మనస్సాక్షి
వెంకటేశం పొద్దున్నే దిగిపోయాడు. అయితే ఈసారి ఎప్పటిలా లేడు. రావడం రావమే కొంచెం ఆవేశంగా వచ్చాడు. వస్తూనే ” గురూ గారు… నా కర్జంటుగా తెలవాలి” అన్నాడు. దాంతో గిరీశం తలెత్తి ” ఏవివాయ్… రాత్రేవయినా కలలోకి మీ వెంకటేశం తాతగారు గానీ వచ్చారుటోయ్… ఉన్నట్టుండి ఆవేశపడిపోతున్నావ్” అన్నాడు. ఈలోగా వెంకటేశం అరుగుమీద సెటిలై ” అబ్బే అలాంటిదేం లేదులే గురూ గారూ… నాకెందుకో బొత్తిగా రోజులన్నీ వేస్టయిపోతున్నాయనిపిస్తోంది. అందుకే అర్జంటుగా ఏదయినా ఫీల్డ్‌లోకి…అది పవర్ఫుల్ ఫీల్డ్‌లోకి దూకాల్సిందే” అంటూ ఆపాడు. ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని ” ఆ దానికంత ఆలోచనెందుకూ… పాలిటిక్స్ ఉన్నాయిగా. ఏదయినా పదవి చేతిలో ఉండే ఆ పవరే వేరు” అన్నాడు. వెంకటేశం తలూపి ” ఆ.. ఆ పదవులు ఎప్పుడూడతాయో ఎవరికి తెలుసు ?” అన్నాడు. దానికి గిరీశం తలూపి అవునోయ్… అయితే ఏ పోలీసాఫీసరో అయితే అందర్ని దడదడలాడించొచ్చు” అన్నాడు.దానికీ వెంకటేశం ఒప్పుకోకుండా ‘ ఆ ఎంత పవర్ఫుల్ పోలీసయినా అధికారంలో ఉన్న పార్టీ నాయకుల మాట వినాల్సిందే కదా” అన్నాడు. గిరీశం తలూపి ‘ అవున్నిజమేనోయ్… యివన్నీ వదిలెయ్… వీటన్నిటికంటే పవర్ఫుల్ ఫీల్డ్ ఏంటో తెలుసా? మీడియా అన్నాడు. అది వినగానే వెంకటేశం మొహంలో వెలుగొచ్చింది. ”వండ్రఫుల్ గురూ గారూ.. మీడియా అంత పవర్ఫుల్ యింకొకటి లేదు అటు ప్రింట్ మీడియాని తీసుకున్నా యిటు ఎలక్ట్రానిక్ మీడియాను తీసుకున్నా అందరినీ ఓ ఆట ఆడించేయెచ్చు” అన్నాడు. గిరీశం తలూపి ” అలాగయితే నిన్ను ఆ ఫీల్డ్‌కే పంపించేస్తా. డీఎస్ఆర్ నెట్ వర్క్ అని నాకు తెలిసిన వాళ్ళదే. వాళ్ళకి టీవి చానలలూ, పేపరూ ఉన్నాయి. నువ్వెళ్ళి ఆ ఛానల్ చూసే నరసింహాన్ని కలు” అన్నాడు. వెంకటేశం తలూపాడు. అంతేకాదు. ఆ రోజు రాత్రికే హైదరాబాద్ బయల్దేరాడు.
