మీ మేలు మరువలేం !

0
166
 ఆదిరెడ్డికి వాసుకు ఆటో కార్మికుల సత్కారం
రాజమహేంద్రవరం, జులై 13 : కేంద్ర ప్రభుత్వం మోటారు వాహానాలపై జారీ చేసిన 894 గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఆటోలపై రోజుకు రూ.50 చొప్పున విధించిన ఫిట్‌నెస్‌ ఫైన్‌ను రూ.10లకు తగ్గించేలా కృషి చేసిన  ఆదిరెడ్డి  తనయుడు ఆదిరెడ్డి వాసుకు పేపర్‌మిల్లు వద్ద ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఈరోజు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. సత్కార సభకు  ఐఎన్‌టియుసి నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. అయితే  మోటారు వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గెజిట్‌ నోటిఫికేషన్‌ వల్ల ముఖ్యంగా ఆటో కార్మికులు, ఆటో యజమానులు, ఆటో ఫైనాన్స్‌ కంపెనీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ వంతు కృషిలో భాగంగా ఫిట్‌నెస్‌ ఫైన్‌ను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫిట్‌నెస్‌ ఫైన్‌ను రూ.10లకు తగ్గించిందని అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారంలో కొందరు అధికారులు చేసిన తాత్సారం వల్లే ఆటో కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, కార్మికుల ఇబ్బందులను ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపారని అన్నారు. ఈ విజయంలో తమ కృషి ఎంత ఉందో, ఆటో కార్మిక సంఘాల నాయకులు, ఆటో ఫైనాన్స్‌ ప్రతినిధుల సహాకారం ఎంతో ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు వేరైనా కార్మికుల సంక్షేమమే అజెండాగా కార్మిక సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించారు. ఆటో ఫైనాన్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి, అధ్యక్షులు వల్లెపు మంగరాజు, ఎఐటియుసి నాయకులు వామనమూర్తి, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు అడపా వెంకటరమణ(గెడ్డం రమణ), మాజీ కార్పొరేటర్‌, కార్మిక నాయకుడు బట్లంకి ప్రకాష్‌ తదితరులు మాట్లాడారు. కార్మికులు ఫిట్‌నెస్‌ ఫైన్‌లను చెల్లించలేక ఆటోలను తుక్కుగా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆటో కార్మికులకు ఎంతో ఊరట నిచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం మూడు వేల నుంచి ఎనిమిది వేలకు పెంపుదల చేసిందని, అయితే ఈ ప్రీమియం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత రాయితీ ఇచ్చి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసును ఆటో కార్మికులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే తమకు అండగా నిలిచిన ఆటో ఫైనాన్స్‌ గౌరవాధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డిని కార్మికులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందుగా ఆటో కార్మికులు ఆదిరెడ్డి వాసు స్వగృహం నుంచి ర్యాలీ నిర్వహించి కళ్యాణమండపానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం వద్ద గల ఎన్‌టిఆర్‌ విగ్రహానికి ఆదిరెడ్డి వాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో ఫైనాన్స్‌, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు అర్జునరెడ్డి, చంద్రమౌళి, టి.నరసింహరాజు, బొర్రా చిన్ని, సత్యనారాయణ, సింహాచలం, రామలింగయ్య, సుబ్రహ్మణ్యం, మస్కా జోగినాయుడు, కుమారస్వామి, వాసు, తాడేపల్లి యేసు, ప్రవీణ్‌ చౌదరి, కుమార స్వామి, పురుషోత్తం(చిన్న), ఎ.రాజారావు, ఈ.శ్రీనివాసు, సప్పా ఆదినారాయణ, ఎం.వీరబాబు, షేక్‌ షానా, గాడాల సత్తిబాబు, జె.సూరిబాబు, మాలకొండయ్య, బాలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here