ఆశీర్వదించండి.. జనరంజక పాలన రుచిచూడండి

0
32

నాలుగేళ్ళగా అందమైన అబద్ధాల కలల సినిమాలు చూపిస్తున్న చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పకుంటే రాష్ట్రం అథోగతి పాలవుతుంది

తూర్పు పాదయాత్ర ప్రారంభంలో ప్రతిపక్ష నేత జగన్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 12 : గత నాలుగేళ్ళగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సమర్ధవంతంగా రెండు అబద్ధ సినిమాలు చూపిస్తూ ప్రజలను ఇంకా ఇంకా మోసగించడానికి ప్రయత్నిస్తూన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు – ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. మొదటి సినిమా అమరావతి అయితే, రెండవ సినిమా పోలవరం ప్రాజెక్ట్‌ అని, కబుర్లకు,ప్రకటనలకే గాని ఈ రెండు సినిమాలు ఎప్పటికీ పూర్తి కావని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రగా గత సాయంత్రం రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దాదాపు గంటన్నర సాగించిన ప్రసంగంలో జగన్‌ తనదైన శైలితో ప్రజల నుంచి సానుకూల స్పందన కలిగించేందుకు ప్రయత్నించారు.రాజధాని అమరావతి నిర్మాణానికి వస్తే మూడు లేదా ఆరునెలలకు ఒకసారి ప్రజలకు గ్రాఫిక్స్‌ చూపిస్తూ, సింగపూర్‌ – జపాన్‌ కథలు వినిపిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు అమరావతిలో ఏ శాశ్వత కట్టడానికీ ఒక్క ఇటుక కూడా పడలేదన్నారు. అయితే అక్కడ ఏదో జరిగిపోతోందన్న భ్రాంతి కల్పించడంలో మాత్రం విజయవంతంగా ముందుకు సాగుతున్నారన్నారు. దివంగత నేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పరుగులు తీసిన పోలవరం ప్రాజెక్ట్‌ చంద్రబాబు పాలనలో నత్తనడకన సాగుతోందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయిందంటూ మరోసారి శంకుస్థాపన హడావిడి చేయడం ఎంతో చోద్యంగా ఉందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ అంటే పునాది గోడ అని, అదేదో కట్టి జాతికి అంకితం చేశామనడం మభ్యపెట్టడమేనన్నారు. 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరగాల్సి ఉండగా ఇంతవరకు ఆరేడు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు కూడా జరగలేదన్నారు. మొత్తం ప్రాజెక్ట్‌లో 55 శాతం పనులు జరిగిపోయాయని చంద్రబాబు చెబుతున్న దాంట్లో 70 శాతం వరకు కుడి – ఎడమ కాలువల పనులే ఉన్నాయని, ఆ పనుల్లో సైతం 90 శాతం వరకు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. ఇల్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసిన చందంగా పోలవరం విషయంలో హడావిడులు చేస్తున్నారే తప్ప ప్రగతి అంతంత మాత్రమేనన్నారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు పిహెచ్‌డి తీసుకున్నారని జగన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చైనాలో ఉన్న ఒక బ్రిడ్జి కంటే పోలవరం ప్రాజెక్ట్‌ గొప్పదంటున్న ఆయన పోలవరం తన కలగా చెప్పుకోవడాన్ని ఖండించారు.1995 నుంచి 2004 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదరు ప్రాజెక్ట్‌ను ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన కడియం ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు అప్పట్లో పోలవరం గురించి ఆయనను అడగని రోజు లేదని, ప్రాజెక్ట్‌ కోసం ఢిల్లీకి మూడువేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర కూడా చేశారని గుర్తు చేస్తూ మరెందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సవరించిన అంచనా ప్రకారం రూ.58వేల కోట్లు ఖర్చవుతుందని, ఇంతవరకు రూ.13,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసి – రూ.45వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పనులను 2019కి పూర్తిచేస్తామంటూ దర్జాగా ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలా వ్యవహరించడానికి నువ్వు అసలు మనిషివేనా? అని జగన్‌ తీవ్రంగా ప్రశ్నించారు.

దేవుడు సొమ్ముల్లోనూ వాటాలేనా!

