పరిశుభ్రమైన మంచినీటి సరఫరా జరిగేలా కృషి

0
57
పదవీ బాధ్యతలు స్వీకరించిన వాటర్‌ వర్క్స్‌ సబ్‌ కమిటీ
 
రాజమహేంద్రవరం, అక్టోబరు 12 : రాజమహేంద్రవరం నగర ప్రజానీకానికి నగరపాలకసంస్ధ మంచినీటి సరఫరా విభాగం ద్వారా పరిశుభ్రమైన మంచినీరు సరఫరా జరిగేలా కృషి చేస్తామని వాటర్‌వర్క్స్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, 26వ వార్డు కార్పొరేటర్‌ పల్లి శ్రీనివాస్‌ అన్నారు. వాటర్‌ వర్క్స్‌ సబ్‌ కమిటీలో నియమితులైన కార్పొరేటర్లు విజయదశమి ముహర్తంగా పదవీబాధ్యతలను స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పాండురంగారావు కన్వీనర్‌గా మొదటి సమావేశం చైర్మన్‌ పల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు 18వ వార్డు కార్పొరేటర్‌ మానుపాటి తాతారావు, కార్పొరేటర్‌ పిల్లి నిర్మల, కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌.ఎన్‌.జె.ఉన్నీసా సుభాన్‌, కోఆప్షన్‌ సభ్యులు ఎ.సంజీవరావు, డిఇఇ సిహెచ్‌.వెంకటేశ్వరరావు, టేప్‌ఇనస్పెక్టర్లు, మీటర్‌ రీడర్స్‌ పాల్గొన్నారు. వాటర్‌వర్క్స్‌ విభాగానికి సంబంధించిన వివరాలు తెలియచేస్తూ పరిచయ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పాండురంగారావు నిర్వహించారు. గృ¬పయోగ, వాణిజ్య అవసరాలకు సంబంధించి మొత్తం 35 వేల కనెక్షన్లు వున్నాయని, 1800 వరకు పబ్లిక్‌ టాప్‌ కనెక్షన్లు వున్నాయని వాటర్‌వర్క్స్‌ విభాగం అధికారులు తెలిపారు. పైప్‌లైన్‌ లీకేజిలు, కొత్త ప్రాంతాలకు పైప్‌లైన్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రజలు తెలియచేస్తున్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కొత్తపైప్‌లైన్‌ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలు అందచేస్తే కమిటీ ద్వారా మేయర్‌, కమిషనర్‌లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. అందరు కార్పొరేటర్లుతో మాట్లాడి వారందరి నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్తపైప్‌లైన్‌ అవసరం వున్న ప్రాంతాలపై నివేదికను ఇస్తామని చైర్మన్‌ పల్లి శ్రీనివాస్‌ తెలిపారు. తమపై గురుతర బాధ్యత వుంచి వాటర్‌వర్క్స్‌ కమిటీలో నియమించిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీశేషసాయిలు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని చైర్మన్‌ పల్లి శ్రీనివాస్‌, సభ్యులు తెలిపారు.