సమస్యల ఏకరవు….పరిష్కారం ఏపాటి?

0
281
నగర పాలక మండలిలో గళమెత్తిన కార్పొరేటర్లు
 
ప్రశ్నోత్తరాల సమయంలోనూ గందరగోళం…వాగ్వివాదాలు
 
కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై చర్చకు వచ్చే శుక్రవారం ప్రత్యేక సమావేశం
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  14 : సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన నగర పాలక మండలి సమావేశంలో ఈరోజు ఓ కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఇంతకు ముందు తమ డివిజన్లలో సమస్యలను చెప్పుకునేందుకు  ముందుకొచ్చిన కార్పొరేటర్లకు మాత్రమే ఆ అవకాశం కల్పించేవారు. అయితే ఈరోజు జరిగిన పాలక మండలి సమావేశంలో అడిగిన వారికి, అడగనివారికి అనే తేడా లేకుండా డివిజన్ల వారీగా కార్పొరేటర్లందరికి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని చాలా మంది కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను ఏకరవు పెట్టారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ఎజెండాను చేపట్టడానికి ముందు సమస్యలను పాలకమండలి, అధికారులు దృష్టికి తెచ్చేందుకు కార్పొరేటర్లకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు కార్పొరేటర్లు రెండు గంటలకు పైగా తమ తమ డివిజన్లలో సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాల్గవ డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించినప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుతగిలారు. ఎజెండాలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ను ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు మాట్లాడవచ్చని, ఇప్పుడెందుకంటూ వారు అభ్యంతరం చెప్పినప్పుడు కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సమయంలో అధికార పార్టీ సభ్యుడొకరు బొంత శ్రీహరి వైపు వేలు చూపుతూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై బిజెపికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభ్యంతరం చెప్పారు.ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన హితవు చెప్పారు. ఓ పద్ధతి ప్రకారం సమావేశం  నిర్వహించాలనుకుని అనుకున్నప్పుడు సభ్యులంతా ఆ ప్రకారమే వ్యవహరించవలసి ఉంటుందని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అనగా ముందుగా డివిజన్లలో సమస్యలను చర్చించాక ఎజెండా అంశాలను చర్చించవచ్చని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈ సమయంలో బొంతా శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమస్యల ప్రస్తావనలోనూ గందరగోళం నెలకొంది. పద్ధతిగా వ్యవహరించడం లేదంటూ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, చీప్‌ విప్‌ పాలిక శ్రీను తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా 50 వ డివిజన్‌ నుంచి సమస్యల ప్రస్తావనకు కార్పొరేటర్లకు మేయర్‌ అనుమతించారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోగా వీరితో పాటు కో ఆప్షన్‌ సభ్యులు కూడా కొన్ని అంశాలను, సమస్యలను ప్రస్తావించారు. వీరి చెప్పిందంతా కమిషనర్‌ విజయరామరాజు సావధానంగా విని వాటిని నోట్‌ చేసుకున్నారు.
 
పందులు, కుక్కల బెడద నివారించండి
 
సమావేశంలో పలువురు సభ్యులు తమ తమ ప్రాంతాల్లో కుక్కలు, పందులు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారని అన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్ధ, పారిశుద్ధ్యం, సక్రమంగా లేదని తెలిపారు. అలాగే నగరంలో పశువులు విచ్చలవిడిగా సంచరించుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగడమే గాక ప్రమాదాలు జరుగుతున్నాయని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు.
 
అధికారుల మధ్య సమన్వయం అవసరం : వాసిరెడ్డి
 
నగర పాలక సంస్ధలో వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరమని డిప్యూటీ మేయర్‌  వాసిరెడ్డి రాంబాబు అన్నారు. లేకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాల మధ్య ఈ సమన్వయం కొరవడిందన్నారు. తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డివిజన్‌లో పందుల, కుక్కల సమస్య, పశువుల బెడద అధికంగా ఉందని తెలిపారు. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌   కోరుమిల్లి విజయ్‌శేఖర్‌ మాట్లాడుతూ కుక్కల వధపై ఆంక్షలు ఉన్నా పిచ్చిక్కుల్ని, వ్యాధుల బారినపడిన కుక్కల్ని వధించకపోతే మనుషులకు ప్రాణాంతకంగా మారాయని, ఇప్పటి వరకు అటువంటి కుక్కల్ని ఎన్నింటిని వధించారని ప్రశ్నించారు.  తెదేపా చీఫ్‌ విప్‌ పాలిక శ్రీను తమ డివిజన్‌లో సమస్యల్ని ప్రస్తావించారు.
 
