త్వరలో మహా రాజమహేంద్రవరంగా రూపాంతరం

0
108
కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై కార్పొరేటర్లకు అవగాహన – 14న కౌన్సిల్‌లో చర్చ
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవరం అభివృద్ధిలో శరవేగంగా పయనిస్తూ చుట్టుప్రక్కల ఉన్న 13 గ్రామాలను విలీనం చేసుకుని త్వరలోనే మహా రాజమహేంద్రవరంగా రూపాంతరం చెందబోతోందని నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి అన్నారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై ఈరోజు మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కార్పొరేటర్లు, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రభుత్వ ఆమోదం పొందిందని, ఈనెల14న జరగబోయే కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి తుది ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. తొలుతగా 1975లో మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం పొందిందని, అయితే అప్పటి పరిస్థితులను బట్టి టి.నగర్‌, దానవాయిపేట, ఎ.వి.అప్పారావురోడ్‌ వంటి ప్రదేశాలను రెసిడెన్షియల్‌గా గుర్తించారని తెలిపారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో ఆ ప్రాంతాలను వాణిజ్య ప్రదేశాలుగా గుర్తించడం జరిగిందన్నారు. మధురపూడి, కాతేరు, కోలమూరు, కొంతమూరు, గాడాల, తొర్రేడు, మోరంపూడి, పాలచర్ల, పిడింగొయ్యి, దివాన్‌చెరువు,  ధవళేశ్వరం, బొమ్మూరు, లాలాచెరువు గ్రామాలు విలీనం కానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 3.50 లక్షలు జనాభా కలిగిన రాజమహేంద్రవరం గ్రామాల విలీనంతో 5.50 లక్షల జనాభాకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం నగర వైశాల్యం 44.50 చదరపు కిలోమీటర్లు ఉండగా విలీనం వల్ల 162.83 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు నగరంలోని ముఖ్య రహదారుల విస్తరణ జరుగుతుందని, లాలాచెరువు రోడ్‌, కోరుకొండరోడ్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్‌, వి.టి. కాలేజీ రోడ్‌, సోమాలమ్మ గుడి రోడ్‌ తదితర ముఖ్య రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, నగర ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌ కరగాని మాధవి, ఫ్లోర్‌ లీడర్లు వర్రే శ్రీనివాసరావు, మేడపాటి షర్మిలారెడ్డి, చీఫ్‌ విప్‌ పాలిక శ్రీను, సిటీ ప్లానర్‌  సాయిబాబా, ఏసిపి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.