దేవుడంటే భయం, భక్తి లేవని – ఆ సొమ్ము తింటే పాపమన్న స్పృహ కూడా చంద్రబాబుకు ఉన్నట్లు లేదని జగన్‌ వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాల పేరుతో రూ.2వేల కోట్లు ఖర్చు చూపించి – రోడ్లు, వీధి దీపాలు, ఘాట్‌లు పనులకు నామినేషన్‌ పద్ధతిలో వందిమాగదులకు పనులు అప్పగించి లూటీ చేశారని ఆరోపించారు. భక్తితో, త్రికరణశుద్ధితో చేయాల్సిన పనుల్లో కూడా ఇలా ప్రవర్తించిన ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడా? అని జగన్‌ ప్రశ్నించారు. సినిమా షూటింగ్‌కు పురమాయించి, హీరోగా కనపడేందుకు ప్రయత్నించడంలో తొక్కిసలాటకు కారణమై 29 మంది పుష్కర యాత్రికులను బలి తీసుకున్న చంద్రబాబు అనే విలన్‌ ఉండటానికి ఎవరైనా సమ్మతిస్తారా? అని ప్రశ్నించారు. ఇసుకను కూడా దోచేసుకుంటున్నారని, గోదావరికి అటు జవహర్‌, శేషారావు – ఇటు బుచ్చయ్యచౌదరి, మురళీమోహన్‌ ఇందులో ప్రధాన పాత్రధారులని ఆరోపించారు. పెదబాబు, చినబాబు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సహా వాటాదారులేనన్నారు. వేమగిరి, గాయత్రి, ధవళేశ్వరం తదితర ర్యాంపుల నుంచి వేలాది లారీల్లో ఇసుక తరలించడానికి ఆధునిక యంత్రాలతో తవ్వేస్తున్నారని, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ళ రుణమాఫీ చేస్తాం

దేవుడు ఆశీస్సులు, ప్రజల తోడ్పాటుతో అధికారంలోకి వస్తే పేదల ఇళ్ళ రుణాలను మాఫీ చేస్తామని జగన్‌ ప్రకటించారు. ఉదాహరణగా రాజమహేంద్రవరంలో ఇళ్ళ భాగోతాలను ప్రస్తావించారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాజమహేంద్రవరంలో ఎనిమిదివేల ఇళ్ళు పేదల కోసం కట్టించారన్నారు. ఆవ ప్రాంతంలో 36 ఎకరాల్లో 26 ఎకరాలు సుమారు 2,500 ఇళ్ళు కట్టించి ఇచ్చారని, మిగిలిన పది ఎకరాలలో పేదలకే ఇళ్ళ స్థలాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పదెకరాలలో ఫ్లాట్లు నిర్మిస్తామంటూ చంద్రబాబు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. అడుగుకి రూ.వెయ్యి ఖర్చయ్యే చోట రూ.2వేలకు పైగా లెక్క చెబుతూ ఒక్కో ఇంటికి రూ.ఆరున్నర లక్షలు అవుతుందంటున్నారన్నారు. రూ.వెయ్యి చొప్పున అయితే రూ.3లక్షలకే ఇల్లు పేదవాడికి సొంతమవ్వాలని, రూ.2వేల చొప్పున ఒక ఇంటి ఖర్చును రూ.6లక్షలు చేసి భారం మోపబోతున్నారన్నారు. ఇందులో కేంద్రం రూ.ఒకటిన్నర లక్షలు – రాష్ట్రం రూ.ఒకటిన్నర లక్షలు సహాయంగా అందిస్తే మిగిలిన మూడున్నర లక్షలకు పేదవాడు 20 సంవత్సరాలపాటు చెల్లింపులు చేయాల్సి ఉంటుందంటున్నారని పేర్కొన్నారు. ఇందులో వాస్తవాన్ని గమనించాలన్నారు. అయితే లబ్ధిదారులెవరూ భయపడనక్కరలేదని, తాను అధికారంలోకి వస్తే ఇళ్ళ రుణాలను మాఫీ చేస్తానని హామీనిచ్చారు.

జిల్లాకు ఏమి చేశారో అడగండి

పాలన ఎలా ఉండాలో డా. రాజశేఖరరెడ్డి చేసి చూపించారని, మానవత్వంతో కూడిన పరిపాలన ద్వారా పేదవాడికి స్వర్ణయుగం సృష్టించారని జగన్‌ పేర్కొన్నారు. 2003లో ఆయన పాదయాత్ర చేశాక జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 స్థానాలతో ప్రజలు ఆశీర్వదించారన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంతో సహా రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారని, కాకినాడలో జెఎన్‌టియును అప్‌గ్రేడ్‌ చేయించారని గుర్తు చేశారు.రూ.3వేల కోట్లతో గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ, పోలవరం ప్రాజెక్ట్‌ కుడి – ఎడమ కాలువల నిర్మాణం దాదాపు పూర్తి, గోదావరి నదిపై 4వ బ్రిడ్జి నిర్మాణం, విమానాశ్రయ అభివృద్ధి పనులు వంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 14 స్థానాలను చంద్రబాబుకు ప్రజలు అప్పగించారంటూ, ఆయన తూర్పుగోదావరికి ఏమి చేశారో ప్రజలే నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ఏం చేసినా, చేయకపోయినా నైతిక విలువలకు తిలోదకాలిచ్చి జిల్లాలోని ముగ్గురు వైకాపా ఎంపీలను మాత్రం సంతలో పశువుల్లా కొనుగోలు చేశారన్నారు.