——–
డీ ఎస్ ఆర్ ఛానల్ ఆఫీస్…. వెంకటేశం వెళ్ళే సరికి నరసింహం స్డూడియో లోనే ఉన్నాడు. వెంకటేశం తనని పరిచయం చేసుకుని గిరీశం గారిచ్చిన లెటరిచ్చాడు. నరసింహానికయితే వెంకటేశం బాగా నచ్చాడు. కుర్రాడయితే చాలా చురుగ్గా ఉన్నాడాయె. దాంతో తన చాంబర్లో కూర్చోబెట్టి మూమూలు ప్రశ్నలయ్యాక చిన్న ఇంటర్వ్యూ లాంటిది చేశాడు. ” ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయడం అంటే అంత ఆషామాషీ కాదు. యిదంతా కత్తి మీద సాములాంటి వ్యవహారం. అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి.. సరే.. నువ్వొకటి చెప్పు. రేపు చెయ్యవలసిన పని ఎప్పుడు చేయాలీ” అన్నాడు. వెంకటేశం వెంటనే ” యింకెప్పుడూ… రేపే చేసెయ్యాలి” అనబోయి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” కాదు… కాదు యివ్వాళే చేయాలీ అన్నాడు. దాంతో నరసింహం మొహలో వెలుగొచ్చింది. ” శభాష్… అదీ లెక్కంటే ఈ ఫీల్డ్‌లో రేపేం జరగబోతుందనేది యిప్పుడే అంచనాకి రాగలగాలి.ఎదురుజ్గాగా ఆ వార్తల్నీ యిప్పుడే రడీ చేసేసుకోవాలి” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ” అవున్సార్… ట్రంప్, కిమ్‌ల భేటీ జరగబోతుంటే రిజల్టనేది రెండు రకాలుగా ఉండొచ్చు. సక్సెస్ కావచ్చు. ఫెయిల్యూర్ కావచ్చు. సక్సెస్ అయ్యే పక్షంలో ‘సింగపూర్ ఎగిరిన శాంతి పావురాలు’ అన్న హెడ్డింగ్, ఫెయిలయితే తుస్సుమన్న పెద్దన్నల భేటీ’ లాంటి హెడ్డింగ్ రడీగా పెట్టుకుని ఉపయోగించుకోవాలి’ అన్నాడు. దాంతో వెంకటేశం మొహం వెలిగిపోయింది. ” బ్రహ్మాండంగా చెప్పావోయ్… నువ్వు వెంటనే జాయినయిపోవచ్చు” అన్నాడు. ఆ రోజే డీయస్సార్ న్యూస్ ఛానల్లో కీలకమైన న్యూస్ విభాగంలో క్రియేటివ్ హెడ్ గా వెంకటేశం చేరిపోయాడు.
——-
వెంకటేశం బాగా బిజీ అయిపోయాడు. ఈ కొత్త జీవితమేదో వెంకటేశానికి బాగా నచ్చేసింది. ఓ ప్రక్కన టెన్షన్ టెన్షన్‌గా ఉంటోంది. అయితేనేం… బోల్డంత థ్రిల్ ఉంటుందాయో.బయట్నుంచి వార్తలు వచ్చి పడిపోతుంటాయి. వాటిలో అవసరమైనవి తీసివేయడం, అనవసరమైనవి ఎన్ని గంటలకి ప్రసారం చేయడం లాంటివి ఆర్గనైజ్ చేస్తుంటాడు. యిలా రెండు నెలలు గడిచిపోయాయి. అప్పుడు జరిగిందది. వెంకటేశం స్టూడియోలో బిజీగా ఉండగా ఊర్నించి ఫోనొచ్చింది. తన అమ్మమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చిందన్నది ఆ వార్త. దాంతో వెంకటేశం కంగారు పడిపోయాడు.గబ గబా న్యూస్‌కి సంబంధించి చెయ్య వలసిన పనులన్నీ తన అసిస్టెంట్ యాదగిరికి పురమాయించి నరసింహం దగ్గర పర్మిషన్ తీసుకుని తన ఊరెళ్ళే బస్సెక్కేశాడు.
