అదేమీ తీరు….

0
79
కౌన్సిల్‌ నిర్వహణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అసంతృప్తి 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  15 : నగర పాలక మండలిలో ప్రతిపక్షంగా ఉన్న తాము నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని, సభా మర్యాదలు పాటిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి తెలిపారు. జాంపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ నిన్న జరిగిన కౌన్సిల్‌ సమావేశం సజావుగా సాగాలని భావించి  ఎక్కడా ఆటంక పర్చలేదన్నారు. డివిజన్‌ సమస్యలతో పాటు నగరానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించే అవకాశం ఉన్నా తమపై ఎదురు దాడి చేస్తూ అసభ్య పదజాలంతో అవమానించే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. అధికార పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడినా తాము సహించి సభ సజావుగా జరిగేలా సహకరించామన్నారు. ఐదు నెలలకో మారు నిర్వహిస్తున్న సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. డివిజన్‌ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రాబట్టకుండా ఏజెండాలోకి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనమేమిటన్నారు. నైట్‌ షెల్టర్‌ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై తాము ప్రశ్నిస్తుండగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అడ్డుపడి అవినీతిపై మాట్లాడే అర్హత లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి తెదేపా అవినీతిని బయటపెడతానంటూ సవాలు చేసిన ఆదిరెడ్డి ఇపుడు అవినీతిపై మాట్లాడే  అర్హత  వైకాపాకు లేదనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. మెజార్టీ కలిగి ఉండి 13 వ ఆర్ధిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించులేకపోవడం చేతకాని తనం కాదా అని ఆమె ప్రశ్నించారు. కొర్పొరేటర్‌ బొంతా శ్రీహరి మాట్లాడుతూ డివజన్ల వారీగా మాట్లాడే అవకాశం కల్పించినపుడు తాను సమస్యలపై ప్రస్తావిస్తుండగా ఎమ్మెల్సీ ఆదిరెడి ్డ అడ్డు పడి తన గుట్టు విప్పుతానని చెప్పడంతో పాటు తన చరిత్ర తెలుసని సభలో చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. తన చరిత్ర  రాసే  హక్కులు ఆయనకు ఇస్తున్నానన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తే తాను కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేసి నగరంలో ఏ డివిజన్‌ నుంచైనా తనతో పోటీకి రావాలని సవాలు విసిరారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల,  మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్‌ దంగేటి వీరబాబు, పార్టీ నాయకురాలు సాలా సావిత్రి పాల్గొన్నారు.