వీడని ముసురు.. పెరుగుతున్న వరద 

0
150
మరో నాలుగైదు రోజులు వర్షాలే
రాజమహేంద్రవరం, జులై 12 : ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావాలకు తోడు నైరుతి రుతు పవనాలు చురుకుగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జన జీవనానికి అంతరాయం కలుగుతోంది. అంతే గాక రహదారులన్నీ చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.  మరో నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. గోదావరి జన్మస్ధలం మహారాష్ట్రతో పాటు ఉప నదులు కలిసే ఎగువ ప్రాంతాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలంతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద కూడా నీటి ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజ్‌ వద్ద ఈ ఉదయం నీటి మట్టం 9.3 అడుగులు ఉండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరితో పాటు జిల్లా వ్యాప్తంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా అల్పపీడన ప్రభావంతో గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇలా ఉండగా రాజమహేంద్రవరం అర్బన్‌ మండలంలో గత 24 గంటల్లో  27.6  మిల్లీ మీటర్ల వర్షపాతం కురవగా, రూరల్‌ మండలంలో 19.6  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here