ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించవద్దు

0
22

అంగన్‌వాడీ పాఠశాలల నిర్వహణపై గన్ని అసంతృప్తి

రాజమహేంద్రవరం, జూన్‌ 14 : గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్‌వాడీ పాఠశాలల నిర్వహణలో లోపాలను సరిచేసుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ హెచ్చరించారు. స్థానిక 29వ డివిజన్‌లో అంగన్‌వాడీ పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుందని వచ్చిన ఫిర్యాదుల మేరకు కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మతో కలిసి రెండు అంగన్‌వాడీ సెంటర్‌లను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు పరిశీలించారు. ఒక సెంటర్‌లో హాజరు పట్టికను పరిశీలించి అందులో ఉన్న సంఖ్య ప్రకారం పాఠశాలలో లేకపోవడంపై సంబంధిత వర్కర్‌ను ప్రశ్నించారు. బాలింతలకు అందించాల్సిన సరుకులను తగ్గించేస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేశారు. మరొక సెంటర్‌లో 11.45 గంటలకే పిల్లలు లేకుండా ఖాళీగా ఉండటంపై గన్ని అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో వేస్తున్న సంఖ్య ప్రకారం పిల్లలు లేకపోవడం, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయకపోవడంపై ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వాణికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కృషిచేస్తుంటే వాటిని అర్హులకు అందించే విషయంలో అంగన్‌వాడీ పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు తలెత్తకుండా బాధ్యత వహించాలని సూచించారు. గన్ని వెంట కోట కామరాజు, స్థానిక నాయకులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here