బివిఆర్‌ఎస్‌  రాష్ట్ర కన్వీనర్‌గా కందికొండ రమేష్‌ నియామకం

0
71
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రతి విద్యార్ధికి ప్రభుత్వపరంగా నాణ్యమైన విద్య అందించే దిశగా పోరాటం చేస్తున్న భారతీయ విద్యార్ధి రిజర్వేషన్‌ సమితి (బివిఆర్‌ఎస్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ కన్వీనర్‌గా నగరానికి చెందిన కందికొండ రమేష్‌ని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఎస్‌.బి.ఎన్‌.చారి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఎస్‌.బి.ఎన్‌.చారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవడం మన జన్మహక్కు అని, ప్రజలు ఈ విషయం గ్రహించక ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారని, ప్రభుత్వం ఏటా ప్రతి విద్యార్ధి మీద రూ.50వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా యుపిలోని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే ఎంపి, ఎంపిటిసి, జెడ్పీటిసి, అధికారులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తీర్పు ఇచ్చిందన్నారు. త్వరలో యుపి హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఎపి, తెలంగాణాలు కూడా ఆశ్రయిస్తాయన్నారు. కందికొండ రమేష్‌ మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా ఉచిత విద్యను అందించాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వశిక్షాభియాన్‌ పేరుతో కొన్నివేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. కార్పొరేట్‌ విద్య పేదవారికి అందాలని, కాని అధికారులు ఆ సొమ్మును కూడా దుర్వినియోగం చేస్తోందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్‌, బర్ల శివశంకర్‌, పి.శివ, అశోక్‌, కె.అప్పారావు పాల్గొన్నారు.