చుట్టంగా వస్తాడు…దొరికింది చక్కబెడతాడు

0
145
కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడే మైనర్‌ దొంగ అరెస్టు 
 
సహకరిస్తున్న మరో వ్యక్తి అరెస్టు- రూ. లక్షా 50 వేల నగదు స్వాధీనం
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  13 : ఆ బాలుడి హడావిడి చూసి మగ పెళ్ళివారి తాలుకు అని ఆడ పెళ్ళివారు అనుకుంటారు… ఆడపెళ్ళి వారి తాలుకేమోనని మగ పెళ్ళివారు అనుకుంటారు… అయితే ఆ బాలుడు ఎవరి తాలూకూ కాదు…. అదును చూసి వివాహ వేదికల్లో  ఖరీదైన ఆభరణాలను, నగదును దోచుకుపోయే  కుర్ర దొంగ. గత కొద్ది రోజులుగా నగరంలో ఇటువంటి చోరీలకు పాల్పడుతున్న ఆ మైనర్‌ బాలుడ్ని, అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని ప్రకాశం నగర్‌ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద లక్షా  50 వేల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశంనగర్‌తో పాటు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు చోరీలకు పాల్పడిన మైనర్‌ దొంగ, అతనికి సహకరిస్తున్న వ్యక్తి వివరాలను డిఎస్పీ కె.రమేష్‌బాబు ఈరోజు మీడియాకు వెల్లడించారు. రూరల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈ మైనర్‌ బాలుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించడానికి చోరీల బాట ఎంచుకున్నాడు. శుభ కార్యాలు జరిగే స్ధలాలకు బంధువుగా వెళుతూ అక్కడ ఉండే విలువైన వస్తువులను, నగదును కాజేసి ఆ సొమ్ముతో జల్సా జీవితం గడుపుతున్నాడు.  అయితే ఈ నెల 6 న గారపాటి జగన్మోహనరావు అనే ఆసామి తన మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా జెఎన్‌ రోడ్డులోని ఎస్‌ వి ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు.  ఆ వేడుకకు ఈ మైనర్‌ దొంగ బంధువుగా ప్రవేశించి పుట్టినరోజు వేడుక జరుపుకున్న బాలికకు వచ్చిన నగదు, బంగారు వస్తువులను అపహరించి అక్కడ్నుంచి ఉడాయించాడు. దీంతో జగన్మోహనరావు ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటొలు, వీడియోలను పరిశీలించి మైనర్‌ దొంగను గుర్తించారు. ఈరోజు ఉదయం 6 గంటలకు మైనర్‌ దొంగను, అతనికి సహకరించిన వ్యక్తిని ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా 50 వేల రూపాయల నగదును,  17 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  మరో ఘటనలో బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన ఐదు సెల్‌  ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. విలేకరుల సమావేశంలో సి ఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.