అభివృద్ధికి.. రాజకీయానికి లంకె లేదు

0
94
 కేంద్రమంత్రి గడ్కరీ అదే తేల్చి చెప్పారు
రాజమహేంద్రవరం, జూలై 12 : అభివృద్ధిని బిజేపి రాజకీయాలతో ముడిపెట్టదని, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో అదే తేల్చిచెప్పారని  నగర శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ స్పష్టం చేసారు. స్ధానిక ప్రకాశంనగర్‌లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు  యావత్‌ దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధులు కొరత ఉండదని వెల్లడించడం జరిగిందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి తయారు చేసిన డిపిఆర్‌కు, రెండవ డిపిఆర్‌లో రెట్టింపు భూసేకరణ జరుపుతున్నట్లు చూపించడంతో సందేహాలు ఏర్పడ్డాయన్నారు. ఈ సందేహాలను మంత్రి నివృతి కోరారన్నారు. ప్రాజెక్టు ఎత్తుపెరగకుండా భూసేకరణ ఎందుకు రెట్టింపు చేయాల్సి వచ్చిందో సందేహాలను నివృతికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధులు ఢిల్లీకి రావాలని, తృతీయ సంస్ధ సమక్షంలో 2వ డిపిఆర్‌లోని సందేహాలను నివృతి చేస్తే 8రోజుల్లోగా తాను సంతకం చేసి ఆర్ధిక శాఖకు పంపుతామని మంత్రి గడ్కరీ స్పష్టం చేశారన్నారు. 2013 భూసేకరణ చట్టం కింద నిర్వాసితులకు నష్టపరిహారం ప్రతిపైసా చెల్లించడానికి కేంద్రం సిద్ధంగానే ఉందన్నారు. అయితే భూసేకరణ పెంపు విషయంలోనే స్పష్టత రావాల్సి ఉందన్నారు. సాంకేతిక పరమైన అంశాలలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి నాటికల్లా సివిల్‌ వర్క్స్‌ పూర్తిచేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులతో పాటు, కాంట్రాక్టర్‌లకు మంత్రి సూచించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చుచేసిన ప్రతీ పైసాను కేంద్రం చెల్లిస్తుందన్న భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రధాని మోదీకి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టు ఆయన సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పూర్తి అవుతుందని గడ్కరీ పేర్కొనడం జరిగిందన్నారు.మంత్రి లేవనెత్తిన సందేహాలపై సహేతకమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పిస్తే పోలవరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తికావడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో పోలవరం సందర్శించినప్పటికీ ఇప్పడికి పనుల్లో ప్రగతి ఉందని మంత్రి గడ్కరీ అభినందించారని గుర్తుచేసారు. రాష్ట్ర  ప్రభుత్వం తమ మిత్ర పక్షంగా ఉన్నా లేకున్నా అభివృద్ధి విషయంలో బిజేపి ప్రభుత్వం రాజకీయాలు చేయదని గడ్కరీ స్పష్టం చేశారన్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే రోడ్లపై కొట్టుకుంటామని విస్పష్టం చేశారన్నారు. విభజన తర్వాత రాష్ట్రానికి ఎదురవుతున్న కష్టాలు బిజేపికి తెలుసునన్నారు. పెందుర్తి – అనకాపల్లి రోడ్డు, రణస్ధలం – విజయనగరం రోడ్డులను రూ. 6,670 కోట్లతో అభివృద్ధి పరిచేందుకు గురువారం  మంత్రి గడ్కరీ శంకుస్ధాపన చేస్తున్నారన్నారు. అలాగే విశాఖపట్నంలోని మానసిక వ్యాధిగ్రస్తుల చికిత్సా కేంద్రాన్ని  సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీగా అభివృద్ధి పరిచేందుకు రూ.30 కోట్లతో ప్రణాళికలు రూపొందించి, రూ. 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. లాలాచెరువు నుండి వెళుతున్న ఫ్లై ఓవర్‌కు ఆనాల వెంకట అప్పారావు రోడ్డును అనుసంధానం చేయాల్సిందిగా కోరామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బిజేపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్‌, ఎన్‌ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌, నాళం పద్మశ్రీ, క్రొవ్విడి సురేష్‌, అడ్డాల ఆదినారాయణమూర్తి, కొప్పిశెట్టి లోవరాజు, రౌతు వాసులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here