అవినీతిలో నెంబర్‌వన్‌గా రాష్ట్రం

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవినీతిలో దేశవ్యాప్తంగా ప్రథమస్థానంలో నిలిచిందని 2016లో జరిపిన ఒక సర్వే తేల్చిందని జగన్‌ పేర్కొన్నారు. మరో సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ కన్నా బీహార్‌ రాష్ట్రం ఉత్తమంగా నిలిచిందన్నారు. రాజధాని – విశాఖ భూములు, పోలవరం, ఇసుక, మట్టి, మద్యం స్కామ్‌లతో సహా చివరికి గుడి భూములను కూడా మేత మెయ్యడంలో అధికార గణం ముందుందన్నారు. క్రిందిస్థాయిలో అయితే జన్మభూమి కమిటీల మాఫియాలు నడుస్తున్నాయన్నారు. పెన్షన్ల నుంచి మరుగుదొడ్ల వరకు లంచాలు చెల్లుబాటవుతున్నాయన్నారు. జాబ్‌ కావాలంటే బాబు రావాలన్న నినాదమిచ్చిన ఆయన నిరుద్యోగ భృతి విషయంలో కూడా శఠగోపం పెట్టారని, పిల్లల్ని నట్టేట ముంచారని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కలగాలంటే అవసరమైన ప్రత్యేక హోదాని అమ్మేసిన ఘనుడుగా చంద్రబాబును పేర్కొన్నారు. బెల్ట్‌ షాపులను ఎత్తేస్తామని చెప్పిన ఆయన ప్రతి వీధికో బెల్ట్‌ షాపు ఏర్పాటు చేయించారని, మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందేమో గానీ, లిక్కర్‌ షాపు లేని గ్రామం అంటూ లేదని విమర్శించారు. ప్రజలు తోడుగా నిలిస్తే మార్పు చేసి చూపిస్తానని పేర్కొన్నారు. తాను ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించి ఏమి చెయ్యబోతామన్నది ఆయన వివరించారు.

అంతా బాదుడే బాదుడు

రాజ్యాంగం లేదు, చట్టాలు వర్తించవు, నీతి న్యాయాలు – దయా కరుణ అనేవి అసలే ఉండవు.. రాష్ట్రంలో అంతా అవినీతి చోటుచేసుకుందంటూ జగన్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు నోరు అబద్ధాల ఫ్యాక్టరీ అని, మెదడు ఓ క్షుద్ర ప్రపంచమని, పాలన రాక్షస పాలన అని అభివర్ణించారు. ఆయన చెప్పే అబద్ధాలను నమ్మవద్దని, మోసాలను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంతోషం కోసం సాయంత్రం పూట ఒక పెగ్‌ మందు తాగినా ఫర్వాలేదని ఆయన చెబుతుంటే, మంత్రివర్గ సహచరుడొకరు బీర్‌ను హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నారని విమర్శించారు. మొత్తం మీద రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌లపై అదనపు వ్యాట్‌ టాక్స్‌తో సహా ఎన్నింటిపైనో బాదుడే బాదుడుగా ప్రజల నుంచి సొమ్ము గుంజుతున్నారన్నారు.

పొరపాటున కూడా క్షమించొద్దు

మైక్‌ పట్టుకుని చేస్తానని చెప్పిన దానిని చెయ్యని నాయకులను తరిమికొట్టాలని జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అడుగడుగునా అబద్ధాలు, మోసాలతో నెగ్గుకొస్తున్న చంద్రబాబు బృందాన్ని పొరపాటున కూడా క్షమించొద్దని సూచించారు. వారిని బంగాళాఖాతంలో కలపాలని సూచించారు. 98 శాతం హామీలు నెరవేర్చానని చెబుతూ ప్రతీ ఇంటికి కేజీ బంగారు ఇవ్వడానికైనా, నమ్మకపోతే బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానని చెప్పడానికైనా ఎన్నికల వేళ ఆయన తెగిస్తారన్నారు. ఆ చిట్కాలు పారకపోతే ఇంటిలోని ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెట్టడానికి కూడా సిద్ధపడతారన్నారు. అదే జరిగే రూ.5వేలు కావాలని డిమాండ్‌ చేయమన్నారు. అయితే మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయతలను పాదుకొల్పేందుకు తాను ముందుకు సాగుతానన్నారు.

