మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి కిరణ్‌కుమార్‌రెడ్డి 

0
261
న్యూఢిల్లీ, జులై 13 : అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని నిరశిస్తూ  2014లో ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్ధాపించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవడంతో నాటి నుంచి ఆయన రాజకీయంగా స్తబ్ధుగా ఉండిపోయారు. కాగా కిరణ్‌కుమార్‌ రెడ్డి బిజెపిలో లేదా తెలుగుదేశంలో చేరతారని కొద్దిరోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తిరిగి మాతృ సంస్థలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం చేసి ఉన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం రాహుల్‌ గాంధీతో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌ చాందీ, రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ  తమ కుటుంబంతో కాంగ్రెస్‌కు ఎంతో అనుబంధం ఉందని, కాంగ్రెస్‌ వలనే తాము ఉన్నత పదవులు పొందామని, కాంగ్రెస్‌లో తిరిగి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జరిగిన దాని కంటే జరగబోయేదెంతో ముఖ్యమని, కేంద్రంలో మరో మారు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే విభజన చట్టం అమలవుతుందని అన్నారు. కాంగ్రెస్‌లోకి మరో 40 మంది మాజీలు రాబోతున్నారని  ఆయన చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయితేనే ఏపీకి, తెలంగాణాకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here