లారీ మునిగింది.. పడవనూ ముంచింది..

0
243
ఇసుక రేవులో చోటుచేసుకున్న ఘటన 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : వాటర్‌ వర్క్స్‌ ప్రక్కనే ఉన్న ఇసుక ర్యాంపులో ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కలుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలలోకి వెళితే ఇసుక ర్యాంపులో పడవ ద్వారా తెచ్చే ఇసుకను ర్యాంపులో వేయడం లేదా లారీ సిద్ధంగా ఉంటే నేరుగా అందులో లోడు చేయడం జరుగుతుంటుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ లారీ ఇసుక లోడు నిమిత్తం ర్యాంపుకు వచ్చింది. పడవ నుంచి నేరుగా లోడు చేయాలన్న ఉద్దేశ్యంతో గోదావరిలో ఉన్న పడవకి సమీపంగా లారీని ఆపి లోడు చేయిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా లోడు అవుతున్న లారీ నేరుగా గోదావరిలో ఉన్న పడవవైపు దూసుకుపోయింది. లారీ ఢీకొనడంతో పడవ మునిగిపోవడంతోపాటు లారీ కూడా గోదావరిలోకి పూర్తిగా కొట్టుకుపోయింది. క్షణాల్లో ఈ సంఘటన జరిగిపోయింది. అదృష్టవశాత్తూ పడవలో ఉన్న కార్మికులు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోదావరిలో మునిగిపోయిన లారీ, పడవలను బయటకు తెచ్చేందుకు జెసిబిని రప్పించారు.