ఆత్మహత్యల నివారణలో కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ల పాత్ర కీలకం

0
145
పిపిఎఐ వ్యవస్దాపక అధ్యక్షులు డాక్టర్‌ హిప్నో కమలాకర్‌
పిపిఎ జిల్లా అధ్యక్షునిగా కర్రి రాజేష్‌
రాజమహేంద్రవరం, జులై 12 : దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయని, దీనికి వారు వీరు… ఈ రంగం అనే తారతమ్యం లేదని,  ఈ ఆత్మహత్యలను అరికట్టడానికి కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ల సేవలను వినియోగించుకోవాలని ప్రొగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇండియా వ్యవస్ధాపకులు, జాతీయ అధక్షులు డాక్టర్‌ హిప్నో కమలాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షునిగా కర్రి రాజేష్‌కు ఆయన నియామకపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హిప్నో కమలాకర్‌ మాట్లాడుతూ విద్యార్ధుల ఆత్మహత్యల నివారణకు స్కూల్స్‌, కళాశాలల్లో కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌లను నియమించాలని చక్రపాణి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పటికీ ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కమిటీ సైకాలజిస్ట్‌లను నియమించమంటే, ప్రభుత్వం సైకియాట్రిస్ట్‌లను నియమించాలని సూచించిందని, రాష్ట్రంలో కేవలం 250 మంది మాత్రమే సైకియాట్రిస్ట్‌లు ఉన్నారని తెలిపారు. మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు అవసరం లేదని, చాలా వరకు వ్యాధులను కౌన్సిలింగ్‌ ద్వారా నయం చేయవచ్చన్నారు. తమ సంఘంలో 1400 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. తమ సంఘంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన కొందరిని బహిష్కరించామని, అయితే వారు తాము సైకాలజిస్ట్‌ సంఘంగా ఏర్పడి, కార్పొరేట్‌ స్కూల్స్‌, కళాశాలలకు విద్యార్ధులను చేర్చే కార్పొరేట్‌ బ్రోకర్‌లుగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్రి రాజేష్‌ మాట్లాడుతూ హిప్నో కమలాకర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అధ్యక్షునిగా పూర్తి సమయాన్ని సంఘం అభివృద్ధికి, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి పనిచేస్తానన్నారు. విలేకరుల సమావేశంలో సైకాలజిస్ట్‌లు లలిత, ఆరేపల్లి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here