బుద్ధి చెప్పండి

0
26

ఆయన ప్రతి’కక్ష’ నేత … మర్యాద లేదు…అవగాహన లేదు

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన తెదేపా శ్రేణులు

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : పెద్దలంటే మర్యాద లేకుండా, ప్రాజెక్టులపై అవగాహన లేకుండా లంచాల్లో పుట్టి లంచాల్లో పెరిగి లంచాల్లో జీవిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి రానున్న రోజుల్లో మరోసారి ఓటు అనే ఆయుధంతో దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత కాదని, ప్రతి ‘కక్ష’ నేత అని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న జగన్‌ పాదయాత్ర ద్వారా కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతం అపవిత్రమైందంటూ గన్ని కృష్ణ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుభ్రం చేశారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాలతో అభిషేకించి పుష్పాంజలి ఘటించారు. ఆ ప్రాంతమంతా సాంబ్రాణి పొగ వేశారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ అమరావతి, పోలవరం నిర్మాణం సినిమాలుగా పోల్చిన జగన్‌ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపరిచేందుకు సీఎం చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలంటూ ప్రధాని మోడీని అడిగే దమ్ము ధైర్యం జగన్‌కు లేదని, అలా అడిగితే మళ్ళీ జైలు గోడల మధ్యే ఉండాల్సి వస్తుందన్న భయం ఆయనలో ఉందన్నారు. 11 అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళుతున్నాడని, అటువంటి వ్యక్తి చారిత్రక రాజమహేంద్రవరంలో కోటిపల్లి బస్టాండ్‌లోని తెలుగుజాతి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్‌ విగ్రహం సాక్షిగా చంద్రబాబుపై నిందలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని ఒక పునాదిగా పోల్చిన జగన్‌ అవివేకం బయటపడిందన్నారు. అవినీతి సొమ్ముతో ప్యాలెస్‌లు కట్టుకునే వ్యక్తికి డయా ఫ్రమ్‌ వాల్‌ కోసం ఏమి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో అతి ప్రాముఖ్యమైన కట్టడం డయా ఫ్రమ్‌ వాల్‌ అని, దీని కోసం 14 నెలలుగా 500 మంది ఇంజనీర్లు, 2,500 మంది వర్కర్లు కష్టపడి 1400 మీటర్ల పొడవు, ఐదు అడుగుల వెడల్పుతో 300 అడుగుల లోతు నుంచి నిర్మిస్తే అవగాహన లేని జగన్‌ నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే అర్థం లేని ఆరోపణలు సరికావన్నారు. వై.ఎస్‌. హయాంలోనే పోలవరం పనులు పూర్తయ్యాయని చెప్పడం అవాస్తవమని, ఆయన హయాంలో కేవలం కాలువ పనులే కొంతమేర జరిగాయన్నారు. వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గుత్తందారులను పెంచి పోషించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 16 జాతీయ ప్రాజెక్టులు ఉండగా కేవలం పోలవరం ప్రాజెక్ట్‌ మాత్రమే ముందుకు వెళుతోందని, అపర భగీరధుడిలా సీఎం చంద్రబాబు చేస్తున్న కృషే దానికి కారణమన్నారు. ఎంతసేపూ సీఎం అయిపోవాలన్న యావ తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఆలోచన చేయాలన్న సంకల్పం జగన్‌కు లేకపోవడం విచారకరమన్నారు. రాజధాని నిర్మాణం నెలల్లో అయిపోయేది కాదని, కొన్ని సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33వేల ఎకరాల స్థలాన్ని రైతులు స్వచ్చందంగా ఇచ్చారని సీఎం చంద్రబాబుపై వారికున్న నమ్మకమే అందుకు కారణమన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని, అయినా చంద్రబాబుపై వారికున్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదన్నారు. పెద్దలంటే గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుపై జగన్‌ మాట్లాడే తీరు జుగుప్సాకరంగా ఉంటుందని, ఇటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఇకనైనా జగన్మోహనరెడ్డి తన ప్రవర్తనను, మాటతీరును, ఆలోచనా విధానాన్ని మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో కేవలం కుడి, ఎడమ కాలువల నిర్మాణాన్ని చేపట్టారని, ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన అనుమతులను తీసుకురాలేకపోయారన్నారు. జలయజ్ఞం పేరిట వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ మాట్లాడుతూ జగన్‌పై జనానికి విశ్వాసం లేకపోవడంతో సొమ్ములిచ్చి జనాల్ని రప్పించుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బూర దుర్గాంజనేయరావు, కోసూరి చండీప్రియ, యిన్నమూరి రాంబాబు, పాలిక శ్రీను, కడలి రామకృష్ణ, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, బెజవాడ రాజ్‌కుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు, పల్లి సాయి, బుడ్డిగ రాధ, శెట్టి జగదీష్‌, ఉప్పులూరి జానకిరామయ్య, పితాని కుటుంబరావు, తంగేటి సాయి, బిక్కిన సాంబ, మళ్ళ వెంకట్రాజు, రొబ్బి విజయశేఖర్‌, శీలం గోవింద్‌, తలారి భాస్కర్‌, అరిగెల బాబు, ఆశపు సత్యనారాయణ, తేతలి రాము, విశ్వనాథరాజు, బిక్కిన రవికిషోర్‌, కంటిపూడి శ్రీనివాస్‌, రొంపిచర్ల ఆంథోని, కంచిపాటి గోవింద్‌, జాలా మదన్‌, కర్రి కాశీ విశ్వనాథం, వానపల్లి శ్రీనివాసరావు, కాకర్ల ప్రసాద్‌, రాయి అప్పన్న, బెజవాడ వెంకటస్వామి, నల్లం ఆనంద్‌కుమార్‌, మాకాని లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here