జిహ్వాస్టిక్స్‌

0
149
వెంకటేశం వెళ్ళేసరికి గిరీశం వాకిట్లో ఊయల ఊగుతున్నాడు. నోట్లో చుట్ట మాత్రం గుప్పు గుప్పుమంటోంది. వెంకటేశాన్ని చూడగానే ”రావోయ్‌ మైడియర్‌ వెంకటేశం… ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావ్‌… ఏవయినా నీకు కంగారు కుసింత ఎక్కువే సుమీ” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”మరేం చెయ్య మంటారు? కండిషన్స్‌ అలా పెట్టారుగా” అన్నాడు. గిరీశం తలూపి ”మొత్తానికి ఏదోలా గట్టెక్కి పోతున్నావు కదోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం మళ్ళీ గుర్రుమని ”ఏదోలా గట్టెక్కడ మేంటి గురూగారూ… బ్రహ్మాండంగా దున్నే స్తుంటే” అన్నాడు. గిరీశం నవ్వేసి ”ఆ… ఎనా లసిస్‌లు దున్నేస్తున్నావులే. అది సరిపోదు. ప్రాక్టికల్స్‌లో కూడా గట్టెక్కాలి కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఆ… మీ తాత గిరీశం గారు అవేవో బాగా వెలగబెట్టినట్టున్నారు” అన్నాడు. దాంతో గిరీశం గతుక్కుమని ”అవుననుకో. అయినా యిపుడా చరిత్రదీ తవ్వక. ముందు నీ సంగతి చూడు. నువ్వ ర్జంటుగా మంచి సర్జన్‌ దగ్గరకిపోయి నీ నాలుకకి నిలువుగా రెండుగా చీల్పించుకునిరా” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరి పోయి ”మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”మరేం లేదోయ్‌… అసలు సిసలు పొలిటీషియన్‌ అంటే రెండు నాలుకలు ఉంటాయి కదా. కొంచెం అదేదో వివరంగా చెబుతావని” అన్నాడు. దాంతో వెంక టేశం చిన్న ఊహలాంటిది చెప్పడం మొదలెట్టాడు…

—-

వెంకటేశం యింకోసారి తలమీద తడుముకుంటూ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అలా తలమీద తడుముకునేసరికి రెండు బొడిపె ల్లాంటివి తగిలాయి. దాంతో కంగారుపడి నెత్తిమీద బొచ్చుతో వాటిని కవర్‌ చేసుకుని మరీ లోపలకెళ్ళాడు. వెంకటేశం రావడం చూసి రిసెప్షనిస్ట్‌ తలెత్తి చూసింది. ఆ బొడిపెలేవో ఆవిడ దృష్టిలో పడ్డట్టు న్నాయి. వస్తున్న నవ్వుని ఆపుకుంటున్నట్టుగా కనిపించింది. యిదేదో వెంకటేశానికి బొత్తిగా తలతీసేసినట్టుగా అనిపించింది. దాంతో గబగబా తన చాంబర్‌ వైపు నడిచాడు. ఈలోగా తలుపులు ఎదుర య్యాడు. వెంకటేశాన్ని చూడగానే తలుపులు మొహంలో అయితే బోల్డంత ఆశ్చర్యం లాంటిది కనిపించింది. ”ఏంట్సార్‌… గుళ్ళోకి వెళ్ళొస్తున్నట్టున్నారు.. అక్కడ గుమ్మం ఏదో తలకి తగిలి నట్టుంది” అన్నాడు. దాంతో వెంకటేశానికి మంచి దారి దొరికేసినట్ట యింది. ”అబ్బబ్బ…నిన్ను చూస్తుంటే ఆ బ్రహ్మంగారు గుర్తొస్తున్నా రనుకో. ఆయన జరగబోయేది చెప్పేవారు. నువ్వు జరిగింది చూసినట్టు చెప్పేస్తున్నావు” అన్నాడు. దాంతో తలుపులు నవ్వేసి ”ఊరుకోండి సార్‌… నేనేదో సరదాగా అంటే అదే నిజమంటారేంటీ ! అయినా నిన్న గ్రహణం కదా. పొద్దున్నే గుళ్ళెలా తీస్తారంట? అసలీ బొడిపె లవీ చూస్తుంటే మీ ఆవిడగారు అప్పడాలకర్ర తిరగేసినట్టున్నారు…” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఛ… ఛ.. లోకమంతా యిలాగే తగలడి నట్టుంది…”అని తిట్టుకుని ”అంటే… మా ఆవిడ నన్ను అప్ప డాలకర్రతో కొట్టడం కాదన్నమాట. నా తల వెళ్ళి అప్పడాలకర్రకి తగిలిందన్నమాట. ఆ టైంలో ఆ అప్పడాలకర్ర మా ఆవిడ చేతిలో ఉందన్నమాట. యిదంతా ఎక్కడా చెప్పక” అన్నాడు. తలుపులు తలూపి ”మీ ఆవిడగారు మిమ్మల్ని అప్పడాలకర్రతో కొట్టలేదనే అందరికీ చెబుతా” అన్నాడు.