క్వారీ గోతుల్ని తక్షణమే పూడ్చండి
 
ముందుగా 49 వ డివిజన్‌ కార్పొరేటర్‌ బర్రే అను హెలెనియా మాట్లాడుతూ ప్రమాదభరితంగా మారిన క్వారీ గోతుల్ని తక్షణమే మట్టితో పూడ్చాలని కోరారు. కోరుకొండ రోడ్డులో డ్రైన్లు అస్తవ్యస్ధంగా ఉన్నాయని, పుట్‌పాత్‌లు కూడా సక్రమంగా లేకపోవడంతో నడవడానికి వీలు లేక కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారని 43 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కంటిపూడి పద్మావతి అన్నారు. 23 వ డివిజన్‌ కార్పొరేటర్‌ యిన్నమూరి  రాంబాబు మాట్లాడుతూ పుష్కరాల రేవులో గేట్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. తమ డివిజన్‌లో ముంపు సమస్య నివారించాలని, డ్రైనేజీ వ్యవస్ధను అభివృద్ధి చేయాలని కోరారు. 22 వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాటూరి రంగారావు(బేబీరావు) మాట్లాడుతూ తమ డివిజన్‌లో ప్రమాదభరితంగా మారిన పురాతన భవనాలను తొలగించాలని, పశువుల సంచారాన్ని అరికట్టాలని కోరారు. 21 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ  తమ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్ధను అభివృద్ధి పర్చి ముంపు సమస్యను నివారించాలని, డ్రైన్లలో చెత్తను, సిల్ట్‌ను పూర్తి స్థాయిలో తొలగించేలా చూడాలని కోరారు. ఇరుకు రహదారులు ఉండే తమ డివిజన్‌లో చిన్నసైజు డస్ట్‌బిన్లను ఏర్పాటు  చేయాలని కోరారు. అలాగే ఖాళీ స్ధలాల్లో వ్యర్ధ మొక్కలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.16 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కిలపర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కుక్కల, పందుల బెడద అధికంగా ఉందన్నారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు.
 
రెండు నెలలకో పర్యాయం సమావేశాలు నిర్వహించాలి
 
 కౌన్సిల్‌ సమావేశాలను ప్రతి రెండు నెలలకో మారు విధిగా నిర్వహించాలని  12 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గొర్రెల సురేష్‌ కోరారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న  సెక్యురిటీ సిబ్బంది జీతాలను పెంచాలన్నారు.  11 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గగ్గర సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించడం శుభ పరిణామమన్నారు. ఆరవ డివిజన్‌ కార్పొరేటర్‌ మజ్జి మౌనిక సుధారాణి మాట్లాడుతూ అధికారులు ప్రొటొకాల్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఐదవ డివిజన్‌ కార్పొరేటర్‌ తలారి ఉమాదేవి మాట్లాడుతూ కంబాలచెరువులోకి మురుగు నీరు వెళ్ళి దుర్గంధం వెదజల్లుతోందని, పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.వెంకటేశ్వర మఠం వీధి ప్రాంతంలో ఉన్న స్ధలంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మూడవ డివిజన్‌ కార్పొరేటర్‌ బొంత శ్రీహరి మాట్లాడుతూ ప్రతి వారం స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. రెండవ డివిజన్‌ కార్పొరేటర్‌ పితాని లక్ష్మీ తదితరులు మాట్లాడారు. 
 
 మాస్టర్‌ ప్లాన్‌పై చర్చకు వచ్చే శుక్రవారం ప్రత్యేక సమావేశం
 
నగరానికి కొత్తగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను చర్చించి ఆమోదించేందుకు వచ్చే శుక్రవారం నగర పాలక మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు ఎజెండాలో ఈ అంశం ఉన్నా విస్తృతంగా చర్చించేందుకు వీలుగా ఈ నెల 21న ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాలని నిర్ణయించారు. అంతకు ముందు కో ఆప్షన్‌ సభ్యులు ఏ.సంజీవరావు మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించిన కార్పొరేటర్లకు అందించిన సమాచారం ఆంగ్లంలో ఉండటంతో పాటు గందరగోళంగా ఉందని, దీనిని తెలుగులో ముద్రించి ఇవ్వాలని కోరారు. 41 వ  డివిజన్‌ కార్పొరేటర్‌ మర్రి దుర్గా శ్రీనివాస్‌, నండూరి వెంకటరమణ, కోసూరి చండీప్రియ కోరారు. మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్ర చర్చ జరగాలన్నారు. తమకు ప్రొటోకాల్‌ దక్కడం లేదని కార్పొరేటర్‌ చండీప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.