జగన్‌కు ఘన స్వాగతం

అంతకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను ముగించుకుని రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీదుగా తొమ్మిదవ జిల్లాగా తూర్పుగోదావరిలోకి మంగళవారం సాయంత్రం ప్రవేశించినప్పుడు జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. అమ్మవారి కలశాలు, కళాకారుల సంప్రదాయ నృత్యాలతో బ్రిడ్జిపై ఎదురెళ్ళిన తూర్పుగోదావరి పార్టీ నాయక ప్రముఖులు – అభిమానులు జగన్‌కు సాదర స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, పార్టీ జెండాలోని రంగులకు ప్రతీకగా గాల్లోకి ఎగిరిన బెలూన్లు – అవే రంగుల చీరలు ధరించిన మహిళలు, బ్రిడ్జికి వెంబడిగా వరుసకట్టిన పడవల నుంచి పలకరించిన పతాకాల రెపరెపల మధ్య ఆహ్లాదకర వాతావరణం నడుమ అధినేత అభివాదం చేస్తూ కదిలి రావడం వైకాపా శ్రేణులతో సహా చూసే వారందరినీ ఆకర్షించింది. జగన్‌ చిరునవ్వు చెదరకుండా, ఓపికతో చేతులు పైకెత్తి నమస్కరిస్తూనే పలకరింపు ధోరణిలో నడుచుకుంటూ వచ్చారు. సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సాంగ్‌ తరహాలో పాదయాత్ర పాట హోరుగా వినిపిస్తుంటే బ్రిడ్జి పొడవునా నాలుగు కిలోమీటర్లకు పైగా జగన్‌ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ శ్రేణులు కదలివచ్చాయి. మనమందరం చేయి చేయి కలుపుదాం – ఒకటవుదాం – ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుద్దాం అనే జగన్‌ నినాదం మార్మోగింది. అందుకు తగ్గట్టుగానే జగన్‌ కూడా తన ప్రసంగంలో అందరినీ కలుపుకు వెళ్ళే ధోరణి ప్రదర్శించారు. ‘నాన్న (రాజశేఖరరెడ్డి) పేదల కోసం ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన బాటలోనే నేను రెండడుగులు ముందుకు వేస్తా. తన పాలనతో నాన్న పేదవాడి గుండెల్లో నదిలో గూడు కట్టుకున్నారు. వారింటిలో ఫొటోల రూపాన నిలిచారు. అదే తరహాలో నేను కూడా ప్రజాభిమానం చవిచూడాలనుకుంటున్నా’నంటూ అభిమతాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఎండ, దుమ్ము, ధూళి.. వగైరాలేమీ పట్టించుకోకుండా ఎంతో ఆప్యాయత, ఆత్మీయతలతో పాదయాత్రలో ప్రజలు ఆదరిస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాల్లో కొన్నింటిని ప్రస్తావించారు. ముఖ్యంగా పేదల ఆరోగ్య భద్రతకు సంబంధించి రూ.వెయ్యి దాటిన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా చెయ్యిస్తామన్నారు. అవసరాన్ని బట్టి చికిత్సల తరువాత ఆరునెలల పాటు విశ్రాంతికి అవసరమైన తదుపరి సహాయాన్ని కూడా అందిస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వారికి నెలకు రూ.10వేల పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ వెళ్ళి వైద్యం చెయ్యించుకుంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని ఇప్పటి ప్రభుత్వం చెబుతోందని, తాను అధికారంలోకి వస్తే అలాంటిదేమీ లేకుండా ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఉచితంగా జరిగేలా చేస్తానన్నారు. మిగిలిన కార్యక్రమాలు కూడా ఇదే తరహాలో ఉంటాయని వివరించారు.

బ్రిడ్జి ఊగింది.. ఇక చంద్రబాబు షేక్‌ అవుతారు

గోదావరి నదిపై రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి జగన్‌ పాదయాత్రతో ఊగిందని, ఇక చంద్రబాబు ప్రభుత్వం షేక్‌ అవ్వడమే తరువాయి అని వైకాపా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా కన్వీనర్‌ కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రసంగానికి ముందు ఆయన మాట్లాడారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ నాయకుడికీ దక్కని స్వాగతం గోదారమ్మ సాక్షిగా జగన్‌కు లభించిందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్‌ యాత్ర వల్ల బ్రిడ్జి కూలిపోదని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. అందరికీ అభయమిచ్చే ఇంటి పెద్దగా, పులివెందుల పులిబిడ్డగా, ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా జగన్‌ను అభివర్ణించారు. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కడప జిల్లా కన్నబిడ్డ, తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డగా జగన్‌ను పేర్కొన్నారు. ఆయన పాదయాత్రతో ప్రభుత్వాలు షేక్‌ అవుతున్నాయన్నారు. రాజమహేంద్రరవరం రూరల్‌ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు తన నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అద్యంతం జగన్‌ పక్కనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here