రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలి

0
67
బిసి విద్యార్ధి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీను
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 8 : రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వెంటనే ఎపిపిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర బిసి విద్యార్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు మరుకుర్తి దుర్గా యాదవ్‌ డిమాండ్‌ చేశారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గాయాదవ్‌ మాట్లాడుతూ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. నెలరోజుల్లోగా నోటిఫికేషన్‌ జారీ చేసి ఉద్యోగాల ఖాళీల భర్తీకి పూనుకోకుంటే బిసి విద్యార్ధి సంక్షేమ సంఘంగా పోరాడతామన్నారు. బిసి హాస్టల్స్‌లో వారానికి ఒకమారు చికెన్‌ కర్రీ పెట్టాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించిందని, అదే విధంగా ఇక్కడ అమలు చేయాలని, అలాగే బిసి హాస్టల్స్‌లో సన్నబియ్యంతో భోజనం పెట్టాలని డిమాండ్‌ చేశారు. బిసి విద్యార్ధి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీనును నియమిస్తూ ఈమేరకు ఉత్తర్వులను అందజేశారు. బిసి విద్యార్ధి సంఘం బలోపేతంకు కృషిచేయాలని సూచించారు. విద్యార్ధి సమస్యలపై పనిచేస్తున్న గాడి శ్రీను సేవలకు గుర్తింపుగా ఈ పదవిలో నియమిస్తునానమన్నారు. బిసి సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక కులానికి రుణాలు అందించడంలో చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రభుత్వం బీసీలకు అందించడంలో చూపడం లేదన్నారు. బిసి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందిస్తున్నప్పటికీ బ్యాంక్‌ల నుంచి అంగీకార పత్రాలు రాకపోవడంతో రుణాలు అందడం లేదన్నారు. బిసిలు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బదులను తొలగించాలని కోరారు. బిసి సంఘం బలోపేతానికి గాడి శ్రీను కృషిచేయాలని సూచించారు. తనను పదవిలో నియమించిన దుర్గాయాదవ్‌,  మజ్జి అప్పారావు, జిల్లా నాయకులు దొమ్మేటి సోమశంకరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి గంగుల సూర్యారావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్ధుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానన్నారు. విలేకరుల సమావేశంలో నగర బిసి విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కొల్లి దీసు తదితరులు పాల్గొన్నారు.