——-

అంతా విన్న గిరీశం పగలబడి నవ్వాడు. యింతలో వెంకటేశం ”అందుకే పెళ్ళి జోలికి పోవడం లేదు గురూగారూ…” అన్నాడు. దాంతో గిరీశం ‘ఆ…ఏం సంబంధాలు వచ్చి చచ్చాయని…’ అని గొణుక్కుని ”ఆ…బాగా చెప్పావోయ్‌… సరే… యిదేదో డైరెక్ట్‌గా రాజ కీయాల్లో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం వివరంగా చెప్పడం మొద లెట్టాడు… పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కక్కలేనీ మింగలేనీ పరిస్థితిలో పడ్డాడు. ఆ మధ్య మోడీగారి పుణ్యమా అని యిండియా పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగినప్పుడు పరిస్థితి బాగానే ఉండేది. అయితే కుక్క తోక వంకర అన్నట్టుగా పాకిస్థాన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించి దొంగదారిన కాల్పులకి తెగబడింది. దాంతో 18 మంది దాకా మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ కాల్పులు తాము జరపలేదని పాకిస్థాన్‌ బుకా యించినప్పటికీ ఆ మొత్తం వ్యవహారం నడిపింది పాకిస్థానే అని ఆధారాలతో బయటపడింది. దాంతో భారతావని మొత్తం రగిలిపోయింది. యిక అప్పుడు మోడీ తన విశ్వరూపం ఏంటనేది ఈ ప్రపంచానికి చూపించాడు.  ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వందమందికి పైగా ఉగ్ర వాదులనబడే పాకిస్థాన్‌ తొత్తుల్ని ఏరిపారెయ్యడం జరిగింది. యిది భారతావనికి గొప్ప సంతృప్తినిచ్చిన, మోడీ ప్రతిష్టని ఆకాశానికి ఎత్తేసిన చర్య. ఈ చర్యకి ప్రపంచం అంతా వత్తాసు పలికింది. దాంతో పాక్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. కక్కలేనీ, మింగలేనీ పరిస్థితి వచ్చింది. దాంతో నవాజ్‌ షరీఫ్‌ అర్జంటుగా ‘ఆస్ట్రిబ్‌ మెకానిజమ్‌’ అనబడే ఉష్ట్రపక్షి వ్యవహారం మొదలెట్టాడు. ”అబ్బే… ఎవరూ చనిపోలేదు. ఏదో రొటీన్‌గా భారతీయ సైనికులు సరిహద్దు అవతల జరిపిన కాల్పులంతే’ అని కొట్టిపారేశాడు. అయితే తమ సైనికులు చనిపోయి చావు దెబ్బతినడం గుర్తొచ్చే కొద్దీ నవాజ్‌ షరీఫ్‌లో ఉక్రోషం పెరిగి పోతూనే ఉంది. దాంతో యిప్పుడు ‘ఆ… ఆమాత్రం మెరుపుదాడుల్ని మేం చేయలేమా? అయినా ఆ సర్జికల్‌ స్ట్రెక్స్‌ ఏవో భారతీయ సైనికులు కాబట్టి అలా చేశారు. అదే మా సైనికులయితేనా… యింకా బాగా చేద్దురు’ అని శెలవిచ్చాడు. మరి ముందలా వాగిన నాలుక యిప్పుడిలా మాట మార్చడం ఎంతవరకు సబబని?” అంటూ ఆపాడు. అంతా విన్న గిరీశం ”ఆ…బాగా చెప్పావోయ్‌… అయినా ఈ రెండు నాలుకల తీరు అక్కడెక్కడో పాకిస్థాన్‌లో అనే వుందిలే. యిక్కడా ఉందిగా. అదేనోయ్‌… ప్రత్యేక ¬దా విషయంలో నేతలు ఏం స్టేట్‌మెంట్లు యిస్తున్నారని…! ప్రత్యేక ¬దా వచ్చే వరకూ కేంద్రంతో ఎంతకయినా పోరాడతామని ఓసారి… అయినా ఆ ప్రత్యేక హోదా అనేది ఏవయినా అక్షయ పాత్రా… ఎందుకంట? అని యింకోసారి, ‘అయినా ప్రత్యేక హోదాని మించిన ప్రత్యేక ప్యాకేజీ ఏదో యిస్తున్నప్పుడు యింకా ఆ ప్రత్యేక హోదా ఎందుకంట?’ అని యింకో సారి దబాయిస్తున్నారు. సరే… అదలా ఉంచు. పాకిస్థాన్‌ ముష్కరుల మీద సరయిన టైంలో ఎటాక్‌ చేయించి మోడీగారు హీరో అయి పోయారు. ఆ విశ్లేషణేదో బ్రహ్మాండంగా చేసి నువ్వూ హీరో అయిపో వావు… అదే… ఈ వారం టెస్ట్‌లో పాసయిపోయావు” అన్నాడు. అయినా గురూగారూ… నన్ను పాస్‌ చేయడంలో మీరు మాట నిలబెట్టుకుంటారా అని” అన్నాడు. దాంతో గిరీశం కయ్యి మని” రెండు నాలుకలుండటానికి నేనేవయినా పొలిటీషియన్‌నను కుంటున్నావా… నేను కింగ్‌ని కాదు. కింగ్‌ మేకర్‌ని” అంటూ యింకో చుట్ట అంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి