ఇంట్లో చెప్పాపెట్టకుండా మద్రాసు వెళ్ళి నటుడైన పద్మనాభం

0
52
నడి వేసవికాలం – సూర్యుడు మాడు పగల గొట్టే ఎండ – విజయవాడ నగరంలో సిమెంటు రోడ్డుపై ఇటు పాదాలు, అటు శీర్షం – పెనం మీద పెడుతున్నట్టుగా వుండే వాతావరణంలో కరుణ రసాన్ని పండిస్తూ – ”ఆకలేసి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు – కడుపు నుండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు” ఈ చరణాలను అభినయంతో రక్తి కట్టించిన హాస్య నటశేఖరుడు పద్మనాభం. ‘దేశోద్ధారకులు’ చిత్రంలోని ఈ కీలక సన్నివేశంలో అలనాటి ‘పెద్ద మనుషులు’ చిత్రంలో రేలంగి పోషించిన తిక్క శంకరయ్యను గుర్తుకు తెచ్చారు. తెలుగు టాకీ పుట్టిన 1931లోనే ఆగస్టు నెల 20వ తేదీన జన్మించిన బసవరాజు పద్మనాభం అయిదేళ్ళ వయసులోనే ‘చింతామణి’ నాటకంలో బాలకృష్ణుని వేషం వేసి రక్తి కట్టించారు. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాలు విపరీతంగా చూడటం, ఆ పాటలు పాడటం. సన్నివేశాలను అభినయించి మిత్ర బృందాన్ని, జనాన్ని అలరించటం హాబీగా మారింది. సైకిలు కొనుక్కోవాలి అంటే – డబ్బులు కావాలి. అంటే సినిమాల్లో నటిస్తే డబ్బులొస్తాయి. ఈ ఆలోచనతో ఇంట్లో చెప్పా పెట్టకుండా రైల్లో మద్రాసు చెక్కేశారు పద్మనాభం. అక్కడ కన్నాంబ గారింటికి వెళ్ళి పద్యాలు పాడి ఆమెను మెప్పించి వారింట్లో ఆశ్రయం పొందారు. ఆ తర్వాత ‘త్యాగయ్య’ తీసిన నాగయ్య గారి దగ్గర ఆశ్రయం పొంది అందులో వేషం వేశారు. ఆనాటి ప్రముఖ రంగస్థలనటులందర్నీ అనుకరించి వారి చేతనే ప్రశంసలు అందుకున్నారు. నాగేశ్వరరావు గారి రెండో చిత్రం ‘మాయాలోకం’ పద్మనాభానికి సినీ నటుడిగా తొలి చిత్రం కావడం విశేషం. ‘షావుకారు’ సినిమాలో పొలంలో వేషం కోసం గుండు చేయించుకొని అర్థంలేని నవ్వుతో వేషం పండించారు. విజయా సంస్థ తీసిన ‘పాతాళ భైరవి’లోని సదాశివుని పాత్ర పద్మనాభం నట జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమాల్లో వేషాలు వేస్తూనే నాటక రంగాన్ని విస్మరించక సి.ఎస్‌.ఆర్‌.తో కలిసి భక్త తుకారాం, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేవారు. ఈ దిశగా చెప్పుకోదగ్గ గొప్ప నాటకాలు రెండు. కాళహస్తి మహత్మ్యం, శాంతి నివాసం. పద్మనాభం కొడుకు పేరు మురళి. వల్లం నరసింహారావు కూతురు పేరు రేఖ. ఆ యిద్దరి పేర్లతో రేఖ అండ్‌ మురళి పతాకంపై ఆ నాటకాలు వూరూరా ప్రదర్శించారు. తరువాత ‘శాంతి నివాసం’ను సినిమాగా తీశారు. నాటకంలో పద్మనాభం వేసిన వేషాన్ని సినిమాలో నాగేశ్వరరావు ధరించారు. ఆ రోజుల్లో  నాటక ప్రదర్శనలో రవీంద్రభారతి స్టేజి పైకి కారును తీసుకు వచ్చి నాటకాన్ని ప్రదర్శించారు పద్మనాభం.  1961లో వచ్చిన ‘భార్యాభర్తలు’ చిత్రంలో విలన్‌ టచ్‌ వున్న హాస్య పాత్ర ఆంజనేయులు పద్మనాభం జీవితాన్ని మరో మలుపు తిప్పింది. అక్కడ్నుంచీ వందలాది వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఒక్క గీతాంజలి కాంబినేషన్‌లోనే దాదాపు యాభై చిత్రాల్లో హాస్య జంటగా రాణించారు. నిజానికి కమెడియన్‌గా 1962 నుంచి 72 వరకు ఓ పుష్కర కాలం పద్మనాభం హవా కొనసాగింది. ఈ దశలోనే నిర్మాతగా మారి ఎన్‌టిఆర్‌ – సావిత్రి కాంబినేషన్‌లో ‘దేవత’ చిత్రాన్ని కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో రూపొందించగా అది ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత భమిడిపాటి రాధాకృష్ణ నాటకం ‘ఇదేమిటి’ ఆధారంగా ‘పొట్టి ప్లీడరు’ తీశారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంను గాయకుడిగా పరిచయం చేసిన చిత్రం ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. ఇంటూరి వెంకటేశ్వరరావు చారిత్రాత్మక నవల ఆధారంగా స్వీయ దర్శకత్వంలో ‘కథా నాయిక మొల్ల’ నిర్మించగా, దానికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది లభించింది. సుమారు నాలుగు వందల జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటుడుగా రాణించిన పద్మనాభంలో మరో పార్శ్వం పరిశీలిస్తే.. ‘సినిమా వైభవం’ అనే చిత్రం తీయటానికి ఆర్థిక అవసరాల రీత్యా పాత చిత్రాలను ఫైనాన్షియర్‌ వద్ద తాకట్టు పెట్టడం – ఆ వ్యవహారంలో వారి చుట్టూ తిరగటం  సినిమా వేషాలు తగ్గి పోవటం – దానితో ‘పూలమ్మిన చోటనే కట్టెలమ్మే’ పరిస్థితి. భార్య ప్రమీల మరణిస్తే ఆమె అస్థికలను బుట్టలో పెట్టుకుని అనకాపల్లిలో రంగస్థలంపై ‘చింతామణి’ నాటకంలో సుబ్బిశెట్టిగా నవ్వులు కురిపిస్తూ – గుండెలో బాధను అనుభవించటం. ఈ సన్నివేశం జీవితంలో మరువలేనంటారు పద్మనాభం. కాంతారావు తరువాత నారదునిగా మెప్పించిన ఘనత పద్మనాభందే. హాలీవుడ్‌ నటుడు జెర్రీ లూయిస్‌ తరహాలో ఓ కొత్త హెయిర్‌ స్టైయిల్‌తో రాణించారు. ఒక ముష్టివాడికి పది రూపాయలు దానం చేసి వాడు పొందిన తృప్తిని గమనించి, దానిని తాను గ్రుడ్డివాడిగా నటించినప్పుడు (జాతకరత్న – మిడతం బొట్లు) తన నటనలో ప్రదర్శించారు. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి, ధనం సంపాదించి స్వయంకృతాపరాధాల వల్ల తమ భవిష్యత్‌కు చరమ గీతం పాడుకున్న వారి జాబితాలో చేరిన పద్మనాభం శాపగ్రస్తుడే. అయినా నటుడిగా ఆయన చిరంజీవే.
అడబాల మరిడయ్య కాపు, దొడ్డిగుంట