నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద

0
132
కాస్త తెరిపిచ్చిన వర్షం
రాజమహేంద్రవరం, జులై 13 : గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.75 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి  3 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు.  భద్రాచలం వద్ద 27.70 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, ధవళేశ్వరం వద్ద శుక్రవారం సాయంత్రానికి ప్రస్తుతం ఉన్న దానికంటే అదనంగా స్వల్పంగా వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలోని ఈస్ట్రన్‌ డెల్టాలో వర్షాలు కురుస్తుండటంతో ఈ డెల్టాకు బ్యారేజీ నుంచి విడుదల చేసే గోదావరి జలాలను నిలుపుదల చేశారు. ఇక పశ్చిమ డెల్టా, సెంట్రల్‌ డెల్టాలకు మూడు వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలోకి 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువన ఉన్న పురుషోత్తపట్నం, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్ట ప్రాంతానికి సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరో 24 గంటలపాటు వరద ఉధృతి ఉంటుందని, కావున లంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here