గుడా మాస్టర్‌ ప్లాన్‌కు టెండర్‌ ఖరారు

0
212
చైర్మన్‌ గన్ని కృష్ణ సమక్షంలో సంతకాలు – సంవత్సరంలోగా ప్లాన్‌ రూపకల్పన
రాజమహేంద్రవరం, జులై 10 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ అమలు చేయడానికి  రంగం సిద్ధమైంది. అందు నిమిత్తం  టెండర్లను ఆహ్వానించగా ఐదుగురు పాటదారులు పాల్గొన్నారు. వీరిలో ఒకరిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ విశ్రాంత సంచాలకులు చైర్మన్‌గా ఎవాల్యూషన్‌ కమిటీ నియమించింది. ఈ కమిటీ కెనడా ప్రధాన కేంద్రంగా గల మెస్సర్స్‌ లీ అసోసియేట్స్‌ సౌత్‌ ఆసియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిబిర్‌ఇ వారి కన్సార్టియం తక్కువ మొత్తానికి టెండరు దాఖలు చేయడంతో వారిని ఎంపిక చేసింది. ఈ సంస్థ రూ.6.63 కోట్లకు మాస్టర్‌ ప్లాన్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. కాగా ఈరోజు కాకినాడలోని గుడా కార్యాలయంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, సభ్యుల సమక్షంలో ఆ సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కన్సల్‌టెంటివ్‌ సంస్థ సంవత్సర కాల వ్యవధిలో మాస్టర్‌ ప్లాన్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తయారు చేసి గుడాకు అందజేస్తుంది. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ మాస్టర్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లను  వచ్చే జులై వరకు కాకుండా వచ్చే ఏడాది మే నాటికి అందజేయవలసిందిగా సంస్థను కోరామని చెప్పారు. నివేదిక త్వరగా అందజేసేందుకుగాను సంస్థ కార్యాచరణకు అవసరమైన సహకారాన్ని తాము అందిస్తామని, అందులో భాగంగా ప్లాన్లు రూపొందించేందుకు అవసరమయ్యే ఉపగ్రహ ఛాయా చిత్రాల రూపకల్పనకు రూ.49 లక్షలు అవసరమవుతాయని అంచనా వేయగా ప్రభుత్వం నుంచి ఆ మొత్తం వచ్చే వరకు వేచి ఉండకుండా పని వెంటనే ప్రారంభించడానికి వీలుగా ఆ మొత్తాన్ని గుడా నిధుల నుండి విడుదల చేయగలమని గన్ని కృష్ణ వారికి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here