——-
వెంకటేశానికయితే టెన్షన్‌గా ఉంది. అయితే ఆ టెన్షనేదో ఊళ్ళో ఉన్న అమ్మమ్మ గురించి కాదు.ఛానల్లో తాను అప్పజెప్పిన పనులు యాదగిరి ఏం చేస్తాడోనని. మొత్తానికి బస్‌లో వెడుతున్న మాటే గానీ అనీజీగానే ఉన్నాడు. యింతలోనే తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి దాంట్లో తన ఛానల్లో ఏం వార్తలొస్తున్నాయనేది పెట్టాడు. వార్తలేవో వస్తున్నాయి. యింతలోనే ‘ బ్రేకింగ్ న్యూస్’ అని హఠాత్తుగా ఓ వార్త రావడం మొదలయింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారు మరణించారన్నది ఆ వార్త. ఆ వెనుకే వాజ్‌పేయికి సంబంధించిన విశేషాలు వరసగా రాసాగేయి. యింతలోనే వెంకటేశానికి నరసింహం నుచి ఫోనొచ్చింది.” కంగ్రాచ్యులేషన్సోయి’ వాజ్పేయ్గారు పోవడం గురించి యింకా ఏ ఛానల్స్‌లో రావడం లేదు. ముందుగా మన ఛానల్ల్లోనే వచ్చింది. యింకా వాజ్‌పేయ్ గారి చరిత్ర అంతా వస్తోంది. ఆ క్రెడిట్ అంతా నీదే…” అంటూ ఫోన్ పెట్టేశాడు. యింతలోనే వెంకటేశం గబగబా మిగతా ఛాన్సలన్నీ పెట్టాడు. ఎక్కడా ఆ వార్త రావడం లేదు. దాంతో ఏదో అనుమానం వచ్చి స్టూడియోలో యాదగిరికి ఫోన్ చేశాడు. ” యిదిగో యాదగిరీ… వాజ్‌పేయ్ గారి గురించి వార్త ఎలా వచ్చింది” అన్నాడు. దాంతో యాదగిరి ” ఏమో…అలాంటి వార్తం రాలేదు” అన్నాడు. దాంతో వెంకటేశం ” మరిప్పుడు మన ఛానల్లో ఎలా వస్తుంది?” అన్నాడు. దాంతో యాదగిరి ” అదేంట్సార్…. మీరు చెప్పిందే కదా ఆ డి-త్రీ సీడీ వెయ్యిమన్నది. మీరు చెప్పినట్టే తొమ్మిదింటి కల్లా వార్తల్లో ఆ సీడీ పెట్టేశా” అన్నాడు. దాంతో వెంకటేశం గుండాగినంత పనయింది. ” అదేంటి యాదగిరీ… డీ-త్రీ ఎలా పెట్టావ్? నేను చెప్పింది బీ-త్రీ కదా” అన్నాడు అరిచినట్టుగా. ఈసారి అవతల యాదగిరి ‘దబ్‌మని కుర్చీలోంచి కింద పడ్డ శబ్ధం వినిపించింది.
——-
” ఏంటి గురూ గారూ… కలలయితే మంచిగానే వస్తున్నాయి గానీ మధ్యలో యిలాంటి అపశ్రుతులు ధ్వనిస్తున్నాయి” అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. గిరీశం తలూపి ” అవునోయ్… దీనినే అత్యుత్సాహం అంటార్లే. ఎక్కడయినా ఉత్సాహం అవసరమే గానీ ఈ అత్యుత్సాహం అంత మంచిది కాదు. అందులో మీడియాలో” అన్నాడు. వెంకటేశం అర్ధం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ” యిప్పుడు మనం స్పీడ్ యుగంలో ఉన్నాం. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు లాంటి వాటి ద్వారా మనం చెప్పదలుచుకున్నదేదో క్షణాల్లో ప్రపంచమంతటికీ పంపేయొచ్చు. అయితే ఆ పంపేవి ఏవయినా వాస్తవికంగా, నిజాలే అయి ఉండాలి. అంతే గానీ అత్యుత్సాహంతో తప్పుడు సమాచారాలు, ఊహించుకున్న విషయాలు పంపకూడదు. మొన్నటికి మొన్న ఏం జరిగింది? వాజ్‌పేయిగారు పోయారని, ఎవరో అత్యుత్సాహంతో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అసలే. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాలేదని వార్తలొస్తున్నాయి కదా. దాంతో అంతా నమ్మడం…బాధపడటం జరిగింది. తర్వాత అది నిజం కాదని తెలిసింది. అందరూ తెలుసుకోవలసింది ఒక్కటే. ఈరోజు వాట్సాప్‌లు…ఫేస్‌బుక్‌ల ద్వారా మెసేజ్‌లు పంపగలిగిన వారంతా ఒక ఎలక్ట్రానిక్ మీడియా అదే… న్యూస్ ఛానల్లో సమానమే. అంటే తాము పంపే ఏ మెసేజైనా వేల మందికో, లక్షల మందికో వెళ్ళే పరిస్థితుల్లో అత్యుత్సాహం ప్రదర్శించకుండా తమని తాము నియంత్రించుకుకుంటూ వెడితే మంచిది” అంటూ వివరించాడు.
డా. కర్రి రామారెడ్డి