నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

0
57
రాజమహేంద్రవరం, అక్టోబరు 13 : నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని రాజమహేంద్రి మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఇన్‌స్పెక్టరు శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. స్థానిక విద్యాసాగర్‌కు చెందిన వానపల్లి రాంప్రసాద్‌ నిషిత డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ పేరుతో ఇనిస్టిట్యూట్‌ నిర్వహిస్తున్నాడు. అతడు ఎటువంటి విద్యార్హత లేకుండా డిగ్రీ పాస్‌ చేయిస్తానని ప్రచారం చేశాడు. ఇది నమ్మిన కాతేరుకు చెందిన సయ్యద్‌ అత్తర్‌ ఆలీ బీకాం సర్టిఫికెట్‌ నిమిత్తం రూ.15వేలు చొప్పున రెండు దఫాలు రూ.30వేలు చెల్లించాడు. అతడికి రాంప్రసాద్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ ఇచ్చాడు. వాటితో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సయ్యద్‌ అత్తర్‌ ఆలీకి అవి నకిలీవని తెలియడంతో మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన ఎస్సై సుమన్‌ దర్యాప్తు చేసి నిందితుడు రాంప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి నకిలీ సర్టిఫికెట్లు తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి డిమాండ్‌ విధించారు.