ఐఏఎస్‌లకు మానవత్వంపై శిక్షణా తరగతులు ఇవ్వాలి

0
54
మాజీ సైనికుని స్ధలం స్వాధీనంపై సివిసికి ఫిర్యాదు చేస్తాం
లోక్‌సత్తా నగర కన్వీనర్‌ రాజగోపాల్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  16 : రెండవ ప్రపంచ యుద్ధంలో సిపాయిగా పనిచేసిన  మెండి వీరాస్వామికి ప్రభుత్వం ఇచ్చిన స్ధలాన్ని నగర పాలక సంస్ధ కమిషనర్‌ అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై కేంద్ర ముఖ్య విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్ధ నగర కన్వీనర్‌ ఎం.వి.రాజగోపాల్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  నగర పాలక సంస్ధ అధికారుల అక్రమంపై ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, సబ్‌ కలెక్టర్‌కు విన్నవించుకున్నా తాను జోక్యం చేసుకోలేనని చెప్పడం బాధ కలిగించిందన్నారు. తగిన ఆధారాలతో, అధికారులతో జరిపిన చర్చల నివేదికలతో కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌కు, ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదుల పత్రాలను పంపుతున్నామన్నారు. ఐఏఎస్‌ అధికారులకు మానవత్వంపై కొన్ని శిక్షణా తరగతులు ఇవ్వాల్సిన ఆవశ్యకతపై యూపీఎస్సీకి లేఖ పంపుతున్నామన్నారు. కమిషనర్‌ వెనుక ఉన్న శక్తి ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందని, ఇది పూర్తిగా దురాక్రమణ అని అన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. విలేకరుల సమావేశంలో లోక్‌సత్తా నాయకులు సీఎస్‌ కామేశ్వరరావు, జిల్లా వినియోగదారుల పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి డి.నారాయణశర్మ,  మెండి వీరాస్వామి కోడలు రమణమ్మ, మనుమడు శ్రీహరి, మనుమరాలు కాకి జ్ఞానేశ్వరి, జ్యోతి శ్రీకాంత్‌ పాల్గొన్నారు.