ఆన్‌లైన్‌లో కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ 

0
66
రవాణా శాఖలో 15 నుంచి కొత్త విధానం
 
రాజమహేంద్రవరం, అక్టోబరు 13 : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టన ఇ-ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా చేపట్టడానికి రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రక్రియలో రవాణా శాఖ ప్రధాన భూమిక వహిస్తూ ఇప్పటికే కంప్యూటరీకరణలో ముందంజలో ఉన్నందున కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌ చేసే విధంగా ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియలో డీలరు వాహనము అమ్మిన తరువాత వాహనదారుడి నుండి కావలసిన ధృవీకరణ పత్రాలను, వాహనం ఫొటోలు ఆన్‌లైన్‌లో రవాణా శాఖకు అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రొత్త విధానంలో ఆధార్‌ నెంబరు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆధార్‌ నెంబరు ఆధారంగా కస్టమర్‌ అడ్రస్సు తదితర వివరాలను సేకరిస్తారు. ఇప్పటివరకు చేసినట్లు వ్యక్తి అడ్రస్సు, పేరు తదితర వివరాలు టైపు చేయనక్కరలేదు. ఆధార్‌ నెంబరు టైపు చేయగానే వారి వివరాలన్ని యాంత్రికంగా లభ్యమవుతాయి. ఈ దృష్ట్యా చేసేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం లేదు. అలాగే వాహనం సాంకేతిక వివరములు కూడా ఇది వరకు వలె టైపు చేయవలసిన పని లేదు. వాహన వెబ్‌సైట్‌లో అనుసంధానం చేయడం ద్వారా వాహనం ఇంజన్‌ నెంబరు ఛాసిస్‌ నెంబరు టైపు చేయగానే  వాహనం వివరములు లభ్యమవుతాయి. తరువాత  రవాణా శాఖ ఆఫీసులో ఆ వాహనం పత్రాలు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం చేసిన వెంటనే సదరు వాహనమునకు పర్మినెంట్‌ నెంబరు ఇస్తారు. రవాణా శాఖలోని సిబ్బంది ఇది వరకు ఏ విధమైన బాధ్యతలు నిర్వహించేవారో ఇప్పుడు కూడా అదే విధమైన బాధ్యతలను నిర్వహిస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి రానవసరం లేకుండా ఆయా పత్రాలను డీలర్ల వద్ద నుండి అప్‌లోడ్‌ చేయుట ద్వారా రవాణాశాఖ సిబ్బందికి పంపుతారు. కార్యాలయంలో క్లర్కు మరియు మోటారు వాహనముల ఇన్‌స్పెక్టర్‌ పత్రాలు పరిశీలించి ధృవీకరించిన పిదప అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సదరు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆమోదిస్తారు. తరువాత సెల్‌ఫోన్‌, ఇ-మెయిల్‌ ద్వారా కస్టమరుకు వివరాలు తెలియజేశారు. రవాణా సిబ్బంది, అధికారుల ప్రోద్బలంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించే విధంగా ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ రూపొందించారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రవాణా శాఖలోని సిబ్బంది అందరూ మనస్ఫూర్తిగా చేసిన కృషి ఫలితంగా ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ అత్యంత త్వరగా పూర్తిచేసి ప్రజలు  అందుబాటులో ఉంచేందుకు వీలు పడుతుంది.  రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.శాంబాబు, రవాణా శాఖ కమిషనర్‌ ఎన్‌.బాల సుబ్రహ్మణ్యం, అదనపు  కమిషనర్‌ పి.శ్రీనివాస్‌, జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌.ఎ.వి.ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్‌ రమాశ్రీ ఈ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషను విధానముపై వాహన డీలర్లకు  దివాన్‌చెరువు, గైట్‌ కాలేజిలో ఈరోజు శిక్షణ ఇచ్చారు. ఈ విధానం ఈనెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది.